– బ్యాడ్జీలు లేకుండా పోలీసు డ్రస్సులతో వస్తున్నారు
– కౌంటింగ్ సెంటర్ల వద్ద రక్షణ పెంచండి
– ఈసీకి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు రెండు లేఖలు
ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ సెంటర్ల వద్ద అరాచకాలు సృష్టించేందుకు అధికార వైసీపీ కుట్రలకు పాల్పడుతోందని టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబునాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. ఫలితాలు చెడగొట్టేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. తిరుపతి పోలింగ్ సెంటర్ల వద్ద జరిగిన అక్రమాలను మీ దృష్టికి తీసుకువెళ్లినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని, ఈసీకి రాసిన రెండు లేఖల్లో బాబు నిరసన వ్యక్తం చేశారు. ఇప్పుడు కౌంటింగ్ సెంటర్ల వద్ద రక్షణ పెంచకపోతే ప్రజాస్వామ్యానికి అర్ధం ఉండదని బాబు ఆందోళన వ్యక్తం చేశారు. బాబు లేఖ సారాంశం ఇదీ..
ఎమ్మెల్సీ ఎన్నికల్లో అక్రమాలపై పలు విషయాలు వివరిస్తూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి రెండు వేర్వేరు లేఖలు రాసిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు
లేఖ -1 లోని అంశాలు:-
• పశ్చిమ రాయలసీమ నియోజకవర్గం ఎమ్మెల్సీ పట్టభద్రుల కౌంటింగ్ సెంటర్లో కొందరు వ్యక్తులు సాధారణ దుస్తుల్లో తిరుగుతూ పోలీసులమని చెప్పుకుంటున్నారు.
• కౌంటింగ్ హాల్‌లోకి ప్రవేశించే ఏ వ్యక్తి అయినా పాస్ లేదా గుర్తింపు కార్డును విధిగా ప్రదర్శించాలి.
• అయితే సివిల్ డ్రస్ లో ఉన్న పోలీసులమని చెప్పుకుంటున్న వ్యక్తులు ఎటువంటి పాసులు, ఐడి కార్డులు కలిగిలేరు
• ప్రతిపక్ష కౌంటింగ్ ఏజెంట్లను బెదిరించేందుకు అక్రమంగా వీరు కౌంటింగ్ సెంటర్లలోకి చొరబడ్డారు.
• కౌంటింగ్ సెంటర్ల వద్ద అనుమానాస్పదంగా ఉండే వ్యక్తులను తనిఖీ చేయాలి….నిబంధనలు ఉల్లంఘించినవారిపై చర్యలు తీసుకోవాలి.
• ఓటమిని జీర్ణించుకోలేని వైసీపీ శ్రేణులు ఈ కౌంటింగ్ సెంటర్ లో తుది ఫలితాల ప్రకటనను ఎలాగైనా దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
• ఈ కారణంగా కౌంటింగ్ సెంటర్ల వద్ద నిబంధనలు అమలు చేయడంతో పాటు…పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాలి
లేఖ -2 లో పేర్కొన్న అంశాలు:-
• తూర్పు రాయలసీమ ఎమ్మెల్సీ పట్టభద్రుల నియోజకవర్గం కౌంటింగ్ స్టేషన్‌లోకి వైఎస్సార్‌సీపీ నేత విజయానందరెడ్డి నకిలీ ఐడీలతో వైఎస్సార్‌సీపీకి చెందిన గూండాలను కౌంటింగ్ సెంటర్ లోకి పంపారు.
• పోలింగ్ రోజున తిరుపతిలో హింసకు దారితీసిన తీరు గురించి ఇప్పటికే మీ కార్యాలయానికి ఫిర్యాదు చేశాము.
• అయినా నాడు సంబంధిత ఎన్నికల అధికారులు క్షేత్ర స్ధాయిలో తగిన చర్యలు తీసుకోలేదు.
• వైఎస్సార్‌సీపీ గూండాలు తూర్పు పట్టభద్రుల స్ధానంలో తుది ఫలితాల ప్రకటనను ఎలాగైనా చెడగొట్టేందుకు మళ్లీ నేడు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
• కీలకమైన కౌంటింగ్ ప్రక్రియ సక్రమంగా ముగిసేలా ఎన్నికల అధికారులు చర్యలు తీసుకోవాల్సి ఉంది.
• ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కౌంటింగ్ సెంటర్ లో భద్రతను పెంచాలి.