Suryaa.co.in

Andhra Pradesh

ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడారు 

  • ఎక్సైజ్ శాఖపై సీఎం చంద్రబాబు శ్వేతపత్రం
  • మద్యం అక్రమాలపై సీఐడీ విచారణ
  • విచారణ తర్వాత ఈడీకి సిఫార్సు
  • శాసనసభలో చంద్రబాబు ప్రకటన

అమరావతి: ఏపీ అసెంబ్లీలో ఎక్సైజ్ శాఖపై సీఎం చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ నేరస్థులు రాజకీయాల్లో ఉంటే రాజకీయాలు నేరాలమయమవుతాయి. నేరస్థుడే రాజకీయ పార్టీ అధినేత, సీఎం అయితే ఏం జరుగుతుందో గత ఐదేళ్లు చూశాం. కొంతమంది అవసరాలకు తప్పు చేస్తారు. కొంతమంది అత్యాశతో తప్పుచేస్తారు. కొంతమంది డబ్బుల ఉన్మాదంతో తప్పుచేస్తారు. డబ్బుల ఉన్మాదంతో వ్యవస్థలను సర్వనాశనం చేశారు.

మేం విడుదల చేస్తున్న 7 శ్వేతపత్రాలు చూస్తే రాష్ట్రం ఎంత నష్టపోయిందో తెలుస్తుంది. మద్యపాన నిషేధమన్నారు. లిక్కర్ ఔట్‍లెట్స్ తగ్గిస్తామన్నారు. అన్నీ మరిచారు. ప్రజలకు ఒక హామీ ఇచ్చామంటే అమలు చేసేదిగా ఉండాలి. ఆఖరికి ప్రజల ఆరోగ్యంతో కూడా చెలగాటమాడారు. ధరలు పెంచుకుంటూ పోతే తాగేవాళ్లు తగ్గుతారన్నారు. కానీ మద్యం వినియోగం అమాంతం పెరిగిపోయాయి. తెలంగాణ, తమిళనాడు, ఒడిశాతో పోలిస్తే ఏపీలో ధరలు విపరీతంగా పెంచారు.

గడిచిన ఐదేళ్లలో రాష్ట్రానికి తీవ్ర నష్టం జరిగింది. పరిపాలన ప్రజల కోసం చేయాలి. సంక్షేమం, అభివృద్ధి బేరీజు వేసుకుంటూ వెళ్లాలి. ఆఖరికి ప్రజల ఆరోగ్యంతో కూడా చెలగాటమాడారు. పొరుగు రాష్ట్రాల్లో ఆదాయం పెరిగింది. మరి ఏపీలో తగ్గింది. తగ్గిన ఆదాయం వైసీపీ నేతల జేబుల్లోకి వెళ్లింది. దేశంలో దొరికే లిక్కర్ ఏపీలో దొరకలేదు. పెద్ద కంపెనీలు పారిపోయే పరిస్థితి తీసుకొచ్చారు. చెల్లింపులు ఆలస్యం చేయడం, ఆర్డర్ ఇవ్వకుండా వేధించారు. ఇష్టం లేని బ్రాండ్లన్నీ షాపుల్లో ఉంచేశారు. వాళ్లు ఏ కంపెనీ బ్రాండ్లు పెడితే అవే తాగే పరిస్థితి.

మద్యం అనేది ఒక వ్యసనం. పేదవాడు శారీరకంగా కష్టపడి ఆ బాధలు మరచిపోయేందుకు తాగుతాడు. పేదవాడి మద్యం అలవాటును బలహీనంగా చేసుకుని దోచుకున్నారు.  పేదవాడికి అమ్మే లిక్కర్‍పై విపరీతంగా ధరలు పెంచేశారు. డిస్టలరీలను వైసీపీ నేతలు పంచుకున్నారు. ఐదు టాప్ బ్రాండ్ల కంపెనీలను తరిమేశారు. లోకల్ బ్రాండ్ల కంపెనీలు విపరీతంగా పెరిగాయి. సొంత మద్యం బ్రాండ్లను తీసుకొచ్చారు. భూంభూం పేరుతో రకరకాల బ్రాండ్లు తీసుకొచ్చారన్నారు.

శ్వేత పత్రంలోని కీలక అంశాలు
ఏపీ బెవేరేజెస్ కార్పొరేషన్ ఎండీతో పాటు, డిస్టిలరీల కమిషనర్ గానూ వాసుదేవ రెడ్డికే జగన్ ప్రభుత్వం బాధ్యతలు కట్టబెట్టింది. ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, కమిషనర్లకు ఫైళ్లు పంపకుండా నిర్ణయాలు తీసుకునేలా వాసుదేవ రెడ్డికి అధికారాలు ఇచ్చారు. ఉన్నతాధికారులను ట్రాన్స్ఫర్ లు చేయించగలనంటూ వాసుదేవరెడ్డి బెదిరించినట్టు ఆరోపణలు ఉన్నాయి.

మద్యం కొనుగోళ్లలోనూ భారీగా అవకతవకలకు వాసుదేవరెడ్డి తెరలేపారు. ఒకే రకమైన బ్రాండ్ మద్యాన్ని తెలంగాణ కంటే అధిక ధర పెట్టి ఏపీలో కొనుగోలు చేసినట్టు విచారణలో వెల్లడించారు. ఒక్క వాసుదేవ రెడ్డి అవినీతి లెక్కలకు అందటం లేదని అధికారులు అంటున్నారు. బినామీ పేర్లతో కొన్ని డిస్టిలరీ వ్యాపారంలోకి చొరబడ్డారు. కొన్ని మద్యం బ్రాండ్లను రాత్రికి రాత్రే తప్పించినట్లు గుర్తించారు. తక్కువ రేటు ఉన్న మద్యం బ్రాండ్లు గణనీయంగా తగ్గించారు.

2014-2019 మధ్యలో  తక్కువ రేటు ఉన్న మద్యం బ్రాండ్లు 32 అందుబాటులో ఉంటే వాటిని రెండు బ్రాండ్లకు కుదించారు. వాటిని అధిక ధరల కు విక్రయించి సొమ్ము చేసుకున్నారు.  ఒకే తరహా పేర్లు వచ్చేలా బ్రాండ్ల పేర్లు మార్పు చేశారు. కొన్ని ప్రీమియం బ్రాండ్ల పేర్ల తరహాలోనే పేర్లు పెట్టీ జే బ్రాండ్ల మద్యం ఉత్పత్తి , విక్రయాలు చేశారు. జే బ్రాండ్ మద్యానికీ అధిక ధరలకు విక్రయించి సొమ్ము చేసుకున్నారు.

సబ్ లీజుల పేరుతో డిస్టిలరీలను కైవసం చేసుకున్నారు. 11 డిస్టిలరీలను జగన్ అనుచరులు హస్తగతం చేసుకున్నట్టు విచారణ లో గుర్తించారు. జే గ్యాంగ్ హస్తగతం చేసుకున్న డిస్టిలరీ ల నుంచే 65 శాతం మేర మద్యం ఏపి బెవేరేజేస్ కార్పొరేషన్ కొనుగోళ్లు చేసింది. 2014-19 మధ్య కాలంలో ఉన్న టాప్ 5 మద్యం బ్రాండ్ మద్యాన్ని  2019 తర్వాత కొనుగోళ్లు నిలిపివేశారు. మద్యం నుంచి భవిష్యత్ నుంచి వచ్చే ఆదాయాన్ని జగన్ ప్రభుత్వం తాకట్టు పెట్టింది.

అప్పుల చెల్లింపుల నిమిత్తం మద్యం ఆదాయాన్ని ఏపీ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు 14,276 కోట్లు మళ్లించినట్టు గుర్తించారు. అధికారుల నుంచి అక్రమాలు జరిగిన తీరుపై సీఐడీ వివరాలు సేకరిస్తోంది. వాసుదేవరెడ్డి పాత్రపై సంచలన వాస్తవాలు వెలుగులోకి రానున్నాయి.

LEAVE A RESPONSE