– టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు
వైసీపీ అధికారాన్ని నిలబెట్టుకోవాలని ఓటర్ లిస్టుల్లో అనేక అవకతవకలకు పాల్పడుతోందని టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అన్నారు.మంగళగిరిలోని జాతీయ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు
ఈ నాలుగున్నర సంవత్సరాల ప్రభుత్వ పరిపాలనపై ప్రజలు విసిగి పోయారు. సామాన్య ప్రజలు మొదలుకొని అన్ని వర్గాల ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోను ఈ ప్రభుత్వాన్ని గద్దె దించాలని దృఢ సంకల్పంతో ఉన్నారు. అధికారాన్ని నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో వైసీపీ అనేక కుట్రలు, కుతంత్రాలు చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్ లిస్టుల్లో అవకతవకలకు పాల్పడుతోంది. ఎవరైతే ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారో, ఎవరైతే ఈ ప్రభుత్వానికి ఓటు వేయరో అట్టివారిని ,ఓటర్ లిస్టు నుండి వారి పేర్లను తొలగించడానికి కుట్రలు పన్నుతోంది.
అందుకు గ్రామాలు, పట్టణాల్లో ఉన్న వాలంటీర్ వ్యవస్థలోని వాలంటీర్లను వాడుకుంటోంది. వ్యతిరేకుల ఓట్లు తొలగించేందుకు కుంటి సాకులు చూపుతున్నారు. పేర్లు తొలగించేందుకు ఉపయోగించే ఫామ్ 7ని బల్క్ గా అప్ లోడ్ చేస్తున్నారు. కొన్ని చోట్ల బీఎల్ ఓలను బెదిరించి ఓట్లు తొలగిస్తున్నారు. కొందరు అధకారులను భయపెట్టడం, బెదిరించడం లేక పోస్టింగులు ఇస్తామని ఆశ చూపడం జరుగుతోంది.
కొందరు ఉద్యోగులు వైసీపీకి కొమ్మ కాస్తున్నారు. ఇటీవల పర్చూరులో 14 వేలకు పైగా ఫామ్ 7లు పెట్టారు. ఇక్కడ దుర్మార్గంగా వ్యవహరించారు. ఈ గ్రామంలో పుట్టినప్పటి నుంచి ఉన్నవారు 189 మంది పేర్లను తొలగించాలని ప్రయత్నించారు. ఈ సమాచారాన్ని మేం పై అధికారులకు పంపాము. వారు ఎంపిక చేసుకున్న నియోజకవర్గంలోని 25 వేల మంది ఓట్లు తొలగించడానికి ప్రణాళికలు సిద్ధం చేశారని, దీన్ని మీరు అడ్డుకోవాలని అధికారులకు తెలిపాము. ఫలితంలేదు.
ఎన్నికల సంఘానికి పదే పదే చెప్పినా ఎన్నికల సంఘంలో విధులు నిర్వహిస్తున్న ప్రభుత్వ అధికారులకు వైసీపీ నాయకులు ఓటు హక్కును హరిస్తున్నారని చెప్పినా ఎవరూ స్పందించలేదు. దీనిపై హైకోర్టుకు వెళ్లాము. హైకోర్టు స్పందించి భారత ఎన్నికల కమిషన్ నుంచి కిందిస్థాయిలో ఉండే బీఎల్ ఓల వరకు మొత్తం సమాచారాన్ని కోర్టుకు సమర్పించండని కోర్టు చెప్పింది. ఇది మంచి పద్ధతి కాదు అని కోర్టు వైసీపీ ప్రభుత్వానికి మొట్టికాయలు వేసింది.
అప్పుడు వైసీపీ ప్రభుత్వం కంటితుడుపుగా అధికారులు జాగ్రత్త పడ్డారు. దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ఫామ్ 7 లు పెట్టిన 16 మంది పై ఐపీసీ యాక్టు ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేశారు. 7 ఎఫ్ ఐఆర్ లు నమోదు చేశారు. 12 మంది బీఎల్ ఓ లకు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. వాస్తవంగా 189 మంది ఈ కుట్రలో భాగస్వాములయ్యారు. వీరికి దాదాపు 12 వందల మంది సహాయ సహకారాలు అందించారు.
వీరు ఓటీపీ షేర్ చేసినవారిలో ఉన్నారు. సమగ్ర విచారణ చేయలేదు. కంటి తుడుపు చర్యలు మాత్రమే చేపట్టారు. కోర్టులను తప్పుదారి పట్టించారు. భారత ఎన్నికల సంఘాన్ని కూడా తప్పుదారి పట్టించారు. అధికారులు కూడా ఇందులో భాగస్వాములే. ఎన్నికల ప్రక్రియలో ఎటువంటి సంబంధం లేకపోయినా మార్టూరు, యుద్దనపూడి, పర్చూరు మండలాలకు చెందిన సబ్ ఇన్స్ పెక్టర్లు, మార్టూరు సర్కిల్ ఇన్స్ పెక్టర్ వీరందరూ ఈ ఫామ్ సెవెన్ లను పెట్టడంలో ఒత్తిడి తెచ్చినట్లు సాక్ష్యాధారాలతో భారత్ ఎన్నికల సంఘానికి టీడీపీ తరపున ఫిర్యాదు చేశాం.
వారిని నిన్న బాపట్ల ఎస్పీ వీఆర్ కు పిలిచారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే విధంగా అధికారులు అధికార పార్టీకి వత్తాసు పలుకుతున్నారు. మేం సాక్ష్యాలు చూపెడితే చర్యలు తీసుకోకుండా కేవలం తూతూ మంత్రంగా మాత్రమే చర్యలు తీసుకున్నారు. దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాము. బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అధికారులు జిల్లా కలెక్టర్, ఎస్పీ, సీఈఓ, వీఆర్ఓ అందరూ బాధ్యత మరచి వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు అక్రమంగా అరెస్టు అయిన రోజు నుంచి వైసీపీ వ్యతిరేక ఓట్లను తొలగించే పని అధికమైంది. ప్రస్తుతం ఓటర్ లిస్టు సవరణలు జరుగుతున్నాయి.
ఇందులో ఇప్పటి వరకు 7 లక్షల 60వేల ఫామ్ 7 లు రాష్ట్ర వ్యాప్తంగా అప్లై చేస్తే కేవలం చంద్రబాబునాయుడుగారు అరెస్టు అయినప్పటి నుంచి అంటే సెప్టెంబర్ 8 నుంచి 15వ తేది వరకు అంటే వారం రోజుల్లో 2 లక్షల 44 వేల 551 ఫామ్ 7 లను వీరు అప్ లోడ్ చేశారు. చంద్రబాబు ను అరెస్టు చేశారని రాష్ట్ర ప్రజలు ఆందోళన చేస్తుంటే ఆ సమయంలో అధికారులను అడ్డం పెట్టుకొని 2 లక్షల 44 వేల మంది ఓట్లను తొలగించడానికి కుట్ర పన్నారు.
ఈ నాలుగు నెలల్లో కొత్త ఓట్ల ఎన్ రోల్ మెంట్ లో సుమారు 6 లక్షల 80 వేల ఓట్లు నమోదు చేసుకోవడానికి అప్లై చేస్తే కేవలం చంద్రబాబు అరెస్టు అయిన వారంలో లక్షా 20 వేల 44 ఓట్లు కొత్తగా ఎన్ రోల్ చేశారు. తెలుగుదేశం సానుభూతిపరుల ఓట్లు తీసివేయడం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేస్తారనే అనుమానం ఉన్న వారి ఓట్లు తీసివేయటం జరిగింది. వారికి అనుకూలంగా వున్న వ్యక్తులకు ఒకే చోట నాలుగైదు ఓట్లు వచ్చేటట్లు ఫామ్ 6 లు పెట్టడం జరిగిందని టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు వివరించారు.