Suryaa.co.in

Andhra Pradesh

మహాపాదయాత్రను వైసీపీ నేతలు రాక్షసుల్లా అడ్డుకుంటున్నారు

నీటి ప్రాజెక్టుల గేట్లకు గ్రీజ్ పెట్టలేని వ్యక్తి మూడు రాజధానులు కడతాడా.?
వైసీపీ నేతలు అవినీతిలో మునిగి రాష్ట్రాన్ని అప్పులతో ముంచుతున్నారు
-టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కిమిడి కళావెంకట్రావు
రాజధాని రైతులు చేపట్టిన న్యాయస్థానం టు దేవస్థానం మహాపాదయాత్ర యజ్ఞంలా సాగుతుంటే వైసీపీ నేతలు రాక్షసుల్లా అడ్డుకుంటున్నారు. రైతులు సంకల్ప బలంతోనే 37 రోజులుగా పాదయాత్ర చేస్తున్నారు. ప్రశాంతంగా సాగుతున్న పాదయాత్రను ప్రభుత్వం పోలీసులతో అణచివేయాలని చూడటం దుర్మార్గం. పార్టీలకతీతంగా మద్దతు తెలుపుతున్నారు. ప్రజల నుండి విశేషమైన స్పందన లభించడంతో వైసీపీకి గుబులుపుట్టింది. కనీసం అన్నం తినడానికి కూడా స్థలాలు కేటాయించకుండా వైసీపీ నేతలు పోలీసులతో బెదిరింపులకు దిగుతున్నారు. తలదాచుకోవడానికి నీడ లేకుండా చేసేందుకు కుట్ర చేస్తున్నారు. ప్రతిదాన్ని రాజకీయం చేసి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు. మీరు చేసే ప్రతి దుశ్చర్యకు పశ్చాత్తాపం చెందే రోజు వస్తుంది. మూడు రాజధానుల బిల్లును పూర్తిగా వెనక్కితీసుకుంటే రాష్ట్రానికి జగన్ రెడ్డి మేలు చేసిన వ్యక్తి అవుతారు.
13 జిల్లాలకు సమానదూరంలో అమరావతి ఉంది. 175 నియోజకవర్గాల అభివృద్ధికి సరిపడే రూ.2లక్షల కోట్ల సంపద అమరావతిలో ఉంది. ఈ సంపదనంతా జగన్ రెడ్డి బూడిదపాలు చేశారు. జగన్ రెడ్డి వచ్చి అమరావతిని భ్రష్టు పట్టించారు. రాజధాని లేకపోవడం వల్ల రాష్ట్రానికి పరిశ్రమలు రావడం లేదు. ఉద్యోగాలు రాక యువత తీవ్ర నిరాశలో ఉన్నారు. రాష్ట్రం అభివృద్ధికావాలన్నా, ప్రజల జీవనప్రమాణాలు మెరుగుపడాలన్నా అమరావతిని కొనసాగించాలి. టీడీపీ హయాంలో సన్ రైజ్ స్టేట్ గా ఏపీ ఉంటే జగన్ వచ్చాక కరెప్షన్ రైజ్ స్టేట్ గా మారింది. జగన్ వ్యవహరిస్తున్న తీరు భవిష్యత్ తరాలను అంధకారంలోకి నెట్టేలా ఉంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజధానికి అనుకూలమని చెప్పి ఓట్లు దండుకుని.. అధికారంలోకి వచ్చాక వ్యతిరేకంగా వ్యవహరించడం సమంజసం కాదు. రాజధాని లేక, ఆదాయం రాక రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారు. వైసీపీ నేతలు అవినీతిలో మునిగి రాష్ట్రాన్ని అప్పులతో ముంచుతున్నారు. ఇప్పటికైనా మనసు మార్చుకుని అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలి.

LEAVE A RESPONSE