– మాజీ మంత్రి పీతల సుజాత విమర్శ
మంగళగిరి: వైసీపీ పాలనలో వైద్య కళాశాలలు నిర్మాణాల్లో జరిగిన నిర్లక్ష్యంపై మాజీ మంత్రి పీతల సుజాత తీవ్రంగా విమర్శించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. వైసీపీ వైద్య కళాశాలల పేరుతో కొత్త నాటకానికి తెరతీసిందని ఆరోపించారు. వైసీపీ నేతలు “తోడేళ్ళలాగా” ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారని వారి మాటలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని అన్నారు. మొండి గోడలు కూడా పూర్తికాని 17 వైద్య కళాశాలల గురించి జగన్మోహన్ రెడ్డి గొప్పలు చెప్పుకుంటుంటే ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు.
వైసీపీ ప్రభుత్వం మెడికల్ కాలేజీల కోసం అప్పులు చేసి తెచ్చిన నిధులను పక్కదారి పట్టించిందని, పులివెందుల కళాశాలకు నిధులు కేటాయించి మిగతావాటిని నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. కనీసం 15-20 శాతం కూడా ఖర్చు పెట్టకుండా కాలేజీలు కట్టేశామని వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, వేరే భవనాలు చూపించి ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. వైసీపీ చేసిన అన్యాయాల వల్ల రెండు వేల మంది విద్యార్థులు సీట్లు కోల్పోయారని ఆమె అన్నారు.
వైసీపీ మహిళా నేతలు రాజకీయ ప్రయోజనాల కోసం తప్పుడు ప్రచారం చేస్తున్నారని, కానీ జగన్మోహన్ రెడ్డి తమ తల్లి వై.ఎస్. విజయమ్మను రాజకీయ ప్రయోజనాల కోసం రోడ్డు మీదకి లాగినప్పుడు మహిళ నేతలము అని చెప్పుకునే రోజా, విడుదల రజినీ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి తన తల్లిని, చెల్లిని బయటకు పంపించినప్పుడు వారెందుకు మహిళల తరపున నిలబడలేదని నిలదీశారు.
నోరు ఉందని ఇష్టం వచ్చినట్లు వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదని, సోషల్ మీడియా ఉందని తప్పుడు ప్రచారం చేస్తే కూటమి ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. చంద్రబాబు నాయుడు హయాంలో మంగళగిరిలో ఎయిమ్స్ ఆస్పత్రిని వేగంగా పూర్తి చేస్తే వైసీపీ ప్రభుత్వం అక్కడ రోగులకు కనీసం మంచినీరు కూడా కల్పించలేదని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆరు నెలల్లోనే ఎయిమ్స్‌లో అన్ని వసతులు కల్పించిందన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో పనిచేస్తుందని, యువతకు నాణ్యమైన విద్య, ప్రజలకు మెరుగైన వైద్యం అందించడంలో వెనకాడదని తెలిపారు.
నారా లోకేష్ ప్రజలకు ఏ కష్టం వచ్చినా వెంటనే స్పందిస్తున్నారని, నేపాల్‌లో చిక్కుకున్న తెలుగు ప్రజలను సురక్షితంగా రప్పించి వారికి సహాయం అందించారని ఆమె ప్రశంసించారు. వైసీపీ ప్రభుత్వంలాగా దోచుకోవడం కూటమి ప్రభుత్వ లక్ష్యం కాదని, చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ప్రజాసేవకు అంకితమయ్యారని అన్నారు. కూటమి ప్రభుత్వం గురించి మాట్లాడే ముందు ప్రజలు వైసీపీని 11 సీట్లకు పరిమితం చేసి “పాతాళంలోకి తొక్కేశారు” అని ఆమె గుర్తుచేశారు. ఈ ఫలితాలను బట్టి వైసీపీ నేతలు బుద్ధి తెచ్చుకోవాలని హితవు పలికారు. వైసీపీ చేసిన తప్పిదాల వల్లే మెడికల్ సీట్లు తగ్గాయని, జగన్మోహన్ రెడ్డి నిర్లక్ష్యం వల్ల వైద్య విద్యార్థులకు నష్టం జరిగిందన్నారు.
వైసీపీ చేసిన పాపాలను చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం సరిచేస్తోందని చెప్పారు. రుషికొండ ప్యాలెస్ కోసం ఖర్చు పెట్టిన డబ్బును మెడికల్ కాలేజీలకు ఖర్చు చేసి ఉంటే కొంతమంది విద్యార్థులకైనా న్యాయం జరిగి ఉండేదని అన్నారు. వైసీపీ ప్రభుత్వం విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిందని, దుబారా ఖర్చులకు పాల్పడిందని విమర్శించారు.
కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో సంక్షేమం, అభివృద్ధి కోసం పనిచేస్తుందని నాణ్యమైన విద్య, మెరుగైన వైద్యం అందించడానికి ముందుంటుందని స్పష్టం చేశారు. ఛానల్స్, సోషల్ మీడియా ఉన్నాయని ఇష్టం వచ్చినట్టు తప్పుడు ప్రచారం చేస్తే చూస్తూ ఊరుకోబోమని ఆమె హెచ్చరించారు.