– పింఛన్ల రీ వెరిఫికేషన్ పై జగన్ అండ్ కో అసత్య ప్రచారం
– అర్హులైన దివ్యాంగుల పింఛన్లు తొలగించలేదు, తొలగించం
– రాజధానిగా అమరావతి, ఆర్థిక రాజధానిగా విశాఖపట్నం
– అభివృద్ధి వికేంద్రీకరణే లక్ష్యంగా సీఎం చంద్రబాబు అడుగులు
– పల్నాడు జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి గొట్టిపాటి రవి కుమార్
కారంపూడి: గత ప్రభుత్వం సంక్షేమం పేరుతో రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిందని పల్నాడు జిల్లా ఇంచార్జ్ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ విమర్శించారు. కనీసం ఒక్క హామీని కూడా జగన్ రెడ్డి పూర్తి స్థాయిలో అమలు చేయలేదని అన్నారు. కానీ, కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతీ హామీని ఒక్కొక్కటిగా నెరవేర్చుతోందని అన్నారు. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం కారంపూడిలో శుక్రవారం నిర్వహించిన స్త్రీ శక్తి విజయోత్సవ ర్యాలీలో, సూపర్ సిక్స్ – సూపర్ హిట్ కార్యక్రమంలో ఎమ్మెల్యే జూలకంటితో కలిసి మంత్రి గొట్టిపాటి పాల్గొన్నారు.
పర్యటనలో భాగంగా మంత్రి గొట్టిపాటి రవి కుమార్ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం స్థానిక మహిళలతో కలిసి సంక్షేమ పథకాల అమలుకు కృషి చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి రవి కుమార్ మాట్లాడుతూ… అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి సంతకం పింఛన్ల పెంపుపైనే సీఎం చంద్రబాబు చేశారని గుర్తు చేశారు. అయితే జగన్ మోహన్ రెడ్డి అదే వెయ్యి రూపాయిలు పెంచేందుకు ఐదేళ్లు తీసుకున్నారని విమర్శించారు.
దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా 65 లక్షల పింఛన్ల పంపిణీ కోసం రూ. 33 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ వివరించారు. పింఛన్ తీసుకుంటూ భర్త చనిపోయిన వారికి ఇటీవల 1.11 లక్షల స్పౌజ్ పింఛన్లు మంజూరు చేసినట్టు తెలిపారు. దివ్యాంగుల పింఛన్లపై ప్రభుత్వానికి అందిన ఫిర్యాదుల మేరకు రీవెరిఫికేషన్ చేయమని చెప్పినట్లు పేర్కొన్నారు.
అర్హులైన దివ్యాంగుల పింఛన్లు తొలగించలేదని, తొలగించబోమని స్పష్టం చేశారు. గతంలో వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిన అన్నా క్యాంటీన్లను కూటమి అధికారంలోకి రాగానే మళ్లీ పునరుద్ధరించామని చెప్పారు. కూటమి ప్రభుత్వం పేదల పక్షపాతి ప్రభుత్వమని ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి గుర్తు చేశారు.
మాచర్లలో శాంతి నెలకొల్పేందుకు, ఫ్యాక్షన్ నిర్మూలనకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తెలిపారు.
గత పాలకులు మాచర్లలో విధ్వంసం సృష్టించారని మండిపడ్డారు. అయితే నియోజకవర్గంలో బ్రహ్మానంద రెడ్డి మాత్రం ఫ్యాక్షన్ రాజకీయాలను పక్కన పెట్టి.. అభివృద్ధి దిశగా ముందుకు సాగుతున్నారని ప్రశంసించారు. తాను 2004లో అద్దంకి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఆ ప్రాంతంలో ఫ్యాక్షన్ నిర్మూలనకు కృషి చేశానని అన్నారు. అద్దంకి నియోజకవర్గాన్ని అభివృద్ధికి కేరాఫ్ అడ్రెస్‌గా నిలిపేందుకు కృషి చేస్తున్నానని పేర్కొన్నారు.
సీఎం చంద్రబాబు అమరావతిని రాజధానిగా నిర్మించడమే కాకుండా, విశాఖను ఆర్థిక రాజధానిగా తీర్చిదిద్దుతూ అభివృద్ధి వికేంద్రీకరణ దిశగా ముందుకు వెళ్తున్నారని మంత్రి గొట్టిపాటి చెప్పారు.
జగన్ మూడు రాజధానుల పేరుతో రాష్ట్రాన్ని దెబ్బతీశారని, రాజధాని లేని రాష్ట్రం అనే అపఖ్యాతి జగన్ పాలనలోనే వచ్చిందని విమర్శించారు. జగన్ పాలనలో సాగునీటి ప్రాజెక్టులు నిర్లక్ష్యానికి గురయ్యాయని, పెట్టుబడిదారులు రాష్ట్రం విడిచి వెళ్లిపోయారని ఆక్షేపించారు. ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పెట్టుబడిదారుల్లో విశ్వాసం నింపినట్టు తెలిపారు. తద్వారా పెట్టుబడులను ఆకర్షించి ఎన్నికలలో ఇచ్చిన 20 లక్షల ఉద్యోగాల హామీని నెరవేర్చే దిశగా లక్ష్యం పెట్టుకుని ముందుకు సాగుతున్నామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు.