– జగన్ జమానాలో మీ నోళ్లెందుకు మూతపడ్డాయ్
– జగన్ కాపులను అణచివేసినప్పుడు నిద్రపోతున్నారా?
– కులం మారిన మీరు కాపుల గురించి మాట్లాడటమే వింత
– ముద్రగడకు టీడీపీ ఎంపి, కాపు యువనేత సానా సతీష్ బహిర ంగ లేఖ
అమరావతి: తన పాలనలో కాపులను అణచివేసి, కాపు కార్పొరేషన్‌ను నిర్వీర్యం చేసిన జగన్, వైసీపీ నాయకత్వం కాపులకు క్షమాపణ చెప్పాలని టీడీపీ ఎంపి, కాపు యువనేత సానా సతీష్ డిమాండ్ చేశారు. ఆ మేరకు మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభానికి బహిరంగ లేఖ రాశారు. అసలు మీరు కాపు కులం నుంచి రెడ్డి కులానికి మారినప్పుడే కాపుల గురించి మాట్లాడే నైతిక హక్కు కోల్పోయారని స్పష్టం చేశారు.
సానా సతీష్ ఇంకా ఏమన్నారంటే..
ముద్రగడ పద్మనాభం రెడ్డిగారు,
మొదటిగా, మీరు పేరు మార్చుకున్న రోజే కాపుల గురించి మాట్లాడే అర్హతను మీరు కొల్పోయారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు రాష్ట్ర ముఖ్యమంత్రిని అన్న అవమానకరపు మాటలను మిమ్మలనో, మీ కుటుంబ సభ్యులనో అంటే ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించుకోండి. అంబటి అరెస్టు చట్టపరమైనది, అటువంటి నేరస్థుడికి కులాన్ని అంటగట్టి వెనకేసుకుని రావటం క్షమించరాని నేరం.
పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ వలసదారులమా అంటున్నారు కదా, అవును నిజమే, మీ జగన్ రెడ్డి ఉగ్రవాద పాలనలో 2019 -24 వరకు కాపులెవరు స్వాతంత్రంగా రోడ్ల మీదకి రాలేకపోయారు, మీ రాక్షస పాలనతో రాష్ట్రంలో కాపుల ఉనికి లేకుండా చేశారు.
మీ వైసీపీ హయాంలో కాపు కార్పోరేషన్ నిర్వీర్యం చేసి, కాపులను రోడ్డు మీద పారేసినప్పుడు మీరేం అయ్యారు? మీ నియోజకవర్గానికి జగన్ వచ్చి, కాపులకు బీసీ రిజర్వేషన్ సాధ్యం కాదని చెప్పినప్పుడు మీరు ఇంట్లో నుంచి ఎందుకు బయటకిరాలేదు? అప్పుడు మీరేమైపోయారు? అప్పుడు కాపులు గుర్తురాలేదా?
గతంలో ‘సోమరులు, తాగుబోతులు’ అని కాపులను అవమానిస్తూ అంబటి రాంబాబు మాట్లాడినప్పుడు ఎందుకు ప్రశ్నించలేదు? కాపు నేతలను ఓటు బ్యాంకుగా వాడుకున్నది వైసీపీ వారే అని మర్చిపోతున్నారా?
కాపుల అభివృద్ది కోసం మా ప్రభుత్వం ఎప్పుడూ పని చేస్తూనే ఉంటుంది. కాపుల భవిష్యత్తు టీడీపీతోనే ఉంది. కుల రాజకీయాల మానుకోండి, ఫేక్ ప్రోపగండా మానుకుని వాస్తవాలను పరిశీలించండి. ప్రతి వేదిక పై కాపుల పేరును వాడుకుని, కాపులను అవమానిస్తున్న మీరు, మీ పార్టీ వారు కాపులకు క్షమాపణ చెప్పాల్సిందే!