Suryaa.co.in

Andhra Pradesh

ఒరేయ్… సాక్షి నీకు ముందే చెబుతున్నా.. వైకాపా పరాజయం తథ్యం!

– కూటమి 25 పార్లమెంట్ స్థానాలు గెలిచే ఛాన్స్
– కచ్చితంగా 23 స్థానాలు మాత్రం కూటమివే
– వైకాపా పరాజయం తథ్యం

– హంతకుడు పెదనాన్న కొడుకా?
– ముత్తాత ఫ్యామిలీ ద్వారా వచ్చిన మనవడా?
– నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు

రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో తెదేపా, జనసేన, బిజెపి కూటమి 25 పార్లమెంటు స్థానాలకు గాను 25 పార్లమెంటు స్థానాలను గెలిచే అవకాశం ఉందని నరసాపురం ఎంపీ రఘు రామ కృష్ణంరాజు తెలిపారు. 25 పార్లమెంట్ స్థానాలలో కచ్చితంగా కూటమి 23 పార్లమెంట్ స్థానాలను గెలుచుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

శుక్రవారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణం రాజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… జాతీయ టీవీ ఛానళ్ల సర్వే అంచనాలను చూసి తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చున్న జగన్మోహన్ రెడ్డి గజ,గజ వణికి పోతున్నారన్నారు. జగన్మోహన్ రెడ్డి ఆస్థాన కళాకారుడైన ట్రంప్ అవినాష్ ఇచ్చిన సర్వే అంచనాలను టైమ్స్ నౌ మీడియా సంస్థ ప్రసారం చేస్తోంది. గతంలో ఏడాదికి ఎనిమిదిన్నర కోట్ల రూపాయలు ఇచ్చారన్న మొహమాటంతో కాబోలు వైకాపాకు అనుకూలంగా సర్వే అంచనాలను పేర్కొంటూ, టైమ్స్ నౌ ప్రజల్ని తప్పు దోవ పట్టించే ప్రయత్నం చేస్తుంది.

ఇప్పుడు సి ఓటర్, ఏబీపీ సంస్థ నిర్వహించిన సర్వేలో రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బిజెపి కూటమి 20 పార్లమెంటు స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని వెల్లడించింది. వైకాపా కేవలం ఐదు స్థానాలకే పరిమితమవుతుందని పేర్కొంది. ప్రజల నాడిని అంచనా వేయడంలో సి ఓటర్ సంస్థ విశ్వసనీయత ఇప్పటికే పలుమార్లు రుజువు అయింది. సి ఓటర్ పేర్కొన్న స్థానాల కంటే ఎన్నికల ఫలితాలలో వివిధ రాజకీయ పార్టీలు ఎక్కువ స్థానాలను గెలుచుకున్న ఉదాహరణలు ఉన్నాయి.

పశ్చిమ బెంగాల్లో బిజెపి అత్యధిక స్థానాలను సాధించి అధికారంలోకి వస్తుందని అందరూ భావిస్తున్న తరుణంలో , సి ఓటర్ సంస్థ మాత్రం మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ కు 165 స్థానాలు వస్తాయని వెల్లడించింది. ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ 165 స్థానాల కంటే ఎక్కువగానే సాధించింది. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లోను బిజెపి 235 స్థానాలను గెలుచుకుంటుందని సి ఓటర్ సంస్థ తన సర్వే అంచనాలలో పేర్కొనగా, అంతకంటే ఎక్కువగానే స్థానాలను గెలుచుకొని రెండవసారి ఉత్తరప్రదేశ్లో బిజెపి అధికారంలోకి వచ్చింది.

సి ఓటర్ సంస్థ సర్వే అంచనాలలో ఒక నెంబర్ చెప్పిందంటే, దానికంటే ఎన్నికల్లో అధిక స్థానాలే వస్తున్నాయి. సి ఓటర్ సంస్థ, ఏబీపీ వెల్లడించిన సర్వే అంచనాల ప్రకారం రానున్న ఎన్నికల్లో కూటమి 20 పార్లమెంట్ స్థానాలు గెలుచుకుంటుందని అంచనా వేసింది. అంటే, సి ఓటర్ సంస్థ చెప్పిన 20 స్థానాలు కాస్తా 23 స్థానాలు అవుతాయేమోనని రఘురామ కృష్ణంరాజు అన్నారు. కూటమి 23 స్థానాలు గెలుచుకుంటే, వైకాపాకు రెండు స్థానాలకు మించి దక్కవు. రిలయన్స్ సంస్థ ఆధ్వర్యంలో కొనసాగే నెట్వర్క్ 18 మీడియా సంస్థ కూడా సర్వే అంచనాలను వెల్లడించింది.

అంబానీ ప్రతినిధికి జగన్మోహన్ రెడ్డి రాజ్యసభ స్థానాన్ని కట్టబెట్టినందుకు సర్వే అంచనాలను వెల్లడించడంలో నెట్వర్క్ 18 కాస్తా మొహమాట పడినట్లుగా కనిపిస్తోంది. కూటమి 18 స్థానాలలో గెలుస్తుందని, ఏడు స్థానాలు వైకాపాకు వస్తాయని ఆ సంస్థ పేర్కొంది. రాష్ట్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొనే సభల అనంతరం రాజకీయ పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. కూటమి కచ్చితంగా 23 స్థానాలలో గెలుస్తుంది. కడప జిల్లా ప్రజలు ఈ హత్య రాజకీయ సంస్కృతి తనకు వద్దని, బయటపడాలని భావిస్తే… కూటమికి 25 కు 25 స్థానాలు రావచ్చునని రఘురామ కృష్ణంరాజు తెలిపారు.

తెదేపా, జనసేన జట్టు కట్టినప్పుడు 135 అసెంబ్లీ స్థానాలు గెలుచుకుంటారని నేను చెప్పాను. ఆ రెండు పార్టీలు కలిసి ఉన్నప్పుడే ఈ సర్వేలను చేశారా?, బిజెపి ని కూడా కలుపుకొని చేశారా? అన్నది తెలియదు. రాష్ట్రంలో పది రోజుల్లో రాజకీయ పరిస్థితి మరింతగా మారిపోనుంది. అప్పుడు నాలుగు కాకపోతే 40 టీవీలను బద్దలు కొట్టే అవకాశం ఉంది. అయినా అదంతా ప్రజల సొమ్మే. ప్రజల సొమ్ము దోచుకున్న తర్వాత టీవీలు కొనుక్కున్న, దీవులు కొనుక్కున్న మనకేంటి? అని అన్నారు. వైకాపా పరాజయం తథ్యం… అందులో ఎటువంటి సందేహం లేదని రఘు రామ కృష్ణంరాజు తేల్చి చెప్పారు.

ఎన్నాళ్లో వేచిన ఉదయం … ఈనాడేనని నేను ముందే చెప్పా
ఎన్నాళ్లో వేచిన ఉదయం ఈనాడేనని నేను ముందే చెప్పానని రఘురామకృష్ణం రాజు పేర్కొన్నారు. ఇటీవల ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రైమ్ టైం డిబేట్లో ఈనెల 16వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతుందని వ్యాఖ్యాత వెంకటకృష్ణకు వెల్లడించాను. బాల వాక్కు బ్రహ్మ వాక్కు అన్నట్లుగా నా మాటే నిజమయింది. నాకు నేను బాలుడిగానే ఊహించుకుంటాను. అది కొద్ది మంది మా వెధవలకు నచ్చదు.

ఎన్నికలకు తెదేపా, జనసేన, బిజెపి కలిసి వెళ్తాయని నేను ముందే చెప్పాను. నేను చెప్పినవన్నీ నిజమయ్యాయి. నన్ను డిస్క్ క్వాలిఫై చేయాలనుకున్నారు. మీరు ఏమీ చేయలేరని చెప్పాను. అది కూడా నిజమే అయ్యింది. రానున్న ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగానే పోటీ చేస్తాను. జగన్మోహన్ రెడ్డి తన కోవర్టులను పెట్టి ఎన్ని డ్రామాలను ఆడించిన ఫెయిల్ అవుతారు.

శనివారం ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తరువాత, ఏప్రిల్ నెలాఖరు లో రాష్ట్రంలో ఎన్నికలు జరగవచ్చు. ఎన్నికల పోలింగ్ తేదీ ఎప్పుడు వస్తుందా? … ఉదయాన్నే ఏడు గంటలకే పోలింగ్ బూత్ కు వెళ్లి ఓటు వేసి ఈ దిక్కుమాలిన ప్రభుత్వానికి చరమగీతం పాడుదామా?? అని ప్రజలంతా వేచి చూస్తున్నారన్నారన్న విషయం తనకు తెలుసునని రఘురామకృష్ణం రాజు వెల్లడించారు .

ప్రధాని మోడీ సభను విజయవంతం చేయండి
ఈ నెల 17వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొని బహిరంగ సభను కూటమి పార్టీల కార్యకర్తలు, అభిమానులు, సానుభూతిపరులు సక్సెస్ చేయాలని రఘురామకృష్ణం రాజు కోరారు. నరేంద్ర మోడీ, తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్, బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందరేశ్వరి వంటి హేమాహేమీలు పాల్గొనే ఈ బహిరంగ సభ గ్రాండ్ సక్సెస్ అవుతుందని ముందే తెలుసు. అయినా నా వంతుగా ప్రజలను పెద్ద సంఖ్యలో సభకు హాజరుకావాలని కోరుతున్నాను.

గ్రాఫిక్స్ అవసరం లేకుండా, ఈ సభకు లక్షల మంది జనం తరలి వస్తారన్న ఆయన, సభకు నేను కూడా హాజరు అవుతానని చెప్పారు. సభా వేదికపై ప్రముఖులే కూర్చుంటారని, మిగతా వారంతా సభికులతో కలిసి కూర్చోవాల్సిందేనని తెలిపారు . అయితే దిక్కుమాలిన అక్కుపక్షి సాక్షి దినపత్రిక, రఘురామకృష్ణం రాజుకు సభా వేదికపై స్థానం దక్కలేదని, కిందికి దిగి వెళ్లిపోమన్నారని పనికిమాలిన కథనాలు రాసే అవకాశం ఉంది.

అందుకే ఒరేయ్… సాక్షి, నీకు ముందే చెబుతున్నాను. సభా వేదికపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, దగ్గుబాటి పురందరేశ్వరి తో పాటు ఒకరిద్దరు ప్రముఖులే కూర్చుంటారని గుర్తు చేస్తున్నానన్నారు. తరువాత నువ్వు ఏమి పనికిమాలిన కథనాలు రాసుకున్న ప్రయోజనం సున్నా అంటూ ఎద్దేవా చేశారు.

హు కిల్డ్ బాబాయ్ అంటే అబ్బాయి కిల్డ్ బాబాయి అంటున్న జనం
హు కిల్డ్ బాబాయ్ అని అంటే అబ్బాయి కిల్డ్ బాబాయ్ అని జనం అంటున్నారని రఘు రామ కృష్ణంరాజు తెలిపారు. అబ్బాయి అంటే వైయస్ అవినాష్ రెడ్డి నా?, వైయస్ జగన్మోహన్ రెడ్డి నా?? అని ప్రశ్నించిన ఆయన… ఇద్దరు విడిగా వేశారా?, కలిసి వేశారా?? అన్నది త్వరలోనే తెలుస్తుందన్నారు. సీబీఐ ఇప్పటికే చార్జ్ షీట్ దాఖలు చేసింది. చార్జిషీట్లో పేర్కొన్న ప్రకారం వైఎస్ అవినాష్ రెడ్డి, వైయస్ భాస్కర్ రెడ్డి, శివశంకర్ రెడ్డి కలిసి కుట్రపన్ని గంగిరెడ్డి ని మేనేజ్ చేసి, దస్తగిరి కి సుపారీ ఇచ్చి హత్య చేయించారు.

దస్తగిరి, సునీల్ యాదవ్, ఉమా శంకర్ రెడ్డి లు మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డిని హత్య చేశారు. ఇది ఇప్పటికే ప్రూవ్ అయ్యింది. దస్తగిరి కూడా ఈ విషయాన్ని అంగీకరించారు. తనతో వైయస్ వివేకానంద రెడ్డిని హత్య చేయించింది వీళ్లేనని వైయస్ అవినాష్ రెడ్డి, వైయస్ భాస్కర్ రెడ్డి, శివ శంకర్ రెడ్డి పేర్లను వెల్లడించారు. ఈ సందర్భంగా దస్తగిరి తనతో వైఎస్ వివేకానంద రెడ్డిని హత్య చేయించిన జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో పోటీ చేసి ముఖ్యమంత్రి అయినప్పుడు, తాను ఎందుకు ఎన్నికల్లో పోటీ చేయకూడదని ప్రశ్నించారు. జైల్లో ఉన్నప్పుడు నగదును తీసుకొని వచ్చి నాకు చూపించి ప్రలోభ పెట్టే ప్రయత్నం చేశారని దస్తగిరి వెల్లడించారు.

20 కోట్ల రూపాయలు ఇస్తామని, వాంగ్మూలాన్ని మార్చి చెప్పాలని, లేకపోతే నీ కుటుంబ సభ్యులను ఇబ్బంది పెడతామని బెదిరించారని తెలియజేశారు. దస్తగిరిని బెదిరింపులకు గురి చేస్తున్న విషయాన్ని న్యాయస్థానం దృష్టికి ఆయన తరపు న్యాయవాది, మాజీ న్యాయమూర్తి జడ శ్రావణ్ తీసుకువెళ్లి… వైయస్ అవినాష్ రెడ్డి బెయిల్ ను రద్దు చేయాలని కోరారు. అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు అవుతుందని నేను కూడా నమ్ముతున్నాను. అయితే ఈ కేసులో సహ నిందితుడిగా ఉన్న శివశంకర్ రెడ్డికి బెయిల్ రాదని అనుకున్నప్పటికీ, ఆరోగ్య కారణాల దృష్ట్యా ప్రత్యేక పరిస్థితుల్లో ఇచ్చారు.

శివశంకర్ రెడ్డి బెయిల్ నిబంధనలను ఉల్లంఘిస్తే, ఆయన బెయిల్ కూడా రద్దు అవుతుంది. జైలుకు పలానా వాడు వచ్చాడని దస్తగిరి నిజం చెప్పడంతో, ఇప్పుడు వారికి ఏమి చేయాలో పాలు పోని పరిస్థితి నెలకొంది. ఎప్పుడు జైల్లో ఖైదీలకు సేవలు చేయని డాక్టర్, దస్తగిరి జైలులో ఉన్నప్పుడే సేవలు చేస్తామని చెప్పి జైల్లోకి వెళ్లడం వెనుక ఆంతర్యం ఏమిటో ఇప్పుడు బట్టబయలు అయ్యిందని రఘురామ కృష్ణంరాజు తెలిపారు.

మా మనుషులే ఇంత దారుణం చేస్తారని ఊహించలేదన్న షర్మిలారెడ్డి
మా మనుషులే ఇంత దారుణం చేస్తారనిఊహించలేదని, ఒక మంచి మనిషిని హత్య చేస్తారనుకోలేదని రాష్ట్ర పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి పేర్కొన్నారని రఘురామకృష్ణం రాజు తెలిపారు. ఒక పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలుగా, మరొక పార్టీ అధ్యక్షుడు హత్యలో ఇన్వాల్వ్ అయ్యారని డైరెక్ట్ గాచెప్పడానికి ఆమె మొహమాట పడినట్లు కనిపిస్తోంది. అయినా వైయస్ షర్మిలా రెడ్డి మాటలు అదే అర్థాన్ని సూచిస్తున్నాయి. సీబీఐ చార్జిషీట్ ప్రకారం వైయస్ అవినాష్ రెడ్డి నుంచి రాత్రి మూడు గంటలకు హైదరాబాదులోని లోటస్ పాండ్ కు ఫోన్ వెళ్లినట్లుగా పేర్కొన్నారు.

అయితే సీబీఐ అధికారులు విచారణ అక్కడే ఆపేశారు. ఇది జగన్ మాయనా లేకపోతే ఇంకేమైనా మాయనా తెలియదు కానీ ఇకపై అటువంటి మాయోపాయాలు పనిచేయవు. సిబిఐ విచారణ ఎక్కడైతే ఆపిందో, అక్కడి నుంచే విచారణ పున ప్రారంభం అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి అజయ్ కల్లం రెడ్డి చెప్పినట్లుగా వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు గురైన రోజు తెల్లవారుజామున ఉదయం 5:30 గంటలకు లోటస్ పాండ్ కు ఫోన్ వస్తే, ఉదయం 8 గంటల వరకు గుండెపోటు నాటకాన్ని ఎందుకు నడిపించారు. వైఎస్ వివేకానంద రెడ్డి గుండెపోటుతో మరణించారని విజయసాయిరెడ్డి మీడియాకు ఎందుకు చెప్పాల్సి వచ్చింది.

పార్ట్ 2 విచారణ త్వరలోనే ప్రారంభం అవుతుంది. ఈ ప్రభుత్వం మారిన వెంటనే, నూతనంగా ఏర్పడబోయే రాష్ట్ర ప్రభుత్వమే విచారణ చేపడుతుంది. సిబిఐ ఎక్కడైతే విచారణ నిలిపివేసిందో అక్కడి నుంచే విచారణ కచ్చితంగా జరగాలి. జరుగుతుంది. జరిగేలా చూస్తామని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. అర్ధరాత్రి 3 గంటలకు ఎవరు ఫోన్ చేశారు. ఎవరు ఫోన్ మాట్లాడారన్న పచ్చి నిజాలు ప్రజలకు తెలియాలి.

సిబిఐ కాకపోతే, రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని సిఐడి చేత విచారణ చేయించడం జరుగుతుంది. సిఐడిలో అప్పుడు బూట్లు తుడిచే అధికారులు ఉండరు. నిక్కచ్చిగా పనిచేసే అధికారులే ఉంటారు. వారే ఇన్వెస్టిగేట్ చేస్తారని, ఇందులో ఎటువంటి సందేహం పెట్టుకోవలసిన అవసరం లేదని రఘురామకృష్ణంరాజు తేల్చి చెప్పారు.

ప్రత్యక్ష రాజకీయాల్లోకి వైఎస్ వివేకా కుటుంబం
దివంగత మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ, కుమార్తె డాక్టర్ వైఎస్ సునీతా రెడ్డి లలో ఒకరు ప్రత్యక్ష రాజకీయాలలోకి వచ్చే అవకాశం ఉందని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. వారు రాష్ట్రమంతా తిరిగి హు కిల్డ్ బాబాయ్ అని చెబుతారేమోనన్న ఆయన, ఇప్పటికే చెప్పేశారని గుర్తు చేశారు. ఈ హంతకుల పార్టీకి ఓటు వేయవద్దని సునీతా రెడ్డి కోరారన్నారు. హంతకుడు పెదనాన్న కొడుకా? ముత్తాత ఫ్యామిలీ ద్వారా వచ్చిన మనవడా? అన్న విషయాన్ని స్పష్టంగా చెప్పకపోయినప్పటికీ, హంతకుల పార్టీకి మాత్రం ఓటు వేయవద్దని ప్రజలను సునీతా రెడ్డి కోరిన విషయాన్ని గుర్తు చేశారు.

వైఎస్ అవినాష్ రెడ్డి, వైయస్ భాస్కర్ రెడ్డి, శివశంకర్ రెడ్డి అంతా వైకాపాకు చెందిన వారేనని ఈ సందర్భంగా రఘురామ కృష్ణంరాజు గుర్తు చేశారు. ఇప్పుడు సౌభాగ్యమ్మ కూడా మా కుటుంబ సభ్యులే వైయస్ వివేకానంద రెడ్డిని హత్య చేస్తారని ఊహించలేదన్నారు. రానున్న ఎన్నికల్లో డాక్టర్ సునీతా రెడ్డి, సౌభాగ్యమ్మ లు అన్ని పార్టీల మద్దతు తో కడప, పులివెందుల స్థానాలలో పోటీ చేస్తారా? అని ప్రశ్నించిన ఆయన, వైకాపా నుంచి ఎవరు పోటీ చేసినా ఓడించాల్సిన అవసరం, బాధ్యత కడప జిల్లా ప్రజలపై ఉందని అన్నారు. ఎవరు కూడా ఇటువంటి దారుణాన్ని సహించరని రఘురామ కృష్ణంరాజు పేర్కొన్నారు.

ప్రతి ఎన్నికకు ముందు ఒక బలి నా?
ప్రతి ఎన్నికకు ముందు ఒక బలి అన్నట్లుగా వైకాపా సంస్కృతి తయారయిందని రఘురామకృష్ణం రాజు విమర్శించారు. రానున్న ఎన్నికల్లో కోడి కత్తి శ్రీను, దస్తగిరి లు పోటీ చేస్తామని చెబుతున్నారు. కోడికత్తితో పొడిపించుకున్నట్లు నటించిన వాడే ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు, పొడిచినట్లు నటించిన నేను ఎందుకు పోటీ చేయకూడదన్నట్టు గా శ్రీను ప్రశ్నిస్తున్నారు. అలాగే హత్య చేయించినవాడే ఎన్నికల్లో పోటీ చేస్తున్నప్పుడు, హత్య చేసిన తర్వాత తప్పును తెలుసుకొని పశ్చాత్తాప పడుతున్న నేను ఎందుకు పోటీ చేయకూడదని దస్తగిరి నిలదీస్తున్నారు.

ఎన్నికల్లో పోటీ చేసే కోడి కత్తి శ్రీను, దస్తగిరి గెలుస్తారా? గెలవరా? అనేది అనవసరం. గత ఎన్నికల్లో గెలుపుకు ఎవరైతే అవసరం అయ్యారో, ఇప్పుడు వారే ఎన్నికల్లో ఓడించేందుకు ముందుకు వస్తున్నారు. అందరిలాగే మేము కూడా గతంలో జగన్మోహన్ రెడ్డిని చంపాలని చూశారని నమ్మాం. అయితే, కోడి కత్తి శ్రీను పొడవలేదని, జగన్మోహన్ రెడ్డి పొడిపించుకున్నారని తెలిసి ఆశ్చర్యపోయాం. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య అనంతరం జగన్మోహన్ రెడ్డి నటన ఆస్కార్ ను మించిపోయింది. చిన్నాన్నను బాత్రూంలో ఎలా చంపారో జగన్మోహన్ రెడ్డి కళ్ళకు కట్టినట్లుగా వివరించిన ఆయన నటనకు ఆస్కార్ కూడా బలాదూరేనని రఘురామకృష్ణం రాజు పేర్కొన్నారు.

వివేకా వచ్చే వర్ధంతి నాటికి హంతకులను శిక్షిస్తాం
మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి ఐదవ వర్ధంతి సందర్భంగా ఆయనకు రఘురామకృష్ణంరాజు ఘనంగా నివాళులు అర్పించారు. మనసున్న ప్రతి ఒక్కరూ ఒక్క నిమిషమైనా వివేకా కు నివాళులు అర్పించాలన్నారు. ఈ హత్య కు మూల స్తంభాలుగా ఉన్న వారిని న్యాయస్థానాలు గుర్తించడానికి ఆలస్యం కావచ్చు. ప్రజా న్యాయస్థానంలో మాత్రం ఈ పనికిమాలిన వ్యక్తులను ఎన్ని అబద్ధాలు చెప్పి నా, నంగనాచి మాటలతో ప్రజల మధ్యకు వచ్చిన వారిని ఇంటికి పంపించాలని కోరారు. వైఎస్ వివేకానంద రెడ్డి జీవిత గాధ ఆధారంగా సినిమా వస్తున్నట్లుగా సోషల్ మీడియాలో పోస్టర్లను చూశాను. ఆ సినిమాను ఎప్పుడు రిలీజ్ చేస్తారు… ఇప్పుడే రిలీజ్ చేస్తారా? అన్నది తెలియదు.

జగన్మోహన్ రెడ్డి జీవిత గాధ ఆధారంగా రూపొందించిన చిత్రం కలెక్షన్లు వసూలు చేయకుండానే వెళ్లిపోయింది. ఇప్పుడు శపధం సినిమాను ఏపీ ఫైబర్ నెట్ లో బలవంతంగా ప్రదర్శించే ప్రయత్నం చేస్తున్నారు. ఉచితంగానే ఎవరు ఈ సినిమాను చూడరైతే, 100 రూపాయలు వసూలు చేయాలనుకుంటే ఎవరు చూస్తారని రఘురామ కృష్ణంరాజు ప్రశ్నించారు. వైయస్ వివేకానంద రెడ్డి హంతకులను ఆయన వచ్చే
వర్ధంతి నాటికి కచ్చితంగా శిక్షించడం జరుగుతుందన్నారు.

రానున్న ఎన్నికల్లో ప్రస్తుత ప్రభుత్వం పోతుందని, రానున్న ప్రభుత్వంలో అసలు హంతకులను పట్టుకొని తీరుతామని ప్రజల తరఫున నేను శపథం చేస్తున్నట్లు రఘురామకృష్ణంరాజు తెలిపారు. ఎందుకంటే కూటమిలో నేను ఉంటాను. ఏ పార్టీ నుంచి పోటీ చేస్తానన్నది మరో మూడు రోజుల్లో తెలుస్తుంది. ప్రతిపక్ష పార్టీలన్నీ ఇటువంటి హత్యా రాజకీయాలకు చరమగీతం పాడేందుకు వైఎస్ వివేకానంద రెడ్డి కుటుంబీకులు ఎవరు పోటీ చేసినా వారికి తప్పకుండా మద్దతు ఇస్తారని అనుకుంటున్నానని రఘురామకృష్ణం రాజు తెలిపారు.

LEAVE A RESPONSE