– ‘మహిళలకు ఉచిత బస్సు’ను జీర్ణించుకోలేని వైసీపీ
– మహిళల చేతిలో డబ్బు మిగులు
– మార్కెట్ల కళకళతో పెరుగుతున్న మనీ రొటేషన్
– దానితో పెరుగుతున్న వ్యాపారాలు
– ప్రభుత్వానికీ ఆదాయం
– మహిళలు కూటమి శాశ్వత ఓటు బ్యాంకుగా మారతారన్న ఆందోళన
– ‘ఆటో డ్రైవర్లకు అన్యాయ’మంటూ గావు కేకలు
– వారికి న్యాయం చే యాలంటూ సోషల్మీడియాలో పోస్టింగులు
– ఆటోడ్రైవర్లకు జగన్ కంటే కూటమి ఇచ్చిందే ఎక్కువ
– ఇదిగో రెండు ప్రభుత్వాల గణాంకాలు
(నిజం)
ఏపీలో మహిళలకు ఉచిత బస్సు పథకం సూపర్హిట్టయింది. ఇది సామాన్య, మధ్య, అట్టడుగు వర్గాలకు చెందిన మహిళలకు వరప్రసాదంలా మారింది. ప్రధానంగా ఏరోజుకారోజు కూలి చేసుకుని పొట్టపోసుకునే పేదలకు డబ్బులు మిగిల్చే భారీ పథకం.
ఎందుకంటే ఒక గ్రామం నుంచి మరో గ్రామానికి పొలం పనులు, ఉపాథి హామీ పనుల కోసం డబ్బులిచ్చి బస్సు టికెట్ కొనుక్కునే మహిళలకు చంద్రబాబు సర్కారు ప్రవేశపెట్టిన ఉచితబస్సు పథకం, బోలెడు డబ్బు ఆదా చేసింది. దానితో వారు పుష్టికరమైన ఆహారం తినగలుగుతున్నారు. చేతిలో డబ్బు నిల్వ ఉండటం వారికి సహజంగా మరింత బలం ఇచ్చేదే. మహిళా ఉద్యోగులు కూడా ఉచిత బస్సు పథకం వాడుకోవడంతో వారి చేతుల్లోనూ డబ్బు మిగిలిపోయి కనిపిస్తోంది.
ఇక మహిళలు పనిలేకపోయినా ఉచిత బస్సు వాడుకోవడం వల్ల ఆర్టీసీ ఆదాయానికి గండిపడుతోందన్నది, ఇటీవలి కాలంలో వినిపిస్తున్న ఒక మతిలేని విమర్శ. అసలు పనిలేకుండా ఎవరయినా ఎందుకు బయటకు వెళతారు? బస్సుకు టికెట్ ఫ్రీ అయినా.. బస్సు దిగిన తర్వాత ఏమి కొనాలన్నా డబ్బు ఖర్చు చేయాలి కదా? ఈ చిన్నపాటి లాజిక్ మిస్సయి, ఇలాంటి మతిలేని విమర్శలుచేసే వారిని పట్టించుకోనవసరం లేదన్నది ఆర్దిక నిపుణుల అభిప్రాయం.
అదొక్కటే కాదు. మహిళలు ఉచిత బస్సు ప్రయాణం విరివిగా వాడుతున్నందున, మార్కెట్లు కళకళలాడుతున్నాయి. అంటే సంపద సృష్టించబడుతోందన్నమాట. వారి కొనుగోళ్లతో వ్యాపారస్తులకు వ్యాపారం పెరగడమే కాదు.. అందువల్ల ప్రభుత్వానికి ఆదాయం కూడా పెరుగుతోంది. ఏతావతా మహిళల కొనుగోలు శక్తి పెరిగి, సంపద సృష్టించబడుతోంది. అంటే ఆర్ధిక భాషలో చెప్పాలంటే మార్కెట్లో మనీ రొటేషన్ జరుగుతోందన్న మాట.
అయితే మహిళలకు ఉచిత బస్సు పథకం వల్ల ఆటో డ్రైవర్ల ఉపాథికి గండి కొట్టారంటూ వైసీపీ- దాని అనుబంధ సోషల్మీడియా గత కొద్దిరోజుల నుంచి కూటమి సర్కారుపై చేస్తున్న దుష్ప్రచారం ఆశ్చర్యం. దానికి కారణం.. ఉచిత బస్సు పథకంతో మహిళలు కూటమి శాశ్వత ఓటు బ్యాంకుగా మారతారన్న ఆందోళన.
నిజానికి ఉచిత బస్సు పథకం వల్ల నగరాల్లోని ఆటో డ్రైవర్లకు పెద్దగా వచ్చిన నష్టమేమీ లేదు. కేవలం పట్టణ ప్రాంతాలతోపాటు.. గ్రామాలలోనే తిరిగే మండల స్థాయి డ్రైవర్ల ఉపాథికే నష్టం.
కానీ దానిని భర్తీ చేసేందుకు గత జగన్ ప్రభుత్వం కంటే.. చంద్రబాబునాయుడు ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమమే ఎక్కువ. ఆ వాస్తవాన్ని మరుగుపరిచి, ఉచిత బస్సు పథకం వల్ల ఆటో డ్రైవర్లకు నష్టమంటూ.. మహిళలపై ఆటోడ్రైవర్లను ఉసిగొల్పుతున్న వైసీపీ ఆరోపణల్లో నిజమెంతో.. అబద్ధమెంతో చూద్దాం.
ఆటో డ్రైవర్ లకు ఎవరు మేలు చేస్తున్నారు?
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం (2023–24):
వాహన మిత్ర పథకం ద్వారా..
లబ్ధిదారులు: 2,75,931 మంది
సహాయం: ఒక్కొక్కరికి ₹10,000
మొత్తం ఖర్చు: ₹2,759.31 కోట్లు
కూటమి ప్రభుత్వం (2025–26):
స్త్రీ శక్తి పథకం నష్టం నివారణ కోసం
– లబ్ధిదారులు: 2.90 లక్షల ఆటో, క్యాబ్, టాక్సీ డ్రైవర్లు
– సహాయం: ఏడాదికి ₹4,350 కోట్లు
తులనాత్మక విశ్లేషణ:
గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంతో పోల్చితే ₹1,590.69 కోట్లు ఎక్కువ
ఇది 57.6% పెరుగుదల
అంటే కూటమి ,ప్రభుత్వం.. గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంతో పోలిస్తే లబ్ధిదారుల సంఖ్య కాస్త పెంచి, ఖర్చు మొత్తాన్ని దాదాపు 58% పెంచింది.
మరి ఈ లెక్కన ఆటో డ్రైవర్లకు జగన్ న్యాయం చేసినట్లా? చంద్రబాబు ప్రభుత్వం న్యాయం చే స్తున్నట్లా? ఈ గణాంకాలు పరిశీలిస్తే..మెడపై తల ఉన్న ఎవరికయినా, చంద్రబాబు ప్రభుత్వమే ఆటోడ్రైవర్లకు న్యాయం చేస్తున్నట్లు అర్దమవుతుంది. ఇది మెడపై తల ఉన్న వారికే అర్ధమయ్యే విశ్లేషణ. మరి వైసీపీ-సోషల్మీడియా సంగతి తెలియదు.
