– మీ మేలు మరవం.. మీ మాట దాటం
– మాకు వ్యక్తిగతంగా నిజంగా దేవుడంటే సుజనా చౌదరి గారు
– సుప్రీంకోర్టు లో మనకు న్యాయం జరిగిందంటే సుజనా చౌదరి కృషే కారణం
– వ్యక్తిగతంగా ఎంతోమంది మద్దతునిచ్చినా మా గుండెల్లో ఉంది సుజనా చౌదరి గారే
– మా వద్ద డబ్బు లేకపోయినా… ఆయనే ఖర్చులు పెట్టుకుని సహకారం అందించారు
– శాశ్వత రాజధానిగా సాధించుకున్నామంటే కారణం సుజనా చౌదరి గారే
– అంతా ఆయనే చూసుకున్నారు.. లేకపోతే మనం ఏం చేసేవాళ్ళం?
– ఆయన పెట్టే లాయర్లను మనం తట్టుకోగలమా?
– ఎమ్మెల్యే సుజనా చౌదరి ని సన్మానించి కృతజ్ఞతలు తెలిపిన అమరావతి రైతులు, మహిళలు
( అన్వేష్)
విజయవాడ: ఈరోజుల్లో చేసిన మేలు మర్చిపోయే వారే తప్ప.. ఎప్పుడో ఐదేళ్ల క్రితం చేసిన మేలు గుర్తు పెట్టుకుని, దాన్ని ఉప్ప్పొంగిన మనసుతో, వెల్లువెత్తిన అభిమానంతో ‘ఇంకా మీరు మా గుండెల్లోనే ఉన్నారు సారూ’.. అని కట్టలు తెంచుకున్న ప్రేమానురాగంతో, సదరు మేలు చేసిన వ్యక్తి చేసిన అలనాటి మేలును కీర్తించి, ‘మీ రుణం మరవం..మీ మాట దాటం’.. మా పోరాటానికి మీరే స్పూర్తి..మేం మరువం మీ కీర్తి.. మీరు లేకుంటే మాకు అమరావతి దక్కేది కాద’ంటూ..ఈరోజుల్లో కృతజ్ఞత చెప్పేవాళ్లు ఎవరైనా ఉంటారా?
సహజంగా అయితే ఉండరు! ఎందుకంటే మనిషి ఆశ-కోరిక అనంతం. ఒక పని చేస్తే, ఇంకో పని సంగతేమిటని ప్రశ్నించే కాలమిది. చేసిన మేలు లిప్తకాలంలో మర్చిపోయే యుగమిది. కృతజ్ఞతకే కొత్త భాష్యం చెప్పే కలికాలమిది.
కానీ రాజధాని అమరావతి రైతులు అందుకు భిన్నం. ఐదేళ్ల క్రితం రాజధానిని కాపాడుకునేందుకు పిడికిలెత్తి రణన్నినాదం చేసి, ఆ ఫలితం అందుకున్న అమరావతి రైతు..ఆ ఫలాలకు కారకులు, తమకు చిటికెన వేలు అందించి తమ కలలు సాకారం చేసిన ఓ నాయకుడి మేలును గుర్తు చేస్తూ, ‘మీ మేలు మరవం సామీ’ అంటూ తమ కృతజ్ఞతను దుశ్శాలువగా మార్చిన దృశ్యమిది.
అమరావతి రాజధానిని చెరబట్టి, రైతులపై ఉక్కుపాదం మోపి, మహిళలనే కనికరం లేకుండా లాఠీలతో కరాళనృత్యం చేసిన కఠినాత్ముల పాలనపై.. సివంగుల్లా విరుచుకుపడిన వీరనారీమణుల పోరాటానికి చేయూతనిచ్చిన, అప్పటి ఎంపి సుజనా చౌదరిని అదే అమరావతి రైతులు.. అమరావతికి చట్టబద్ధత ఏర్పడ్డ సందర్భాన్ని సంబరంగా చేసుకుని, ఆయనను ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు.
అలనాటి పోరాట ఘట్టాలు.. జగన్ జమానాలో జరిగిన దారుణాలు, అవమానపర్వం, కులహంకారంతో చేసిన అడ్డగోలు వ్యాఖ్యలు, వికృత వికటాట్టహాస చర్యలు, ఇలా ఒకటేమిటి? అలనాటి తమ అవమానపర్వాన్ని సుజనా చౌదరితో పంచుకున్నారు.
అంతేనా?.. అమరావతి పోరాట సమయంలో అంతా ఉత్తుత్తి మద్దతు-సాయం ప్రకటించి, చేతులు దులిపేసుకుని వెళుతున్న సమయంలో.. ‘నేనున్నా’ంటూ ఆపద్బాంధవుడిలా ముందుకొచ్చి, అమరావతి పోరాటానికి జవజీవాలిచ్చి.. లక్ష్యం సజీవంగా ఉంచేందుకు సుజనా చౌదరి చేసిన అమూల్య సాయాన్ని కూడా వారు గుర్తు చేసుకుని, ఆయనకు ‘కృతజ్ఞతమాల’ వేశారు.
మీరే మా దేవుడన్నారు. మీరు లేకపోతే.. మీ కృషి లేకపోతే మా పోరాటం అంగుళం కూడా కదిలేది కాదన్నారు. మీ ఔదార్యం మర్చిపోం. అమరావతి పూర్తయ్యేవరకూ మా వెంటే ఉండాలి. మేమూ మీ వెంటే ఉంటాం. మీరు మా చేయి విడవద్దంటూ ఆర్తిగా అభ్యర్ధించారు. అదిగో.. ఆ ఆత్మీయ కలయికలో రైతుల నోటి వెంట జాలువారిన కృతజ్ఞతాంజలి ఇది.
* * *
మన రాజధాని అమరావతి కి చట్ట బద్దత రావడం చాలా సంతోషంగా ఉంది. మన ఉద్యమానికి ఎంతో మంది అండగా నిలిచారు.సుజనా చౌదరి గారు న్యాయపరమైన అంశాల్లో అండగా నిలిచారు.హైకోర్టు, సుప్రీంకోర్టు లో న్యాయ ప్రక్రియ పై ఆయన చేసిన సాయం మరువ లేనిది. ఈరోజు ఆయన్ను కలిసి మేమంతా ధన్యవాదాలు చెప్పుకున్నాం.
– స్వరాజ్య రావు (అమరావతి రైతు)
మేము అమరావతి కోసం ఉద్యమం ప్రారంభం చేసిన నాటి నుంచే సుజనా చౌదరి అండగా ఉన్నారు. ఆర్ధికంగా మాకు చేయూతను ఇచ్చారు. ఒక్క అంగుళం కూడా రాజధాని కదలదు అని మొదటే చెప్పిన వ్యక్తి సుజనా చౌదరి. ఆ తర్వాత లీగల్ అంశాలపై కూడా ఆయన సహకారం మరువలేనిది. ఎప్పటికప్పుడు లాయర్లతో మాట్లాడి లీగల్ అంశాలు మాకు వివరించారు.
అప్పుడు మా వద్ద డబ్బు లేకపోయినా… ఆయనే ఖర్చులు పెట్టుకుని సహకారం అందించారు.మాకు సుజనా చౌదరి గారు అన్నివిధాలా సహకారం అందించినందుకు మేము రుణపడి ఉన్నాం. సుప్రీంకోర్టు లో మనకు న్యాయం జరిగిందంటే సుజనా చౌదరి కృషే కారణం. అమరావతి ని నిలబెట్టడంతో మాకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ లకు మా కృతజ్ఞతలు.
– బాల మురళీ కృష్ణ (అమరావతి రైతు)
అమరావతి ఉద్యమకారులుగా మేము ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నామంటే దానికి కారణం 26 ఆగస్టు 2019 న సుజనా చౌదరి గారు. రాయపూడి సీడ్ యాక్సెస్ రోడ్డులో నిర్వహించిన సమావేశమే కారణం.ఆ రోజు వారు అమరావతి రైతులకు మేము అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఆ మరుసటి రోజే రైతులకు కౌలు అందడం జరిగింది.అప్పట్లో మాకు కౌలు వస్తుందో లేదో అని ఆందోళన చెందుతుంటే, మేము కన్నా లక్ష్మీనారాయణ గారిని కలిసి మా పరిస్థితిని వివరించాము. ఆయన వెంటనే సుజనా చౌదరి గారితో మాట్లాడి అమరావతిలో పర్యటించి, రైతులకు భరోసా కల్పించారు.
అమరావతి రాజధానిని ‘కమ్మరావతి’ అని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరియు ఇతర వైసీపీ నాయకులు విమర్శించడం మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసింది. ముఖ్యంగా మా తాడికొండ నియోజకవర్గం ఎస్సీలది, అటువంటి నియోజకవర్గాన్ని అలా అనడం సరికాదు. దీనిపై నిరసన తెలపడానికి మేము హైదరాబాద్ వెళ్ళాము. అక్కడ వైసిపి నాయకులు మమ్మల్ని అరెస్టు చేయించాలని చూశారు.
అప్పుడు సుజనా చౌదరి గారు మాకు ఆశ్రయం కల్పించి, లాయర్ లక్ష్మీనారాయణ గారిని పంపించి మాకు రక్షణ కల్పించారు. మేము హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టి, ఇది దళితుల రాజధాని అని గట్టిగా చెప్పాము. అలాగే ఎస్సీ కమిషన్ మెంబర్ రాములు గారిని కలిసి వినతి పత్రం ఇవ్వడానికి సుజనా చౌదరి గారు ఎంతో సహకరించారు. పోలీసులు మమ్మల్ని అరెస్టు చేయడానికి ప్రయత్నించినా, సిబ్బంది మమ్మల్ని కాపాడారు. ఈరోజు మేము ఇలా ఉత్సవాలు చేసుకుంటున్నామంటే వ్యక్తిగతంగా సుజనా చౌదరి అందించిన సహకారం చాలా కీలకం.
– చిలకా బసవయ్య. (అమరావతి దళిత రైతు)
సుజనా చౌదరి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. మా వెనుక మా సోదరులు ఉండబట్టే మేము ముందుకు వెళ్లగలిగాం. మా వెనుక ప్రతి దానికి ‘అటు వెళ్ళాలి, ఇటు వెళ్ళాలి’ అని వాళ్ళ సహకారం ఉండబట్టే మేము వెళ్ళగలిగాం. పేరుకే మహిళలు ముందున్నాం కానీ, మా వెనుకైతే మా సోదరులందరూ ఉన్నారు. ఇక్కడికి వచ్చిన రైతు సోదరీమణులందరికీ, సోదరులకు కూడా అభినందనలు. మనం రాజధానిని శాశ్వత రాజధానిగా సాధించుకున్నామంటే కారణం సుజనా చౌదరి గారేనని మా సోదరులందరూ చెప్పారు.
చౌదరి గారి ప్రతిభ నిజంగా చాలా… మాకు నైతికంగా అన్ని పార్టీలు, అందరూ మద్దతు ఇచ్చినా, వ్యక్తిగతంగా అయితే మా గుండెల్లో సుజనా చౌదరి గారే. మా వెనుక సహకారం, అంతా ఆయనే చూసుకున్నారు. లేకపోతే మనం ఏం చేసేవాళ్ళం? ఆయన పెట్టే లాయర్లను మనం తట్టుకోగలమా?ఆయనే చూసుకుంటున్నారని మా అందరికీ చెప్పేవారు ఇలా మాకు వ్యక్తిగతంగా నిజంగా దేవుడంటే సుజనా చౌదరి గారు.
మోదీ గారితో మాట్లాడతామని ఎంతోమంది వచ్చేవారు శిబిరాలకి. నిజంగా అప్పుడు పరిస్థితి ఎట్లా ఉందంటే అండి.. ఎవరు వచ్చినా మేము మోదీ గారితో మాట్లాడతాం. అమరావతి ఇక్కడే ఉంటుంది అంటే, వాళ్ళ కాళ్ళ మీద పడి కూడా ఏడ్చేవాళ్ళమండి నిజంగానే. అప్పుడు అంత పిచ్చోళ్ళం ఫస్ట్ లో అయితే. వాళ్ళ కాళ్ళ మీద పడి కూడా ఏడ్చేవాళ్ళమండి
అమరావతి ఇంచు కూడా కదలదని సుజనా చౌదరి పదే పదే చెప్పేవారు. పాదయాత్రకు వచ్చినప్పుడు మరి కార్లతో అంత ర్యాలీ పెట్టి మా అందరికీ ధైర్యం ఇచ్చారు. ఆయన అన్ని కార్లతో వచ్చి మనకి మద్దతు తెలుపడం చాలా విశేషం అండి. రైతుల కోసం ఒక రైతు బిడ్డ వచ్చి, సుజనా చౌదరి గారు కూడా మా అందరికీ సహాయ సహకారాలన్నీ ఇచ్చినందుకు, కొండంత దేవుడితో సమానం. అట్లాగే చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, కేంద్రంలో మోదీ గారికి, అమిత్ షా గారికి కూడా పదే పదే ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.
ఎందుకంటే శాశ్వత రాజధానిగా ఇప్పటికైనా దాన్ని ఆమోదించినందుకు, వాళ్ళు చేసినందుకు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మేము ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. ఇప్పటివరకు ఎలా అయితే సుజన గారు సహకరించారో, ఇక మీదట కూడా అలాగే సహకరించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ బ్యాక్ బోన్ హెల్ప్ ఎప్పుడూ ఉండాల్సిందే అమరావతి రైతులకి. అది నిరంతరం కొనసాగాల్సినటువంటి అవసరం.
ఆ రకంగా మొదటిసారి మీరు రైతులకి నైతికంగా, మానసికంగా, ఆర్థికంగా సహకారం ఇవ్వటం..మీరు మాట్లాడిన ఒక్కే ఒక్క మాట ‘అమరావతిని ఇక్కడి నుంచి అంగుళం కూడా కదిలించలేరు’ అన్న ఒక్క మాట అది ఒక బాణంలాగా పని చేసింది ఇప్పటి వరకు కూడా. ఆ రకంగా ఆ బలము ఆ రైతుల త్యాగం తోటి ఇవాళ నిలబడ్డ ఈ అమరావతిని మన సమగ్ర స్వరూపాన్ని చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఈ సమగ్ర స్వరూపానికి కూడా సుజనా చౌదరి గారి సహకారం ఎప్పుడూ ఉండాలనేటటువంటిది కోరుకుంటున్నాం.
– మహిళా రైతులు