Suryaa.co.in

Editorial

అవును.. అతను ఆరుసార్లు వాళ్లమ్మకు.. ఆరుసార్లు వాళ్ల నాన్నకు పుట్టారట!

12 సార్లు మూడు బూత్‌లలో పుట్టారట
మొత్తం 12 సార్లు ఒకే ఇంట్లో ఒకేసారి పుట్టారట
మైలవరం నియోజవర్గంలో ఓటరు నమోదు సిత్రాలు
ఏపీలో ఒటరు నమోదులో వింతలూ.. విచిత్రాలు
సోషల్‌మీడియాలో పేలుతున్న సెటైర్లు
( మార్తి సుబ్రహ్మణ్యం)

ఎన్నికల కమిషనర్‌గా పనిచేసినా.. కోల్పోయిన తన ఓటును పునరుద్ధరించుకునేందుకు కోర్టుకెళ్లిమరీ సాధించుకున్న నిమ్మగడ్డ రమేష్‌ జన్మించిన ఆంధ్రప్రదేశ్‌లో, ఓటర్ల నమోదు వ్యవహారం యమా కామెడీగా మారింది. ఒక ఇంట్లో రెండు డజన్ల మంది.. బతికున్నవారి ఓట్లు తీసేసి చిత్ర విచిత్ర విన్యాసాలు చేస్తున్న ఎన్నికల కమిషన్‌ జమానాలో, తాజాగా బయటపడ్డ పెద్ద కామెడీ ఇది.

కృష్ణా జిల్లా మైలవరం గ్రామం ఇప్పుడు ఆ రాష్ర్టాన్ని ఆకర్షిస్తోంది. ఎందుకు? అక్కడేమైనా వరల్డ్‌ రికార్డు బద్దలయిందా? ఎవరైనా గిన్నిస్‌బుక్‌ ఎక్కారా? ఇంకెవ రైనా అద్భుతాలు సృష్టించారా? ఏదైనా కొత్త రికార్డుకు అక్కడ పురుడుపోసుకుందా అనే కదా అందరి డౌటనుమానం?! అలాంటిదేమీ కాదు. అంతకుమించి… అద్భుతమే జరిగిందిట.ఓటరు జాబితా తనిఖీ సందర్భంగా యుగంధర్‌ బండారు పేరు చూసి అక్కడి రాజకీయ పార్టీల ప్రతినిధులు హాశ్చర్యపోయారట. నిమిషం సేపు కళ్లార్పకుండా ఆ మహానుభావుడి పేరు పరిశీలించారట.

ఇంతకూ అక్కడేం జరిగిందంటే.. యుగంధర్‌ బంగారు అనే వ్యక్తి పేరు డజను సార్లు వచ్చిందట. అంటే.. 4 సార్లు పోలింగ్‌ బూత్‌ నెంబరు 1లో, మరో 4 సార్లు బూత్‌ నెంబర్‌ 2లో, ఇంకో 4 సార్లు బూత్‌నెంబర్‌ 178లో ఆయన పేరు కనిపించింది. ఆ ప్రకారంగా ఆయన ఎన్నికల సంఘం అధికారుల లెక్కల ప్రకారం 6 ఆరుసార్లు వాళ్ల అమ్మకు-ఆరుసారు వాళ్ల నాన్నకు.. మొత్తంగా 12 సార్లు ఒకే ఇంట్లో, ఒకేసారి పుట్టారంటూ సోషల్‌మీడియాలో సెటర్ల వర్షం కురుస్తోంది.

ఏపీలో ఓటరు జాబితాలో ఆక్రమాలు జరుగుతున్నాయని, తమ పార్టీ సానుభూతిపరుల ఓట్లు తొలగిస్తున్నారని ఇప్పటికే టీడీపీ-బీజేపీ-జనసేన నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. అలా వారి ఫిర్యాదులకు స్పందిస్తున్న ఒక కీలక అధికారిపై ఉన్న, పాత కేసు చూసి పాలకపెద్దలు బెదిరించి ఆయనను సెలెంట్‌ చేస్తున్నారంటూ, మీడియాలో కథనాలు కూడా వెలువడుతున్నాయి. ఈ క్రమంలో మైలవరంలో ఒక వ్యక్తి పేరు ఓటరు జాబితాలో అన్నేసిసార్లు ఉండటంతో, అది వైరల్‌ అయి సోషల్‌మీడియాలో సెటైర్ల వర్షం కురిసేందుకు కారణమయింది.

LEAVE A RESPONSE