( మార్తి సుబ్రహ్మణ్యం)
రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గొప్పా? ఏపీ సీఎం జగనన్న గొప్పా?.. ఇప్పుడు భారతదేశంలో ఇదో పెద్ద చర్చ. రాజ్యాంగం రాసిన అంబేద్కర్ గొప్పా? 151 సీట్లు సాధించిన ఏపీ సీఎం జగనన్న గొప్పా? అన్న చర్చోపచర్చలనంతరం తేలిందేమిటంటే.. నిస్సందేహంగా, నిస్సంకోచంగా, నిర్భయంగా జగనన్నే గొప్ప! యస్. అంబేద్కర్ కంటే జగనన్నే గొప్పవాడు. సూటిగా మాట్లాడితే.. జగనన్నే ఆంధ్రా అంబేద్కర్. కాదంటారా? అయితే ఓపారి ఇటు చూడండి.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సాబ్ మహా అయితే రాజ్యాంగం రచించి ఉండవచ్చు. అయితే ఏంటట? ఆ స్థానంలో ఇంకెవరున్నా ఆ పని చేసే వాళ్లేమో?! కానీ చరిత్రలో ఒక రాష్ట్రంలో 151అసెంబ్లీ, మూడు తక్కువ మిగిలిన లోక్‌సభ సీట్లు సాధించిన పార్టీకి నాయకత్వం వహించే సత్తా అంబేద్కర్‌కు ఉందా? కోర్టులను, జడ్జిలను నిలదీసిన చరిత్ర అంబేద్కర్‌కు ఉందా? అసలు చీఫ్ జస్టిస్ పదివికి ఫలానా వ్యక్తి అర్హుడని ఏకంగా లేఖ రాసే ధైర్యం అంబేద్కర్ ఎప్పుడైనా చేశారా? సరే.. అంబేద్కర్ ఎప్పుడైనా పాదయాత్ర చేశారా? పోనీ..తన కొడుకు, సోదరుడి కోసం ఎప్పుడైనా అంబేద్కర్ తల్లి, చెల్లి ఏనాడైనా పాదయాత్ర చేశారా? లేదు కదా? మరి ఇవన్నీ చేసిన జగనన్న గొప్పవాడా? ఏదో రాజ్యాంగం రచించిన అంబేదకర్ గొప్పోడా? చెప్పండి. కమాన్.
నిస్సందేహంగా జగనన్నే గొప్పోడు. పిచ్చిమారాజులయిన పాతకాలపు ప్రభువులంతా, అంబేద్కర్ గొప్పతనానికి చిహ్నంగా ఆయన పేరుతో పథకాలు పెట్టి ఉండవచ్చు. వారికి తమ సొంత తెలివితేటలపై నమ్మకం లేక, అలా అంబేద్కర్ పేరు పెట్టుకుని ఉండవచ్చు. జగనన్న మాదిరిగా, తాము కూడా దైవాంశసంభూతలమని తెలియక, ఆ విధంగా పథకాలకు మరొకరి పేరు పెట్టి ఉండవచ్చు. కానీ జగనన్న వారిలా తెలివితక్కువవాడు కాదు కదా? అందుకే అంబేద్కర్ విదేశీ విద్యకు తన పేరు పెట్టుకున్నారు. తప్పేంటట!
అఫ్కోర్స్.. ఆ విషయం క్యాబినెట్ మంత్రి సత్తిబాబుకు తెలియకపోవచ్చు. ప్రభుత్వంలో జరిగే నిర్ణయాలన్నీ క్యాబినెట్ మంత్రులకు తెలియాలా ఏంటి? జీఓ వచ్చిన తర్వాతనో, లేకపోతే పొద్దున్నే పేపర్లో వచ్చిన తర్వాతో అందరిమాదిరిగా తెలుస్తుంది. తెలుసుకుంటారు! కాబట్టి విదేశీ విద్య పథకాన్ని జగన్ పేరుతో మార్చిన విషయం సత్తిబాబుకు తెలియకపోవడంలో పెద్ద ఆశ్చర్యమేమీ లేదు. బహుశా సత్తిబాబును ఆయన నియోజకవర్గానికే పరిమితం చేసినందున, ఆయనకు బయట ప్రపంచంలో ఏం జరుగుతోందో తెలిసుండకపోవచ్చు. మంత్రి పదవి ఇచ్చింది కారు, నౌకర్లు, ల్యాంపు కార్లు, క్వార్టర్లు తీసుకుని ఎంజాయ్ చేయడానికే తప్ప..సొంత సర్కారులో ఏం జరుగుతుందో, అన్నీ తనకు తెలిసే జరగాలని కోరుకోవడం అత్యాశే కదా సత్తిబాబు?! పాపం సత్తిబాబు ఇంకా సతె్తకాలపు సతె్తయ్యలా ఉన్నట్లున్నారు!
ఇప్పుడేంటి?.. అంబేద్కర్ విదేశీ విద్య పేరును జగనన్న విదేశీవిద్యగా ఏపీ సర్కారు మార్పు చేసింది. అంతే కదా? ఆ మాత్రం దానికి ఎందుకీ గత్తర? విదేశీ విద్య చదువుకునేవాళ్లకు డబ్బులిస్తుంది జగనన్న తప్ప, అంబేద్కర్ కాదు కాబట్టి, ఆ పథకానికి జగనన్న పేరు పెడితే వచ్చే నష్టమేమిటన్నది వైసీపీ వీరసైనికుల ప్రశ్న. కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టిన జగనన్న సర్కారు, అదే అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పధకాన్ని జగనన్న విదేశీ విద్యాదీవెన పథకంగా ఎందుకు మార్చిందన్న ప్రశ్న అవివేకం. కోనసీమ జిల్లాలో పార్టీ అవసరాలు, రాజకీయాలకోసం అంబేద్కర్ పేరు అవసరం కాబట్టి ఆయన పేరు పెట్టారు. సంతోషించండి. మళ్లీ విదేశీ విద్యాదీవెన పథకానికీ ఆయన పేరే కొనసాగించడమంటే, లక్షలాది మంది జగనన్న అభిమానులంతా హర్టవరూ!
అందుకే కదా.. సర్కారు ఆ పథకానికి జగనన్న పేరు పెట్టింది? అయినా అంబేద్కర్ కంటే జగనన్నే గొప్పోడని తెలియని చంద్రబాబు, పవన్ లాంటి అజ్ఞానులంతా.. ఇంకా అంబేద్కర్ పేరు పట్టుకుని వేళ్లాడటం అమాయకత్వం కదూ? ట్రెండ్ ఫాలో కాకపోతే ఎలా మాస్టారూ? అయినా..అంబేద్కర్ విదేశీ విద్య పథకం పేరు మార్చి జగనన్న పేరు మారిస్తే, పిత్తిన పేరమ్మ మాదిరి… నవరంధ్రాలూ మూసుకున్న వైసీపీ దళిత మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలకు లేని నొప్పి, ఆవేదన కమ్ ఆవేశం, కమ్ ఆత్మగౌరవం… చంద్రబాబు-పవన్‌కు ఎందుకంట? వాళ్లిద్దరేమైనా అంబేద్కర్‌కు కజిన్ బ్రదర్సా ఏంటి? అసలు వైసీపీ దళిత నేతలే అంబేద్కర్ పేరు మార్చి.. జగనన్న పేరు పెడితే కిమ్మనకుండా మౌనంగా ఉంటే, మధ్యలో ఈ చంద్రబాబు-పవన్‌కు వచ్చిన నొప్పేంటట? నిజమే కదా!
గత ఎన్నికల ముందు మన మంత్రి రోజమ్మ.. ‘‘ప్రతి పథకానికీ చంద్రన్న పేరు పెట్టడమేమిటి? అవన్నీ వాళ్ల నాయన ఖర్జూరనాయుడు సొంత డబ్బులా ఏంటి? సంపాదించిన డబ్బు ఖర్చు పెట్టి వాటికి మీ పేర్లు పెట్టుకోండి’’ అని శివగామిలా జబర్దస్తీగా శివాలెత్తినట్లు గుర్తు. మరిప్పుడు అన్ని పథకాలూ జగనన్న పేరు పెడుతుంటే, టూరిజం రోజక్క మాట్లాడటం లేదెందుకన్నది ఆమెంటే గిట్టని వారి అమాయక ప్రశ్న. అప్పుడు అధికారంలో లేము కాబట్టి లక్షాతొంభై మాట్లాడతాం. ఇప్పుడు అధికారంలో ఉన్నాము కాబట్టి మా ఇష్టం. అప్పుడు అనేక పథకాలకు చంద్రన్న పేరు పెట్టారు కాబట్టి, ఇప్పుడు మేమూ జగనన్న పేరు పెట్టుకుంటున్నాం. చెల్లుకు చెల్లు. ఇక ఇందులో సిద్ధాంతాలు, నిజాయితీలు, విశ్వసనీయత, వంకాయ అన్న పెద్ద పెద్ద మాటలెందుకున్నది వైసీపీ వీరసైనికుల వాదన. కరస్టే కదా?!
ఓ మాట. అంబేద్కర్ పుట్టిన మహారాష్ట్రలోనే ఆయన పేరు మీద జిల్లా పెట్టలేదు. రాజ్యాంగం రాసిన అంబేద్కర్ పేరు మీద, ఎవరూ ఒక రాష్ట్రానికి ఆయన పేరు పెట్టలేదు. అలాంటిది.. అంబేద్కర్ పేరు మీద ఒక జిల్లా పేరే పెట్టిన జగనన్న.. ఏదో సరదాకు ఒక పథకానికి ఉన్న అంబేద్కర్ పేరు మార్చి తన పేరు పెట్టుకుంటే, ఇంత పెద్ద యాగీ చేయడం భావ్యమా? ఆ మాత్రం ముచ్చట కూడా ఒక ముఖ్యమంత్రి తీర్చుకోకూడదా? అదికూడా 151 సీట్లు సాధించిన ఓ సీఎం, తనపేరు మీద పథకం పెట్టుకోవడం పాపమా? నేరమా? ఆ మాత్రం కూడా ఈ సమాజం ఆయనను అర్ధం చేసుకోలేదా? రాష్ట్ర ప్రజల సౌభాగ్యం కోసం, అక్కచెల్లెమ్మలు, అవ్వా-తాతల కోసం.. మొత్తంగా రాష్ట్ర ప్రజల జేబులు నింపేందుకు.. తాగుబోతులను కూడా తాకట్టు పెట్టి మరీ అప్పులు చేస్తున్న జగనన్నను, ఆంధ్రా ప్రజలు అర్ధం చేసుకుంది ఇంతేనా?! ఆ పాటి విశ్వాసం కూడా చూపించరా? వెరీ బ్యాడ్ బాసూ..వెరీబ్యాడ్!