అమరావతి: విజయవాడలోని ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం నిర్వహంచబోయే స్వాతంత్య్ర దినోత్సవంలో యోగాంధ్ర-ఆరోగ్యాంధ్ర శకటం ప్రత్యేక ఆకర్షణగా ఉండబోతుంది. యోగాకు మరింత ప్రాచుర్యాన్ని తీసుకొచ్చే చర్యల్లో భాగంగా వైద్యారోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశాల మేరకు ఉన్నతాధికారులు శకటాన్ని ప్రత్యేక హంగులతో సిద్ధం చేశారు. రాష్ట్రీయ బాల స్వస్త్య కార్యక్రమం, రాష్ట్రంలో ప్రసూతివైద్య సహాయకుల పాత్ర, ప్రజారోగ్యానికి సాంకేతిక సంజీవని – డిజిటల్ నర్వ్ సెంటర్, జాతీయ అంధత్వ నివారణ మరియు దృష్టి లోప నివారణ వంటి ముఖ్యమైన కార్యక్రమాల్ని ఈ శకటం ద్వారా వివరించనున్నారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దార్శనిక నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘యోగాంధ్ర 2025’ ప్రచారాన్ని ప్రారంభించింది. “ఒకే భూమి, ఒకే ఆరోగ్యం కోసం యోగా” అనే ప్రపంచవ్యాప్త ఇతివృత్తంతో మే 21 నుండి జూన్ 21 వరకు 30 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీని ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 2.44 కోట్లకు పైగా పౌరులను సమీకరించారు. ఈ ప్రచారంలో భాగంగా, ప్రజలలో అవగాహన కల్పించడంతో పాటు శిక్షణా కార్యక్రమాలు నిర్వహించారు. ఆధునిక సాంకేతికతను ఉపయోగించి 1.91 కోట్ల డిజిటల్ యోగా సర్టిఫికేట్లను జారీ చేశారు. రాష్ట్రంలోని 26 జిల్లాల్లో మహిళలు, దివ్యాంగులు, గిరిజనుల కోసం ప్రత్యేక థీమాటిక్ యోగా దినోత్సవాలు, 100కు పైగా పర్యాటక కేంద్రాలలో యోగా కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ ఉద్యమంలో భాగంగా జూన్ 21న విశాఖపట్నం ఆర్కే బీచ్లో జరిగిన ముగింపు కార్యక్రమంతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ‘ఒకే వేదికపై అతిపెద్ద యోగా సెషన్’తో సహా 21 వరల్డ్ బుక్ అఫ్ రికార్డ్స్, 2 గిన్నిస్ వరల్డ్ రికార్డులను సృష్టించింది.