– వైసీపీ నేతలపై ఎమ్మెల్యే పరిటాల సునీత ఆగ్రహం
– కుంటిమద్ది చెరువును పరిశీలించి గంగపూజ చేసిన ఎమ్మెల్యే
– మేము ఏం చేశామన్నదానికి ప్రత్యక్ష సాక్ష్యమే ఈ నీరు
– సీఎం చంద్రబాబు చొరవతోనే మళ్లీ సీమ ప్రాజెక్టులకు మహర్దశ
– సెంటు భూమి కూడా సేకరించని వారు కూడా మాట్లాడుతున్నారన్న సునీత
రామగిరి: రాయలసీమ ప్రాజెక్టుల గురించి మాట్లాడే నైతిక హక్కు వైసీపీ నాయకులకు లేదని.. రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు. రామగిరి మండలంలోని కుంటిమద్ది చెరువును ఆమె పరిశీలించి గంగపూజ నిర్వహించారు. చెరువు ఆయకట్టు కింద సాగవుతున్న పంటల వివరాల గురించి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీత మాట్లాడుతూ.. రాయలసీమకు ఏదో ద్రోహం జరిగిపోయిందని ఊగిపోతున్న వైసీపీ నాయకులకు కళ్ల ముందే ఇంత పెద్ద ఎత్తున హంద్రీనీవా నీరు పారుతున్న దృశ్యాలు కనిపించడం లేదా అని నిలదీశారు. కరవుతో అల్లాడుతున్న అనంతపురం జిల్లాకు ఈ రోజు 40టీఎంసీల మేర నీరు వస్తోందంటే.. అది ముఖ్యమంత్రి చంద్రబాబు ముందు చూపు వలనేనన్నారు.
గత ఐదేళ్లలో సీమకు నీరందించే ప్రాజెక్టులపై ఎంత ఖర్చు చేశారో చెప్పగలరా అని నిలదీశారు. హంద్రీ-నీవా ప్రాజెక్టు గత ఐదేళ్లలో పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ పరిటాల రవీంద్ర అప్పర్ పెన్నార్ ఎత్తిపోతల పథకం అన్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో 804కోట్లతో రెండు రిజర్వాయర్ల నిర్మాణంతో పాటు పేరూరు ప్రాజెక్టుకు నీరందించే పనులు ప్రారంభమయ్యాయన్నారు. కొంతవరకు భూసేకరణతో పాటు 30శాతం కాలువ త్రవ్వకం పనులు కూడా జరిగాయన్నారు.
అయితే ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం కనీసం సెంటు భూమి సేకరించలేదు, తట్టెడు మట్టి కూడా తీయలేదన్నారు. పైగా పుట్ట కనుమ, సోమవాండ్లపల్లి రిజర్వాయర్ల స్థానంలో పుట్టకనుమ రద్దుచేసి కొత్తగా దేవరకొండ, ముట్టాల, గొరిదిండ్ల రిజర్వాయర్లు తెస్తామని ప్రగల్భాలు పలికారన్నారు. కానీ రిజర్వాయర్లు కాదు కదా.. కనీసం సెంటు భూమి కూడా సేకరించలేదన్నారు. వైసీపీ ఆ రోజే చిత్తశుద్ధితో వ్యవహరించి ఉంటే.. నియోజకవర్గం సస్యశ్యామలం అయ్యేదన్నారు.
మాకు చిత్తశుద్ధి ఉంది కాబట్టే ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు పరిటాల రవి వర్ధంతి సందర్భంగా ఈ పనులు మళ్లీ పునః ప్రారంభించామన్నారు. అసలు వైసీపీ నాయకులు మాట్లాడేందుకు ఏమీ లేక రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును తలకెత్తుకున్నారన్నారు. అనుమతులు లేకుండానే మట్టి పనులు చేసి రూ.900 కోట్లు కొల్లగొట్టారని విమర్శలు చేశారు. వాస్తవంగా ఈ ప్రాజెక్టును అనుమతులు లేని కారణంగా 2020లోనే ఆపేశారన్నారు.
కూటమి ప్రభుత్వ 19 నెలలపాలనలో రూ.8 వేల కోట్లు సీమ ప్రాజెక్టులకు ఖర్చు చేసిందన్నారు. అంతేకాకుండా ముందస్తు ప్రణాళికతో అన్ని రిజర్వాయర్లలో నీరు ఉండేలా చేశారన్నారు. ప్రస్తుతం వైసీపీ నేతలు తమ ఉనికి కోసమే ఛలో పోతిరెడ్డిపాడు లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్నారు. ప్రాజెక్టుల విషయంలో వైసీపీ నాయకులతో చెప్పించుకునే స్థితిలో ఈ ప్రభుత్వం లేదని.. ఇప్పటికే ఇచ్చిన మాట ప్రకారం అన్ని ప్రాజెక్టులను మళ్లీ పట్టాలెక్కించిందని ఎమ్మెల్యే సునీత స్పష్టం చేశారు.