బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ ఘాటు వ్యాఖ్యలు
అమరావతి:గత వైసీపీ ప్రభుత్వ పాలనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కల్తీ మనస్తత్వం, కల్తీ పాలనతో ఎలాంటి దుష్పరిణామాలు వస్తాయో గత ప్రభుత్వం నిరూపించిందని అన్నారు. దేవాలయాల వ్యవస్థను దిగజార్చే ప్రయత్నం గత ప్రభుత్వంలో జరిగిందని, సుమారు 200కు పైగా దేవాలయాలపై దాడులు జరిగినా వాటిని తుంటరి చర్యలుగా పక్కన పెట్టేశారని విమర్శించారు. దేవాలయాల్లోని వ్యవస్థలను భ్రష్టుపట్టించిన తీరుకు టీటీడీలో జరిగిన కల్తీ నెయ్యి వ్యవహారమే నిదర్శనమని పేర్కొన్నారు. పాల సేకరణే చేయని ఒక డెయిరీ నెయ్యిని ఎలా సరఫరా చేసిందని ప్రశ్నించిన ఆయన, నెయ్యి కాని నెయ్యితో లడ్డూలు తయారు చేయడం బాధాకరమన్నారు. రసాయనాలతో ప్రసాదాలు తయారు చేయడం ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడడమే కాక భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసిందని మండిపడ్డారు. అయినా కల్తీ నెయ్యి విషయంలో వైసీపీ తనంతట తానే క్లీన్చిట్ ఇచ్చుకోవడం ఆశ్చర్యకరమన్నారు.
రాష్ట్రంలో అన్యమతస్తుల ప్రాబల్యాన్ని పెంచి, దానిని ఓటు బ్యాంకుగా మార్చుకోవాలనే ఆలోచనతోనే గత ప్రభుత్వం వ్యవహరించిందని ఆరోపించారు. ఆగమ శాస్త్రాలను పట్టించుకోకుండా, సేవలకు భంగం కలిగించి, నిబంధనలకు తిలోదకాలు ఇచ్చారని విమర్శించారు. టీటీడీతో పాటు అనేక పెద్ద ప్రాజెక్టుల్లో అక్రమాలకు తెరలేపారని అన్నారు. “లడ్డూను కూడా వదలకపోవడం బాధాకరం. తప్పు మీరు చేసి.. మేం క్షమాపణలు చెప్పాలా..? ఎవరు చెప్పాలి, ఎందుకు చెప్పాలి?” అని ప్రశ్నించారు. ల్యాబ్ రిపోర్టులను పక్కన పెట్టి అబద్ధాలు రాస్తే క్షమాపణ చెప్పాలా? సింథటిక్ నెయ్యి వాడినందుకు మేం క్షమాపణ చెప్పాలా? అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో సుమారు రూ.250 కోట్లు చేతులు మారాయని ఆరోపించిన ఆయన, స్వామివారి ప్రసాదాలు, వ్యవస్థలు దుర్వినియోగం అయినందుకు క్షమాపణ చెప్పాలా? అన్యమతస్తులను టీటీడీ ఛైర్మన్లుగా నియమించినందుకు మేం క్షమాపణ చెప్పాలా? అంటూ నిలదీశారు.
భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా, భక్తుల విశ్వాసాలు సన్నగిల్లకుండా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పీవీఎన్ మాధవ్ స్పష్టం చేశారు. స్వామివారి కైంకర్యాలు, ప్రసాదాలు శాస్త్రోక్తంగా, నిబంధనల ప్రకారం నిర్వహిస్తామని తెలిపారు. అన్ని దేవాలయాల పవిత్రత కాపాడే విధంగా ప్రభుత్వం కట్టుదిట్టంగా వ్యవహరిస్తోందన్నారు. గత ప్రభుత్వ హయాంలో దేవాలయాల్లో రథాలు దగ్ధమయ్యాయని, ఆభరణాలు మాయమయ్యాయని, శిరచ్ఛేదం వంటి ఘోర ఘటనలు చోటుచేసుకున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ రోజుల్లో వైసీపీ కండువా వేసుకున్నట్లుగా డీజీపీ మాట్లాడారని, ఆరెస్సెస్, బీజేపీలపై ఆరోపణలు గుప్పించారని గుర్తుచేశారు