Suryaa.co.in

Andhra Pradesh

1995 నాటి ముఖ్యమంత్రిని మీరు మళ్లీ చూస్తారు

– 2024 లో కూటమి ప్రభుత్వానికి ప్రజలు చారిత్రక విజయం ఇచ్చారు
– సూపర్-6 హామీలు కచ్చితంగా అమలు చేస్తాం
– ఐదేళ్ల పాటు గత పాలకులు అన్ని వ్యవస్థలను విధ్వంసం చేశారు
– గత ప్రభుత్వ పాలన నేరాలు, ఘోరాలకు అడ్రస్‌గా మారింది
– ఎన్నో చిక్కుముడులు ఉన్నాయి..ఒక్కోటి విప్పుకుంటూ అభివృద్ధితో ముందువెళ్తున్నాం
– మీడియాతో చిట్‌చాట్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

అమరావతి : మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. ఈ చిట్‌చాట్‌లో సీఎం చంద్రబాబు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ‘జగన్ రెడ్డి ఐదేళ్ల ప్రభుత్వంలో రాష్ట్ర ప్రజలు ఎంతో ఇబ్బంది పడ్డారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రజలకు ఎంతో భరోసా కలిగింది. జగన్ అరాచక విధానాలతో అన్ని వ్యవస్థలను విధ్వంసం చేశారు. అమరావతి, పోలవరం, ఇతర సాగునీటి ప్రాజెక్టులను సమస్యల వలయంలో నెట్టివెళ్లాడు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నాలుగు సార్లకుపైగా ఢిల్లీ వెళ్లి కేంద్రం నుంచి నిధులు తేవడంతో పాటు సాంకేతిక పరమైన సమస్యలను పరిష్కరించుకున్నాం. ఉన్మాదంతో సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టిన వారిని కట్టడి చేస్తున్నాం. సమస్యల సుడిగుండంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ను గట్టెక్కించేందుకు ఒక్కో చిక్కుముడిని విప్పుకుంటూ ముందుకు వెళ్తున్నాం.

జగన్ రెడ్డి ప్రభుత్వ తప్పిదాలు రాష్ట్ర ప్రజలకు శాపాలుగా మారాయి. వాటిని సరిచేసేందుకు ఈ ఆరు నెలల పాటు కసరత్తు చేశాం. గత ఐదేళ్ల పాలన నేరాలు ఘోరాలకు అడ్రస్‌గా మారింది. కూటమి ప్రభుత్వం రాగానే శాంతి భద్రతలను సక్రమంగా అమలు చేస్తూ నేరాలను తగ్గించేందుకు కృషి చేస్తున్నాం’ అని సీఎం చంద్రబాబు అన్నారు.

గత పాలనంతా విధ్వంసం…మేము రిపేర్లు చేస్తూ వెళ్తున్నాం

‘మా ప్రభుత్వానికి కొన్ని ప్రాధాన్యతలు ఉన్నాయి. అందుకు అనుగుణంగానే మేం పాలన సాగిస్తున్నాం. 2024 ఎన్నికల్లో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చరిత్రాత్మక విజయం సాధించింది. రాష్ట్రంలో ప్రజానికంతో పాటు వివిధ పార్టీల నాయకులు గత ప్రభుత్వ హయాంలో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మేము వచ్చాక ఆరు నెలల్లో ప్రజలకు ఒక నమ్మకం కలిగింది. వారి భవిష్యత్‌పై నమ్మకం కలిగేలా మేం పనిచేస్తున్నాం. ధ్వంసమైన వ్యవస్థలను రిపేర్ చేసుకుంటూ వేళ్తూ ప్రజల ఆశలకు అనుగుణంగా పాలన సాగిస్తున్నాం.

పోలవరం ప్రాజెక్ట్, అమరావతి నిర్మాణానికి జగన్ అనేక చిక్కుముడులు వేశాడు. వాటిని విడదీస్తూ అభివృద్ధి చేసుకుంటూ వెళ్తున్నాం. పోలవరం ప్రాజెక్టుకు టెక్నికల్ కమిటీ ఫిజుబిలిటీ రిపోర్ట్ ఇచ్చింది. కేంద్రం నుంచి నిధులు రాబట్టి త్వరలో పోలవరం ప్రాజెక్ట్ పనులు ప్రాంభించి అనుకున్న సమయానికే పూర్తి చేస్తాం. ప్రజలు కూటమి ప్రభుత్వంపై చాలా నమ్మకం పెట్టుకున్నారు. ఆ నమ్మకానికి అనుగుణంగా పని చేస్తాం. నేను ఎప్పుడూ రాజకీయ కక్షలు తీర్చుకోను…తప్పు చేసిన వారిని మాత్రం వదిలేది ప్రసక్తి లేదు. ఎంతటి వారైనా చట్టం ముందు నిలబడాల్సిందే’ అని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు.

1995 నాటి ముఖ్యమంత్రిని మీరు మళ్లీ చూస్తారు

‘1995లో సీఎంగా నా పనితీరు చూశారు. ఇక ముందుకు కూడా ఆనాటి సీఎంను చూస్తారు. సోషల్ మీడియాలో ఇదివరకు లాగా ఇష్టమొచ్చినట్టు అసభ్యకరమైన పోస్టులు పెడితే కఠిన చర్యలు ఉంటాయి. సెకీ ఒప్పందం మాకు లడ్డూలా దొరికిన విషయం వాస్తవమే. చట్టం ప్రకరామే ముందుకు వెళ్తాం. రికార్డులను పరిశీలించి చర్యలు తీసుకుంటాం. 2004లో నన్ను ఎవరూ ఓడించలేదు. హైదరాబాద్‌ను అభివృద్ధి చేశా. నేను చేసిన అభివృద్ధి ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోయాం.

ఈ సారి చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తూ… ప్రజలను నాతోపాటే తీసుకెళ్తాను. ఆరు నెలలల్లో వేల కోట్లు పెట్టుబడులు వచ్చాయి. గత ప్రభుత్వ హయాంలో ఇన్ని వేల కోట్లు పెట్టుబడులు రాలేదన్నారు. ఇచ్చిన హామీలైన సీపీఎస్ రద్దు, మద్య నిషేధం అమలు చేస్తామని అబద్ధాలు చెప్పాడు. అధికారంలోకి వచ్చాక నాకు తెలియదు, ఇంత ఖర్చు అవుతుందని అనుకోలేదు అంటూ మాట మార్చారు. ఎంతమంది ఉన్నా అమ్మఒడి ఇస్తామని హామీ ఇచ్చి అమలు చేయలేదు. మేము మాత్రం ఇచ్చిన సూపర్ 6 హామీలను కచ్చితంగా అమలు చేస్తాం’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు.

LEAVE A RESPONSE