– ప్రపంచంతో పోటీ పడేలా క్రీడా పాలసీ ని తీసుకు వస్తున్నాం
– తెలంగాణ క్రీడా విధానం కేవలం ఒక కాగితం కాదు.బంగారు రేకులతో రాసిన పత్రం
– ఒలంపిక్స్ లో ఒక్క గోల్డ్ మెడల్ రాకపోవడం దేశానికే అవమానం
– ఒక్క పతకం కూడా రాకపోతే మన మొహం ఎక్కడ పెట్టుకుంటాం.?
– తెలంగాణ స్పోర్ట్స్ కాన్ క్లేవ్ లో సీఎం రేవంత్ రెడ్డి
ఢిల్లీ: చాలా లోతుగా ఆలోచించి తెలంగాణ క్రీడా పాలసీ ని తీసుకువచ్చాం. ఇప్పటి వరకు రాష్ట్రానికి క్రీడా విధానం ఏది లేదు. క్రీడా పాలసీ లేకపోవడం వల్ల యువత పెడదారి పడుతోంది. ఈ మధ్య కాలంలో తెలంగాణలో డ్రగ్స్, గంజాయి కేసులు బాగా పెరిగిపోయాయి.
డ్రగ్స్, గంజాయి నియంత్రణకు ఈగల్ ఫోర్స్ ను ఏర్పాటు చేశాం. దేశంలో క్రీడలను ప్రోత్సహించకపోవడం వల్ల యువత డ్రగ్స్ కు అలవాటు పడే ప్రమాదం ఉంది. తెలంగాణ చైతన్యవంతమైన గడ్డ. తెలంగాణ ఉద్యమంలో యువత ముందుండి పోరాడారు. అలాంటి యువత ఇప్పుడు వ్యసనాల బారిన పడుతున్నారు.
క్రీడల్లో తెలంగాణ ప్రపంచంతోనే పోటీ పడేలా క్రీడా పాలసీ ని తీసుకు వస్తున్నాం. క్రీడల్లో రాజకీయ జోక్యం తగ్గించడానికి పబ్లిక్ , ప్రైవేట్ భాగస్వామ్యం లో క్రీడా పాలసీ ఉంటుంది. క్రీడలతో పాటు వివిధ రంగాల్లో విజయవంతమైన వారితో బోర్డు ఏర్పాటు చేశాం. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో పరిమితమైన పాత్ర పోషిస్తుంది.
1956 లో జరిగిన ఒలంపిక్స్ లో నాలుగో స్థానం సాధించిన పుట్ బాల్ జట్టు లో హైదరాబాద్ కు చెందిన వారు 9 మంది ఉన్నారు. అజారుద్దీన్, వీవీఎస్ లక్ష్మణ్, రవికాంత్ రెడ్డి, సిరాజ్, నిక్కత్ జరీన్ , దీప్తి లాంటి అనేక మంది క్రీడాకారులు తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సిరాజ్, నిక్కత్ జరీన్ కు గ్రూప్ వన్ ఉద్యోగం తో పాటు హైదరాబాద్ లో ఇంటి స్థలం ఇచ్చి ప్రోత్సహించాం.
ఫారా ఒలంపిక్స్ లో రాణించిన దీప్తికి కోటి రూపాయల నగదు బహుమతితో పాటు ఇంటి స్థలం ఇచ్చాం. చదువులోనే కాదు క్రీడల్లో రాణించినా రాష్ట్ర ప్రభుత్వం గుర్తిస్తుందనే సందేశం ఇచ్చాం. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల క్రీడా మైదానాలు ఫంక్షన్ హాల్స్ గా మారాయి. సన్బర్న్ లాంటి ఈవెంట్స్ కు వేదికగా మారాయి.
తెలంగాణలో స్పోర్ట్స్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ అకాడమీ ఏర్పాటు చేస్తున్నాం. 140 కోట్ల జనాభా ఉన్న భారత దేశానికి ఒలంపిక్స్ లో ఒక్క గోల్డ్ మెడల్ రాకపోవడం దేశానికే అవమానం.ఒలంపిక్స్ లో దేశానికి 71వ స్థానం రావడం అందరూ ఆలోచించాల్సిన విషయం. దక్షిణ కొరియా లో ఒక్క స్పోర్ట్స్ యూనివర్సిటీ కి 16 బంగారు పతకాలు వచ్చాయి.. ఒక్క అమ్మాయి కి 3 పతకాలు గెలుచుకుంది.
క్రీడలకు తెలంగాణ ను వేదిక చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. విజన్ డాక్యుమెంట్ 2047 లో స్పోర్ట్స్ పాలసీ కి ఒక ఛాప్టర్ కేటాయించాం. నేషనల్ గేమ్స్ , కామన్వెల్త్ గేమ్స్ , వరల్డ్ మిలటరీ గేమ్స్ ను నిర్వహించిన చరిత్ర హైదరాబాద్ కు ఉంది. వచ్చే ఒలంపిక్స్ నిర్వహణకు సిద్ధమని మనం ప్రకటించాం.. కాని అందులో ఒక్క పతకం కూడా రాకపోతే మన మొహం ఎక్కడ పెట్టుకుంటాం.?
డ్రగ్స్ సప్లై చేసేవాళ్లు తెలంగాణ వైపు చూస్తే ధైర్యం లేకుండా ఈగల్ ఫోర్స్ ను ఏర్పాటు చేశాం. గంజాయి, డ్రగ్స్ తీసుకునే వారు ఎంతటి పెద్దవారైనా ఈగల్ ఫోర్స్ వదిలిపెట్టదు.గంజాయి, డ్రగ్స్ తీసుకోవాలంటే భయం కలిగేలా చర్యలు తీసుకుంటున్నాం.2026 లో ఖేల్ ఇండియా నిర్వహణకు అవకాశం ఇవ్వాలని ఇప్పటికే కేంద్రాన్ని కోరాం. ఒలంపిక్స్ లో రెండు విభాగాల నిర్వహణకు సిద్ధమని కేంద్రానికి తెలిపాం. తెలంగాణ క్రీడా విధానం కేవలం ఒక కాగితం కాదు.బంగారు రేకులతో రాసిన పత్రం . ఒలంపిక్స్ లో పతకం తేవడమే లక్ష్యం గా పనిచేస్తాం. స్పోర్ట్స్ పాలసీతో రాష్ట్రంలో కొత్త అధ్యాయం మొదలుకావాలి. క్రీడలకు బడ్జెట్ లో నిధులు కేటాయిస్తాం.