-విధ్వంసక ప్రభుత్వ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
– తెలుగుదేశం పార్టీ రాజకీయ కార్యదర్శి టిడి జనార్దన్
– కేంద్ర కార్యాలయంలో ఆరంభమైన యువత శిక్షణాతరగతులు
అమరావతి: రాబోయేరోజుల్లో తెలుగుదేశం పార్టీలో యువరక్తం కీలకపాత్ర పోషించబోతోందని టిడిపి పొలిట్ బ్యూరో సభ్యుడు, రాజకీయ కార్యదర్శి తొండెపు దశరధ జనార్దన్ పేర్కొన్నారు. రాబోయేరోజుల్లో పార్టీలో యువత పోషించాల్సిన పాత్రపై కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన శిక్షణా శిబిరానికి తెలుగుయువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరాం చినబాబు అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిధిగా హాజరైన జనార్దన్ మాట్లాడుతూ… తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత నాడు అన్న ఎన్టీఆర్ ఎందరో యువతీయువకులకుఅవకాశాలు కల్పించారని తెలిపారు. డాక్టర్లు, ఇంజనీర్లు, వ్యాపారవేత్తలుగా రాణించిన వృత్తినిపుణులైన యువతకు రాజకీయాల్లో అవకాశాలిచ్చి సామాన్యులను అసామాన్యులుగా తీర్చిదిద్దిన ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కుతుందన్నారు. 40సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం తెలుగుదేశం పార్టీ నిరంతరం రాష్ట్రాభివృద్ధి కోసమే పనిచేసిందని తెలిపారు. యువతకు 40శాతం సీట్లు కేటాయిస్తానని పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఇప్పటికే ప్రకటించారని, దీనిద్వారా రాబోయే రోజుల్లో ఔత్సాహికులైన యువకులకు అవకాశాలు లభిస్తాయని తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న అరాచకపాలనపై యువత ప్రజలను చైతన్యవంతం చేస్తూ, రాష్ట్రాభివృద్ధితోపాటు యువతకు ఉపాథి అవకాశాల కల్పనకు చంద్రబాబునాయుడు చేసిన కృషిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. అధికారపార్టీ బెదిరింపులకు ఎవరూ భయపడాల్సిన పనిలేదని, యువనేత లోకేష్ ఆధ్వర్యంలో పార్టీ అండగా నిలుస్తుందని జనార్దన్ పేర్కొన్నారు.
మాజీమంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ… వైసిపి మూడేళ్ల విధ్వంసక పాలనలో రాష్ట్రం 30ఏళ్ల వెనక్కి వెళ్లిందని చెప్పారు. గత తెలుగుదేశం ప్రభుత్వం యువత భవిత కోసం నిరంతరం శ్రమించిందని తెలిపారు. వైసిపి ప్రభుత్వం యువతకు ఉద్యోగాలు కల్పించకపోగా… వారిని మత్తుపదార్థాలు, డ్రగ్స్ కు బానిసలుగా చేసి యువశక్తిని నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. జగన్ ప్రభుత్వం విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేయడం వల్లే పదోతరగతిలో 2లక్షలమంది విద్యార్థులు ఫెయిలయ్యారని తెలిపారు. తెలుగుదేశం పార్టీ విధానం అభివృద్ధి, సంక్షేమైతే… విధ్వంసమే ఎజెండా వైసిపి పాలన సాగిస్తోందని దుయ్యబట్టారు.
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధిలో యువత పాత్ర కీలకమని, వారి ఆశయాలు, ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రాన్ని తీర్చిద్దాలన్నదే పార్టీ అధినేత చంద్రబాబునాయుడు లక్ష్యమని అన్నారు. విధ్వంసక పాలనలో అధఃపాతాళానికి చేరిన రాష్ట్రాన్ని పునర్నిర్మించడం ఒక తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని అంటూ పార్టీని తిరిగి అధికారంలోకి తెచ్చేందుకు తెలుగుయువత కృషిచేయాలని కోరారు. శాసమండలి సభ్యుడు పర్చూరి అశోక్ బాబు మాట్లాడుతూ రాష్ట్రప్రజల ఆశలు, ఆకాంక్షలను నెరవేరాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం అనివార్యమని, గత మూడేళ్లుగా యువత, నిరుద్యోగులను ఈ ప్రభుత్వం ఏవిధంగా వంచించిందో ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. యువతకు మరిన్ని అవకాశాలు కల్పించేందుకు పార్టీ అధిష్టానం కృతనిశ్చయంతో ఉందని తెలిపారు.
తెలుగుదేశం పార్టీ మానవవనరుల విభాగం చైర్మన్, మాజీ ఐఎఎస్ అధికారి బి, రామాంజనేయులు మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీ ఆవశ్యకతను యువత కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని తెలిపారు. తెలుగుదేశం పార్టీలో యువకులు పోషించాల్సిన పాత్రను ఆయన వివరించారు. టిడిపి హయాంలో యువత కోసం నిరుద్యోగ భృతి, స్టడీసర్కిల్స్ ఏర్పాటు, ఎన్టీఆర్ విదేశీవిద్య వంటి ఎన్నో పథకాలను అమలుచేయగా, ప్రస్తుత ప్రభుత్వం వాటన్నింటినీ రద్దుచేసిందని తెలిపారు. తెలుగుదేశం పార్టీ ప్రోగ్రామ్ కమిటీ కోఆర్డినేటర్ మద్దిపట్ల వెంకటరాజు మాట్లాడుతూ…తెలుగుదేశం అధికారంలోకి వస్తేనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని, పార్టీని అధికారంలోకి తేవడానికి తెలుగుయువత కార్యకర్తలు నడుంబిగించాలని అన్నారు. పార్టీ ఇచ్చిన కార్యక్రమాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లేందుకు యువత మరింత సమర్థవంతంగా కృషిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో హెచ్ ఆర్ డి విభాగం ముఖ్య సలహాదారు ప్రొఫెసర్ భాస్కర్ రెడ్డి, తెలుగుయువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవి నాయుడు, కిలారి నాగశ్రవణ్, హెచ్ ఆర్ డి విభాగం సభ్యులు రాజేంద్రప్రసాద్, ఎస్ పి సాహెబ్, వసంత సత్యనారాయణ, టిడిఎల్ పి కో ఆర్డినేటర్ సురేష్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.