– కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ
గుంటకల్లు: దేశ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే రోజ్గార్ మేళా ప్రధాన ఉద్దేశమని, అందుకు కేంద్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ అన్నారు. గుంతకల్లు డివిజన్లో శనివారం నిర్వహించిన 16వ మేళాకు కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మొదట దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో 16వ రోజ్ గార్ మేళా ద్వారా 51,000 మందికి నియామక పత్రాలు అందజేసే కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు.
అనంతరం గుంటకల్లులో రైల్వే, పోస్టల్ శాఖల్లో ఎంపికైన యువతకు ఉద్యోగ నియామక పత్రాలను కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ చేతుల మీదుగా అందజేసి ఎంపికైన వారిని అభినందించారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ మాట్లాడారు. భారత యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎటువంటి రాజీ లేకుండా కృషి చేస్తున్నారన్నారు. గత కొంతకాలంగా రోజ్గార్ మేళాల ద్వారా దేశవ్యాప్తంగా ఇప్పటికే 10 లక్షలకుపైగా ఉద్యోగ నియామక పత్రాలు పంపిణీ చేసినట్టు తెలిపారు.
నియామక పత్రాలు అందుకున్న వారు కేవలం ఉద్యోగులుగా మాత్రమే భావించకుండా దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని, వారి సేవా, మనోభావం, కర్తవ్య నిబద్ధత భారత భవిష్యత్తును మరింత బలంగా నిర్మించగలదన్నారు. ఇటీవల జమ్మూ కాశ్మీర్లో చెనాబ్ నది పై నిర్మించిన ప్రపంచంలో ఎత్తైన రైల్వే వంతెన నిర్మాణంలో ఉక్కు శాఖకు చెందిన స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సెయిల్) సంస్థ ద్వారా 16,000 టన్నుల హై స్ట్రెంగ్త్ స్టీల్ సరఫరా చేయడం భారతీయ పరిశ్రమ సామర్థ్యానికి నిదర్శనమని శ్రీనివాస వర్మ పేర్కొన్నారు. ప్రభుత్వ రంగంతో పాటు ప్రైవేట్ రంగంలోనూ ఉద్యోగ అవకాశాల సృష్టికి కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని తెలిపారు. ముఖ్యంగా మహిళల అభివృద్ధికి అనుకూలంగా శ్రమ చట్టాలలో అనేక సంస్కరణలు తీసుకొచ్చామన్నారు.
ఈ కార్యక్రమంలో గుంతకల్లు డివిజనల్ రైల్వే మేనేజర్ చంద్రశేఖర్ గుప్తా, ఏడీఆర్ఎం సుధాకర్, పోస్టల్ శాఖ అదనపు డైరెక్టర్ వెంకట్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు, ఉద్యోగ నియామక పత్రాలు అందుకున్న యువత, వారి కుటుంబ సభ్యులు తోపాటు బీజేపీ స్థానిక నాయకులు పాల్గొన్నారు.