Suryaa.co.in

Andhra Pradesh

వైఎస్ ఎవరి ఆస్తులు వారికి ఇచ్చేశారు

– ఇప్పుటి ఆస్తులన్నీ జగన్ కష్టార్జితమే
– వాటితో షర్మిలకు ఎలాంటి సంబంధం లేదు
– ప్రేమ ఉంది కాబట్టే షర్మిలకు షేర్లు ఇచ్చారు
– చంద్రబాబు చేతిలో పావుగా మారిన షర్మిల
– మాజీ మంత్రి పేర్ని నాని

తాడేపల్లి: “రాజశేఖర్ రెడ్డి గారు మరణించకముందే ఆస్తుల పంపకాలు చేశారు. జగన్ కు ఇవ్వాల్సినవి జగన్ కు ఇచ్చారు. షర్మిలకు ఇవ్వాల్సినవి షర్మిలకు ఇచ్చారు. బంజారాహిల్స్ లో 280 గజాల స్థలం, ఇడుపులపాయలో 51 ఎకరాల పొలం, 15 మెగావాట్ల ఎస్ఆర్ఎస్ హైడ్రో పవర్ ప్రాజెక్టు, స్వాతి హైడ్రో పవర్ ప్రాజెక్టులో వాటాలు, విజయవాడ రాజ్ యువరాజ్ థియేటర్లో 35 శాతం వాటా, పులివెందులలో 7.6 ఎకరాల భూమి, విజయలక్ష్మి మినరల్స్ ట్రేడింగ్ కంపెనీ నూటికి నూరు శాతం పంపకాలు చేశార ” ని, మాజీ మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు.

సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు రాష్ట్రంలో ఆడబిడ్డలపై అఘాయిత్యాలు జరుగుతుంటే టీడీపీకి ఏమాత్రం పట్టదు. కానీ పెద్ద భూకంపం వచ్చినట్టుగా, ఏపీ బద్దలైపోతుందన్నట్టుగా జగన్ కుటుంబ వ్యవహారాన్ని ప్రచారం చేస్తున్నారని విరుచుకుపడ్డారు.

తన పార్టీ అధినేత, మాజీ సీఎం జగన్ తన చెల్లి షర్మిల-తల్లి విజయమ్మకు ఇవ్వాల్సిన షేర్లు లాక్కునేందుకు ఎన్సీఎల్టీని ఆశ్రయించడంపై వస్తున్న విమర్శలకు పేర్ని స్పందించారు.

ఆయన ఇంకా ఏమన్నారంటే.. దేశంలోనే మొదటిసారి తల్లి, చెల్లిపై కేసులు పెట్టిన జగన్.. మార్కెట్లోకి మరో సంచలనంతో వస్తున్న శాడిస్టు.. ఇలాంటి కష్టం ఏ చెల్లికి రాకూడదు.. సొంత తల్లిపై కేసులు పెట్టిన సైకో జగన్.. చెల్లి షర్మిల రాజకీయ జీవితంపై జగన్ అసూయ.. అంటూ టీడీపీ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టింది .

ఇప్పుడు నేను వెల్లడించిన కంపెనీ పేర్లు కాకుండా పలు కంపెనీలు కూడా ఉన్నాయి. జగన్ వ్యాపారంలో అడుగుపెట్టి అంచెలంచెలుగా ఎదిగే క్రమంలో భారతి సిమెంట్స్, సాక్షి పేపర్ ఏర్పాటయ్యాయి. పల్నాడులో సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ కూడా ఏర్పడింది. సరస్వతి సంస్థ ఇంకా ఏర్పాటు కాలేదు. కానీ, భూ సేకరణ జరిగింది, అనుమతులు అన్నీ ఉన్నాయి. ఈ కంపెనీలు జగన్ స్వార్జితపు ఆస్తుల్లో భాగం. ఎన్నికల అఫిడవిట్, ఇతర రికార్డులు పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది.

చెల్లెలు షర్మిలపై ప్రేమ ఉండబట్టే జగన్ ఆస్తులు రాసిచ్చారు. పొరుగింట్లో గొడవ జరిగితే చంద్రబాబుకు అంత ఆనందం ఎందుకు? కుటుంబ విషయాలను అడ్డంపెట్టుకుని కుట్రలు చేస్తున్నారు. చంద్రబాబు తన ఆస్తుల్లో చెల్లెలికి వాటాలు ఎప్పుడైనా రాశారా?

షర్మిలపై జగన్ కు ప్రేమ ఉంది కాబట్టే, ఆస్తి పత్రాలపై సంతకాలు పెట్టారు. ఆమెకు ఇవ్వాల్సిన ఆస్తులు, వ్యాపారాల్లో వచ్చే ఆదాయంలో వాటా ఇచ్చారు. చంద్రబాబు చేతిలో షర్మిల పావుగా మారారు.

నెల్లూరు జిల్లాలో ఒక పండితుడు ఉన్నాడు… ఐదారుసార్లు డింకీలు కొట్టి మొన్న గెలిచాడు! సరస్వతి సంస్థ భూములు గవర్నమెంట్ లీజు అని ఆ పండితుడు అంటున్నాడు. కానీ రైతులకు డబ్బులిచ్చి ఆ భూములు కొనుగోలు చేశారు”అని మాజీ మంత్రి సోమిరెడ్డినుద్దేశించి, పేర్ని నాని వ్యాఖ్యానించారు.

LEAVE A RESPONSE