– ఘటన వివరాలు తెలుసుకుని, దాడిని తీవ్రంగా ఖండించిన వైయస్ జగన్.
తాడేపల్లి: కృష్ణా జిల్లా తాళ్ళపాలెంలో రాజకీయ ప్రత్యర్థుల చేతిలో దారుణ దాడికి గురైన వైయస్సార్సీపీ కార్యకర్తలు గిరిధర్ (ఆర్ఎంపీ డాక్టర్), సతీష్‌తో మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఫోన్లో మాట్లాడారు. దాడిలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారితో ఫోన్లో మాట్లాడిన ఆయన, ఘటన వివరాలు ఆరా తీశారు.
పార్టీ కార్యకర్తలపై పాశవికంగా చేసిన దాడిని తీవ్రంగా ఖండించిన ఆయన, ధైర్యం కోల్పోవద్దని వారికి సూచించారు. వారి ఆరోగ్య పరిస్థితి వివరాలు తెలుసుకున్న ఆయన, అవసరమైతే మెరుగైన వైద్యం అందించాలని పార్టీ నాయకులకు నిర్దేశించారు.
తమపై గూండాలు ఎలా దాడి చేశారనేది ఈ సందర్భంగా గిరిధర్, సతీష్ ఇద్దరూ వైయస్ జగన్‌కు వివరించారు. ఈ తరహా దాడులు, దౌర్జన్యాలు, అక్రమ కేసులతో వైయఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలను దారుణంగా ఇబ్బంది పెడుతున్నారన్న ఆయన, అధికారాన్ని అడ్డు పెట్టుకుని కూటమి నాయకులు చేస్తున్న దౌర్జన్యాలను బలంగా తిప్పికొడదామని ధైర్యం చెప్పారు.
పోలీసు వ్యవస్ధను అడ్డం పెట్టుకుని అధికార దుర్వినియోగానికి పాల్పడడం దారుణమన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే ఇలా కూటమి నేతలు భయోత్సాతం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ఈ అనైతిక కార్యక్రమాలన్నింటినీ ప్రజలు గమనిస్తున్నారని, వారు భవిష్యత్తులో కూటమి పార్టీలకు తగిన బుద్ది చెబుతారన్నారు.
ఏది ఏమైనా పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ ధైర్యంగా ఉండాలని, పార్టీ అందరికీ అండగా ఉంటుందని వైయస్ జగన్ భరోసా ఇచ్చారు. చేయకూడని తప్పులు చేస్తున్న వారికి వైయస్సార్సీపీ అధికారంలోకి రాగానే తగిన గుణపాఠం చెబుదామన్నారు. గిరిధర్, సతీష్ కుటుంబాలకు మాజీ మంత్రి పేర్నినాని అండగా ఉంటారని వైయస్ జగన్ భరోసా ఇచ్చారు.