• కేంద్రం పెత్తనం ఏందీ అని అన్న కెసిఆర్.. ఇప్పుడు కేంద్రం మీద నిందలు ఎందుకు మోపుతున్నారు
• ఇతర రాష్ట్రాల్లో మద్దతు ధరకు మించి బోనస్ ఇస్తున్న ప్రభుత్వాలు
• రైతు బంధు పేరుతో సబ్సిడీలు బంద్ చేసిన కేసీఆర్
• పాలకులే ధర్నాలు చేయడం ఇక్కడే చూస్తున్నాం
• ఇతర పంటలపై రైతుకు భరోసా వచ్చేంత వరకు వరి కొనాలి
• వరి కుప్పల మీదే ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతులు
• ఇతర పార్టీల నాయకులను కొన్నంత సులువు కాదు పంట మార్పిడి చేయడం అంటే..?
– రైతు వేదన నిరాహార దీక్ష లో YSR తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల
రాష్ట్ర ప్రభుత్వం వరిధాన్యం కొనబోమని చెబుతున్న నేపథ్యంలో రైతులకు అండగా నిలిచేందుకు YSR తెలంగాణ పార్టీ ఆధ్వర్యంలో పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల ధర్నా చౌక్, ఇందిరా పార్క్ హైదరాబాద్ వద్ద “రైతు వేదన” నిరాహార దీక్ష మొదలుబెట్టారు. ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి వైయస్ షర్మిల మాట్లాడారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వరి కొనుగోలు విషయంలో నెపం ఒకరి మీద ఒకరు వేసుకుంటూ అన్నం పెట్టే రైతన్న నోట్లో మాత్రం సున్నం పెడుతున్నారు. ఈరోజు రాష్ట్ర రైతాంగం అంతా వరి పండించి ఆ వరిని ఎక్కడ పడితే అక్కడ ఆరేసుకుంటు తిప్పలు పడుతున్నారు. ఆ వరి కుప్పల మీదే ఇప్పటికే ముగ్గురు రైతులు చచ్చిపోయినా కూడా దున్నపోతు మీద వాన పడినట్లు కేసీఆర్ లో మాత్రం చలనం లేదు.
అసలు ఎందుకు వడ్లు కొనడం లేదు కేసీఆర్ అని అడుగుతున్నాం..? మీకొచ్చిన ఇబ్బంది ఏమిటని అడుగుతున్నాం..? వచ్చే యాసంగిలో కేంద్ర ప్రభుత్వం బాయిల్డ్ రైస్ కాకుండా రా రైస్ మాత్రమే కొంటానన్న విషయాన్ని కేసీఆర్ ముందుకు తీసుకువచ్చి , ఈ వానా కాలం వడ్లను కొనే బాధ్యత నుంచి తప్పించుకోవాలని చూస్తున్నారు.
అసలు ప్రొక్యూర్ మెంట్ టార్గెట్ ఇంకా పూర్తి కాలేదు కదా..? ఈ వానా కాలంలో 40 లక్షల టన్నులు ఎఫ్ సీఐ తీసుకోవడానికి సిద్ధంగా ఉంది కదా..? మరి ఎందుకు కేసీఆర్ రైతుల నుంచి వడ్లు కొనడం లేదని అడుగుతున్నాం..? ఎందుకు కొనుగోలు కేంద్రాలు తెరవడం లేదని అడుగుతున్నాం..? అసలు కేసీఆర్ కు వరి ధాన్యం కొనే ఉద్దేశ్యం లేదని అడుగుతున్నాం…?
కేంద్ర ప్రభుత్వానికి ఏజెంట్ గా కేసీఆర్ మారారు. ఢిల్లీకి వెళ్లి వంగి…వంగి దండాలు ఎందుకు పెడుతున్నారని అడుగుతున్నాం…? వరి వేసుకుంటే ఉరి వేసుకున్నట్టే అని ఎందుకు చెబుతున్నారని అడుగుతున్నాం..? బాయిల్డ్ రైస్ కాదు రా రైసే మేం కొంటామని కేంద్ర ప్రభుత్వం చెబితే కేసీఆర్ ఎందుకు ఒప్పుకున్నారని, సంతకాలు పెట్టారని అడుగుతున్నాం..?
ధర్నాలు ఇక్కడ చేయడం ఏంటి కేసీఆర్. ఆంక్షలు పెట్టిన రోజునే ఢిల్లీలో కదా కేసీఆర్ ధర్నాలు చేయాల్సింది. ఆంక్షలు పెట్టిన రోజే ఢిల్లీలో కదా ప్రెస్ మీట్లు పెట్టాలి..? రోజుల తరబడి హైదరాబాద్ లో ప్రెస్ మీట్ లు పెడితే ఎవరిని ఉద్దరించినట్టు..? ఎవరి కోసం ధర్నాలు చేస్తున్నట్టు..?
మీకు దమ్ముంటే ఢిల్లీలో ధర్నాలు, ప్రెస్ మీట్ లు పెట్టండి కేసీఆర్. కేంద్రం విధిస్తున్న ఆంక్షలు ఇవి అని చెప్పి, కేంద్రం వైకరిని ఎండ గట్టాలి. అది చేత కాక ఇక్కడి కొచ్చి ధర్నాలు పెడతారా..? ఎవరిని ఉద్ధరించటానికి ధర్నాలు చేస్తున్నారు..?
YSR గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 64 లక్షల మందికి రుణమాఫీ చేశారు. ఉచిత విద్యుత్ పెట్టి రైతులు ఇవ్వాలని ఆలోచన చేసింది వైయస్ఆర్ . రైతులను అన్ని విధాలుగా ఆదుకుంది వైయస్ఆర్ .
ఎక్కడ అవసరమైతే అక్కడ ఇన్ పుట్, విత్తనాల సబ్సిడీ, పంట భీమా కూడా వైయస్ఆర్ గారు ఇచ్చారు. పెట్టుబడిని తగ్గించి రాబడిని పెంచారు. అందుకే కదా ఆ రోజు రైతు రాజు అయ్యింది. అలా కదా పని చేయాల్సింది. అది కదా ఒక ముఖ్యమంత్రి పనితనం.
ఇప్పుడు ఉన్నాడు కేసీఆర్. ఇదేనా పరిపాలన అంటే..? వడ్లు కొనమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తుంటే..? కేసీఆర్ వడ్లు కొనడం చేతగాక ధర్నాలు చేస్తున్నారు.వైయస్ఆర్ వడ్లకు మద్దతు ధరతో పాటు బోనస్ కూడా ఇచ్చారు. ఆ రోజు మద్దతు ధర 500 రూపాయలు అయితే 20 శాతం బోనస్ 100 రూపాయలు ఇచ్చి వైయస్ఆర్ కొనలేదా అని అడుగుతున్నాం.
రైతులకు మద్దతు ధర కూడా ఎందుకు కేసీఆర్ ఇవ్వలేక పోతున్నారని అడుగుతున్నాం. కేసీఆర్ కు ఎందుకు చేత కావడంలేదని అడుగుతున్నాం…? ఇప్పుడు కూడా పక్క రాష్ట్రాల్లో మహారాష్ట్ర, చతీస్ గడ్ , కేరళలలో మద్దతు ధరతో పాటు ధాన్యాన్ని బోనస్ ఇచ్చి కొంటున్నారు. మద్దతు ధర మీద భోనస్ ఇచ్చి పక్క రాష్ట్రాలు రైతులను అదుకుంటుంటే…కేసీఆర్ బోనస్ ఎందుకు ఇవ్వడం లేదని అడుగుతున్నాం..?కనీసం మద్దతు ధరకు ధాన్యం కొంటారంటే ఈ రోజు రైతులంతా ఆవేదన పడుతుంటే కేసీఆర్ కు కనీసం చీమ కుట్టినట్టైనా లేదు.
వైయస్ఆర్ సన్న బియ్యానికి 300 రూపాయలు ఎక్కువ ఇచ్చి మరీ ధాన్యం కొనుగోలు చేశారు. సన్న బియ్యానికి ఎందుకు ఎక్కువ ఇచ్చారంటే సన్న బియ్యం పంట రైతు చేతికి రావడానికి ఎక్కువ సమయం పడుతుందని, ఉత్పత్తి తక్కువగా వస్తుందని వైయస్ఆర్ గారు ఆలోచన చేసి ఎక్కువ ధరకు బియ్యం తీసుకున్నారు.
రైతులు సన్నబియ్యం కోసం తీసుకుంటున్న ఆ శ్రమకి ఫలితం ఉందా..? కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కనీసం ఇంగితమైనా ఉందా..? సన్నబియ్యం, దొడ్డు బియ్యానికి ఈ రోజు దాదాపు అదే ధర పలుకుతోంది. ఇదేనా పాలకులు రైతుల గురించి ఆలోచిస్తోంది.
మద్దతు ధర అంటే అర్థం ఏమిటి..? రైతు పండించిన పంటకు కనీస ధర మేము ఇస్తామని ప్రభుత్వం నమ్మకం ఇవ్వడమే మద్దతు ధర. రైతు పంటకు భరోసాను కల్పించడమే మద్దతు ధర.
అలాంటప్పుడు వరి ధాన్యాన్ని మద్దతు ధరకు ఎందుకు కొనుగోలు చేయకపోవడం లేదు..? రైతుకు పంట పండించడం వరకే ఆయన బాధ్యత. ఆ తర్వాత పంటను కొనుగోలు చేయడం ప్రభుత్వం బాధ్యత. కొనుగోలు చేసిన ఆ ధాన్యాన్ని ఎలా వాడుకోవాలన్నది మీ ఇష్టం. అలా కాకుండా భారం మొత్తం రైతుల మీద మోపుతున్నారు. ఇది సమంజసమేనా అని అడుగుతున్నాం.
దేశంలో ఆహార కొరత వచ్చినప్పుడు ఎవరు ఆదుకున్నారు..? నిజామాబాద్, కరీంనగర్, నల్గొండ జిల్లాల్లోని రైతులు దేశానికి అన్నం పెట్టారు. ఆ రోజు అన్నం పెట్టిన రైతులు ఈ రోజు మీ కాళ్లు పట్టుకుని పంట కొనాలా అని అడగాలా..?
అందుకేనా బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలను ఎన్నుకుంది. మీరు దొరలుగా ఉన్నట్టు మీకు బానిసలుగా రైతులు కాళ్లు పట్టుకుని వేడుకుంటే తప్ప మీరు కొనుగోలు చేయరా..? మీరు కొనే పరిస్థితిలో లేరు ఈ రోజు..?
తెలంగాణ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఒక ఇండిపెండెంట్ అసోసియేషన్ గానే ఉండాలి. అలా కాకుండా ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్స్ ని, ట్రేడ్ యూనియన్ లను గంపా గుత్తగా కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నారు. అందుకే కేసీఆర్ మిల్లర్లకు మేలు చేయాలని చూస్తున్నారు. రైతులకు నష్టం ఇస్తున్నారు..మిల్లర్లకు మేలు చేస్తున్నారు.
లారీలలో రైతులు వరి పంటను తీసుకువస్తే కట్టింగ్ ల పేరుతో రైతులను దోచుకుంటున్నారు. రైతు నష్ట పోవాలి మిల్లర్లు లాభ పడేలా టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవర్తిస్తోంది.కేసీఆర్ కు దమ్ము, దైర్యం ఉంటే సివిల్ సప్లైయ్ ఆడిట్ రిపోర్ట్ బయట పెట్టాలని సవాల్ చేస్తున్నాం.
కేంద్రం వరి కొనేందుకు, నిల్వ ఉంచేందుకు, అమ్మేందకు, వాహనాల్లో తరలింపునకు నిధులు ఇస్తోంది. ఆకరికి హమాలీలకు కూడా కేంద్రం నిధులు ఇస్తోంది. కేసీఆర్ దేనికి ఆ నిధులను ఖర్చు పెడుతున్నారు.
ఈరోజు కేసీఆర్ నియంత్రిత వ్యవసాయం అంటున్నారు. వ్యవసాయంలోనే నియంత్రితం ఉందా..? లేక మధ్యంలో కూడా నియంత్రన ఉందా..? బంగారు తెలంగాణ అని చెప్పి, బీర్లు, బార్ల తెలంగాణగా మార్చారు. నియంత్రణ వరి మీద పెట్టాలా.? మద్యం మీద పెట్టాలా..? బిక్కి తెలంగాణగా మార్చారు.
ఈరోజు డ్రగ్స్ తెలంగాణలో ఏ జిల్లాకు పోయినా దొరుకుతున్నాయి. జిల్లాలకు కూడా పాకింది అంటే ఆ పాపం కేసీఆర్ ది కాదా..? లక్షల మంది తెలుపు రేషన్ కార్డు కోసం అప్లై చేసుకున్నారు. వారికి తెల్ల రేషన్ కార్డు ఇవ్వాలని అడుగుతున్నాం.
ప్రభుత్వ పాఠశాలల్లో సగానికి పైగా మధ్యాహ్న భోజనం పెట్టడం లేదు. ఈ బియ్యం తీసుకుని ఆ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం పెట్టండి. లేక పోతే బియ్యాన్ని ఉచితంగా ఇవ్వండి. మాట ఇచ్చారు కాబట్టి ఆ మాట నిలబెట్టుకోవాల్సిన బాధ్యత కేసీఆర్ కు ఉంది.
వడ్లు కొనమని కేసీఆర్ కు పాలన అప్పగిస్తే చేతగాదు అని ధర్నాలు చేస్తున్నాడు. ఇదే ధర్నా చౌక్ లో నిన్న నిరాహార దీక్ష చేసేందుకు అనుమతి అడిగితే మాకు నిరాకరించారు. కారణం టీఆర్ఎస్ పార్టీకి ఇచ్చామని చెప్పారు.
ఈ వేదికను ఎత్తెయ్యాలనుకున్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఈ వేదికనే దిక్కైంది. సిగ్గుండాలి కదా..? ప్రభుత్వంలో ఉండి పాలన చేత గాక ధర్నాలు చేస్తున్నారు. ఇక్కడ ధర్నాలు చేస్తే ఏం సాధించినట్టు అని అడుగుతున్నాం…?
రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పి 3 లక్షల మందికి రుణమాఫీ చేశారు. 34లక్షల మందికి రుణమాఫీ ఎగ్గొట్టిన మోసగాడు కేసీఆర్. రైతు వ్యతిరేకి కేసీఆర్. రైతు బంధు పేరుతో ఇస్తోంది 5000 రూపాయలు. పట్టుకుంటున్నది 25000 రూపాయలు.
ఇన్ పుట్ సబ్సిడీ, యంత్రాలపై సబ్సిడీ, యంత్ర లక్ష్మీ లేదు. అసలు రైతుకు భరోసానే లేదు. ఈ ఏడేండ్లలో 8000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. పాలన చేయమని అధికార మిస్తే ధర్నాలు చేస్తున్నారు. మీ కెందుకు ముఖ్యమంత్రి పదవి అని అడుగుతున్నాం..? కేంద్రం పెత్తనం ఏంటి..? ఆకరి గింజ వరకు కొంటామని కేసీఆర్ మాట ఇచ్చారు. కేంద్రం మెడలు వంచి అయినా సరే మేము వడ్లు కొంటామన్నారు. మరి ఇప్పుడు వారి మెడలు లావైనాయా..? మీ చేతులు సన్నగైనాయా..?
కేసీఆర్ కు పాలన చేత గాక వడ్లు కొనడం లేదు. మూడేండ్లు కర్ర సాము నేర్చుకుని ఆకరికి మూలనున్న ముసలమ్మను కొట్టాడట కేసీఆర్ లాంటి వాడు. లక్షల కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టును కట్టి ఇప్పుడు వరి వేసుకోవద్దని కేసీఆర్ చెబుతున్నారు.
లక్షల కోట్లు ఎందుకు ఖర్చు చేసి ప్రాజెక్టులు కట్టారని అడుగుతున్నాం..? జనాలను బస్సులల్లో కూర్చోబెట్టి తిప్పేందుకు టూరిజం కోసం కట్టారా..? లేక ఎత్తిపోసిన నీళ్లను సముద్రంలో కలిపేందుకు కట్టారా..? లక్షల కోట్లు కమీషన్లు మింగేందుకు కట్టారా..?
పక్క రాష్ట్రాలు మద్దతు ధరపైన బోనస్ ఇచ్చినట్టు కేసీఆర్ ఇస్తే క్వింటాల్ కు రైతులకు 12500 రూపాయలు వస్తాయి. అప్పుడు రైతు బంధు ఎవరికి కావాలని కేసీఆర్ ను అడుగుతున్నాం..? రైతు వ్యతిరేకి, ద్రోహి కేసీఆర్.
ఉచిత ఎరువులు ఇస్తామని కేసీఆర్ మాట ఇచ్చి నాలుగేండ్లు అవుతోంది. ఈ నాలుగేండ్లలో ఎరువుల ధరలు 50శాతం పెరిగాయి. ఆ భారమంతా రైతుల మీదే పడింది.ఖమ్మం జిల్లాలో రైతుల చేతికి సంకెళ్లు వేసిన కేసీఆర్ సర్కారు.
పంటలు మార్చుకోవడం అంటే బట్టలు, మంత్రులను మార్చుకున్నంత సులభమనుకుంటున్నారా..? రైతుకు తెలియదా ఏ పంట వేసుకోవాలో…? వ్యవసాయం కూడా దొర బాంచెన్ అని మీ కాళ్ల దగ్గరే పడి ఉండాలా..?
రైతులు, పంటల బాద్యత కేసీఆర్ ది. ఇతర పంటలు వేసుకునే భరోసా రైతుకు కలిగేంత వరకు కేసీఆర్ వరి కొనాల్సిందే..ఇతర పంటలపై మద్దతు ధర, ఎరువులు ఇచ్చేంత వరకు కేసీఆర్ వరి కొనాలని డిమాండ్ చేస్తున్నాం.
YSR తెలంగాణ పార్టీ లక్ష్యం రైతు సంక్షేమం. ధర్నా చౌక్ లో 6 గంటల వరకు మాత్రమే నిరాహార దీక్షకు అనుమతి ఇచ్చారు. కనుక మిగతా నిరాహార దీక్ష లోటస్ పాండ్ లో జరుగుతుంది.