Suryaa.co.in

Andhra Pradesh

ఆర్యవైశ్యులపై కక్షగట్టిన వైసీపీ ప్రభుత్వం

– టీడీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు డూండి రాకేశ్

వైసీపీ ప్రభుత్వం ఏర్పడినప్పటినుంచి రాష్ట్రంలోని ఆర్యవైశ్యుల్ని అనేక ఇబ్బందులు పెడుతోంది. వ్యాపారస్థున్ని మొదలుకొని ఉన్నతస్థాయి నాయకుడి వరకు ఆర్యవైశ్యులపై కక్ష సాధిస్తున్నారు. వారిని క్షోభకు గురిచేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం ఆర్యవైశ్యుల్ని పూర్తిగా అణగదొక్కుతోంది. తెలుగుదేశం పార్టీ మున్సిపల్ ఛైర్మన్లు, వైస్ ఛైర్మన్ పదవుల్నిఆర్యవైశ్యులకు ఇచ్చింది. ఆర్యవైశ్యుకు పార్టీపరంగాను, ప్రభుత్వ పరంగాను ఉన్నత పదవులు కల్పించింది. చంద్రబాబు ఆర్యవైశ్యులకు సముచిత స్థానం కల్పించారు. చంద్రబాబు ఆర్యవైశ్య కార్పొరేషన్ ను ఏర్పాటు చేసి ఆ కార్పొరేషన్ కు రూ.30 కోట్లు కేటాయించారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆర్యవైశ్యులకు ఏం చేసిందో చెప్పగలదా? అందుకు వైసీపీ నాయకులు సిద్ధమా? ఆర్యవైశ్యులపై వేధింపులు తప్ప చేసిందేమీ లేదు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 37 చోట్ల ఆర్యవైశ్యులపై దాడులు జరగిన విషయం వాస్తవమా? కాదా? సాక్ష్యాధారాలతో నిరూపించగలం. ఆరుగురు ఆర్యవైశ్యుల్ని పొట్టన పెట్టుకున్న ఈ ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుంది?

శ్రీకాకుళం నియోజకవర్గంలో ఒక ఆర్యవైశ్యుడిని నరికి చంపిన మాట వాస్తవం కాదా? ఎర్రగొండపాలెంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే ఓ ఆర్యవైశ్యుడిని కత్తితో పొడిచి చంపిన మాట వాస్తవం కాదా? టంగటూరు నియోజకవర్గంలో ఇద్దరు ఆర్యవైశ్య మహిళల్ని దారిదోపిడి దొంగల పేరుతో ఇంట్లో దూరి కత్తిపోట్లకు గురిచేశారు. నంద్యాలలో ఓ మండి అధ్యక్షుడిని నడి రోడ్డుపై చంపిన మాట వాస్తవం. బెల్లం వ్యాపారులపై సెబీ దాడులు జరిగగా.. మనస్తాపంతో చెరువులో పడి ఒకరు, రైల్వే ట్రాక్ పై తల పెట్టి మరొకరు ఆత్మహత్య చేసుకునేందుకు వైసీపీ ప్రభుత్వం కారణమైంది. ఆర్యవైశ్యులంటే వైసీపీ ప్రభుత్వానికి ఎందుకింత కక్ష? , ఎందుకింత చులకన? – కన్యకాపరమేశ్వరి దేవస్థానాలు, సత్రాలను కూడా ఆక్రమణలకు పాల్పడతారా? దాచేపల్లిలో దేవస్థాన ప్రహరీ గోడలను రోడ్డు వెడల్పు పేరుతో కూల్చారు. ఆరోజు నిరసన కార్యక్రమాలు కూడా జరిగాయి. దర్శి నియోజకవర్గంలో కన్యకాపరమేశ్వరి దేవస్థానంకు చెందిన స్థలాన్ని బస్ షెల్టర్ కు కావాలని లాక్కున్నారు. అక్కడ కుల విద్వేషాలను రెచ్చగొట్టారు. దాడులు చేయించారు.

జగయ్యపేటలో ఓ యువకుడిపై వైసీపీ నాయకులు దాడి చేశారు. పెనుగంచిప్రోలులో రియల్ ఎస్టేట్ గొడవతో ఆర్యవైశ్య నాయకుడిని నడి రోడ్డుపై అరగంటపాటు ట్రాఫిక్ ఆపి కొట్టారు. విజయవాడ వన్ టౌన్ లో, నందిగామ టౌన్ లో, మాచర్లలో వైశ్యులపై దాడి జరిగింది. ఒంగోలు సుబ్బారావును లైవ్ కాల్ చేస్తూ కొట్టి పైశాచికానందం పొందారు. నెల్లూరు, అద్దంకి, పర్చూరు, తెనాలిలో 5 మందిపై దాడులు జరిగాయి. దాల్ మిల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పై, క్యాట్రింగ్ చేసే వ్యక్తిపై దాడి జరిగింది. ఆర్యవైశ్యుల ఆస్తుల్ని నిర్దాక్షిణ్యంగా లాక్కుంటున్నారు. తెనాలిలో టీడీపీకి చెందిన వ్యక్తి స్థలాన్ని వైసీపీ నాయకుడు దౌర్జన్యంగా అనుభవిస్తున్నాడు. వైసీపీ నాయకులు చేసే ప్రతి అఘాయిత్యానికి మా వద్ద సాక్ష్యాధారాలున్నాయి. విజయవాడలో వెల్లంపల్లి శ్రీనివాస్ ఆర్యవైశ్య మహాసభ భవనాన్ని ప్రారంభిస్తే ప్రస్తుత మంత్రి శ్రీనివాస్ ఆ భవనాన్ని కూలగొట్టించారు. 37 మంది ఆర్యవైశ్యులపై దాడులు జరిగితే వైసీపీలోని ఆర్యవైశ్య నాయకులు ఏం చేస్తున్నారని వారిని ప్రశ్నిస్తున్నాను.

తెనాలిలో ఓ కార్పొరేటర్ కౌన్సిలర్ పై దాడి జరిగిందని సంఘీభావంగా దుకాణాలను మూసివేసి నిరసన తెలుపుతుండగా వైసీపీ నాయకులు మాపై దాడులు చేశారు. మామీద ఎందుకింత కక్షసాధింపులు? ఎందుకిన్ని ఇబ్బందులు పెడుతున్నారు? మా బతుకులు మాకు బతకనివ్వండి జగన్ మోహన్ రెడ్డి అని ఆర్యవైశ్యులు మొత్తుకుంటున్నారు. అనేకమంది ఆర్యవైశ్యుల్ని రాజకీయంగా అణగదొక్కారు. గిద్దలూరు ఎమ్మెల్యే ఆర్యవైశ్య కులానికి చెందిన అన్నా రాంబాబు తిరుపతిలో ప్రొటోకాల్ ఇప్పించడానికి ముఖ్యమంత్రికి ఎన్నిసార్లు మొరపట్టుకున్నా ఫలితం శూన్యం. తిరుపతిలో ప్రొటోకాల్ ఇప్పించడానికి కూడా ఇబ్బంది పెట్టారు. వైసీపీ ఎమ్మెల్యేకే దిక్కులేదు. రాష్ట్రంలో ప్రతిరోజు ఏదో ఒక ఆర్యవైశ్యుడిపై దాడి, దుర్ఘటన జరుగుతూనేఉంది. వినటానికే భయమేస్తోంది. పోరాటాలు చేసి, దెబ్బలు తిని మేం నలిగిపోతున్నామే తప్ప మీలో చలనం లేదు. ఇక చూస్తూ ఊరుకునేది లేదు. చేసిన దురాగతాల గురించి సాక్ష్యాధారాలతో సహా మా వద్ద ఉన్నాయి. ఆర్యవైశ్య సంఘాలన్నింటిని ఏకం చేసి ముందుకు తీసుకెళ్తాం. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అన్ని పార్టీలతో ఏకమై ఆర్యవైశ్యులపై జరుగుతున్న అన్యాయాలు, దురాగతాలను ఎండగడతాం.

తెలుగుదేశం పార్టీ అందరినీ ఏకం చేసి వారికి అండగా నిలబడుతుంది. ఆర్యవైశ్యులందరు బయటికొచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాలి. దాడులను ప్రతిఘటించాలి. ఆర్యవైశ్యులపై జరుగుతున్న దాడుల గురించి వైసీపీకి చెందిన ఎవరు చర్చకు వచ్చినా సిద్ధంగా వున్నాం. ఆర్యవైశ్యుల అభ్యున్నతికి కృషి చేస్తున్న చంద్రబాబునాయుడుకు అందరూ మద్దతు తెలపాలి. ఆర్యవైశ్యులు భయం వదిలి బయటికి రావాలి. ప్రతి వ్యాపారస్థుడికి ఏ ఇబ్బంది కలగకుండా టీడీపీ అండగా ఉంటుంది.- ఆర్యవైశ్యులకు టీడీపీ జెండా అండగా ఉందని టీడీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు డూండి రాకేశ్ తెలిపారు.

LEAVE A RESPONSE