-మెంటల్ హెల్త్, యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అంశాల్లో ఎయిమ్స్ తో ఏపీ ప్రభుత్వం ఎంవోయూ
-సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్సు ఇన్ పాలియేటివ్ కేర్ గా ఎయిమ్స్ అభివృద్ధి
-ఎయిమ్స్ కు మౌలిక వసతులు కల్పించినది జగనన్నే
-రూ.55 కోట్లతో నీళ్లు, కరెంటు, రోడ్లు అందుబాటులోకి తీసుకొచ్చాం
-ఎలాంటి సహకారమైనా అందించేందుకు ప్రభుత్వం సిద్ధం
-ఎయిమ్స్ కోసం చంద్రబాబునాయుడు చేసింది శూన్యం
-రోడ్లు, కరెంటు, మంచినీరు లాంటి వసతులను బాబు విస్మరించారు
-ఎయిమ్స్‌లో మంత్రి విడదల రజిని పర్యటన
-అన్ని విభాగాలను క్షుణ్ణంగా పరిశీలించిన మంత్రి
-మంత్రి వెంట ప్రభుత్వ కార్యదర్శి, ఆరోగ్యశ్రీ సీఈవో, డీఎంఈ తదితరులు
-ఎయిమ్స్ సిబ్బందితో ప్రత్యేక భేటీ
మంగళగిరిలోని ప్రతిష్టాత్మక ఎయిమ్స్ ను వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకురాబోతున్నామని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని తెలిపారు. మంగళగిరిలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థను సోమవారం మంత్రి విడదల రజిని సందర్శించారు. ఆస్పత్రిలో అందుతున్న వైద్య సేవలపై రోగులతో ప్రత్యేకంగా మాట్లాడారు. అన్ని విభాగాలను మంత్రి కలియతిరిగారు. వైద్య పరికరాలను క్షుణ్నంగా పరిశీలించారు. అనంతరం ఎయిమ్స్ సిబ్బందితో స్థానిక కాన్ఫరెన్సు హాలులో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. విలేకరుల సమావేశంలోనూ మాట్లాడారు. మంత్రి వెంట ప్రభుత్వ కార్యదర్శి నవీన్‌కుమార్, డీఎంఈ వినోద్‌కుమార్, ఆరోగ్యశ్రీ సీఈవో హరీంద్రప్రసాద్ తదితరులు ఉన్నారు. తనిఖీ సమయంలో, సమావేశంలో, విలేకరులతో మంత్రి మాట్లాడారు.
ఎయిమ్స్‌లో ఆరోగ్యశ్రీ సేవలను ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామన్నారు. అతి త్వరలోనే ఇక్కడ ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ప్రజలంతా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. మెంటల్ హెల్త్, యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అంశాల్లో ఎయిమ్స్ తో ఏపీ ప్రభుత్వం అతి త్వరలోనే ఎంవోయూలు కుదుర్చుకోబోతోందని తెలిపారు. దీనివల్ల ఏపీ ప్రభుత్వ వైద్య కళాశాలల్లోని విద్యార్థులకు ఆయా అంశాల్లో ఎయిమ్స్ నుంచి అత్యుత్తమ శిక్షణ లభిస్తుందని పేర్కొన్నారు. సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్సు ఇన్ పాలియేటివ్ కేర్ గా ఎయిమ్స్ ను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఉన్నామని, అందుకు జగనన్న ప్రభుత్వం కావాల్సిన సహాయ సహకారాలు కూడా అందిస్తుందన్నారు.
శాశ్వత తాగునీటి పరిష్కార పనులు ప్రారంభం
ఎయిమ్స్‌కు తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు ఆత్మకూరు రిజర్వాయర్ నుంచి రూ.7.74 కోట్ల ఖర్చుతో పైపు లైను పనులు మొదలుపెట్టామని చెప్పారు. సోమవారం నుంచే ఈ పనులు ప్రారంభమయ్యాయన్నారు. తాత్కాలికంగా ఈ సమస్య లేకుండా చేసేందుకు మంగళగిరి- తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ నుంచి రోజుకు 3.5లక్షల లీటర్ల నీటిని ఉచితంగా సరఫరా చేస్తున్నామని చెప్పారు. మరో లక్ష లీటర్ల నీటిని అత్యవసర సమయాల్లో వాడుకునేందుకు వీలుగా ప్రతి రోజూ అందుబాటులో ఉంచుతున్నామని తెలిపారు. అవసరమైన ప్రతిసారీ ఈ నీటిని కూడా ఎయిమ్స్ కోసం వాడుకుంటున్నారని చెప్పారు. సంస్థ విస్తరణలో భాగంగా రోజుకు అదనంగా మరో 3 లక్షల నీరు అవసరమని తమకు ఎయిమ్స్ నుంచి అభ్యర్థన వచ్చిందని, రోజుకు ఈ 3 లక్షల నీటిని విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి కూడా అదనంగా ఉచితంగా అందజేస్తున్నామని వివరించారు.
కరెంటు, రోడ్లు సమకూర్చాం
ఎయిమ్స్‌కు మౌలిక సదుపాయలైన కరెంటు జగనన్న ప్రభుత్వమే ఇచ్చింది. రూ.35 కోట్ల నిధులతో 132 కేవీ సబ్‌స్టేషన్‌ను జగనన్న ప్రభుత్వం ఎయిమ్స్ కోసం నిర్మించి ఇచ్చిందన్నారు. దాదాపు రూ.10 కోట్ల వ్యయంతో రోడ్లు, డ్రెయినేజి పనులను తమ ప్రభుత్వమే చేపట్టిందన్నారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అనుమతులు దక్కేలా చేశామన్నారు. అటవీ అనుమతుల కోసం తీవ్రంగా కృషి చేస్తున్నామని చెప్పారు. ఎయిమ్స్ ప్రాంతంలో ఉన్న పాత టీబీ సెంటర్ భవనాలను తొలగించింది కూడా తమ ప్రభుత్వమే అని తెలిపారు. డంపింగ్ యార్డు సమస్యను కూడా పరిష్కరించామన్నారు. ఎయిమ్స్‌కు వెళ్లే రహదారులకు సెంట్రల్ లైటింగ్ సౌకర్యం కూడా కల్పించామన్నారు. మొత్తం రూ.55 కోట్ల నిధులను ఎయిమ్స్ లో వసతుల కోసం తమ ప్రభుత్వం ఇప్పటివరకు ఖర్చు చేసిందని వివరించారు.
బాబు చేసిందేమీ లేదు
మరోవైపు ఎయిమ్స్‌లాంటి సంస్థను మన రాష్ట్ర హక్కుగా మనం కేంద్ర ప్రభుత్వం నుంచి పొందితే.. చంద్రబాబునాయుడు ప్రభుత్వం ఈ సంస్థకు ఎలాంటి సహాయ సహకారాలు అందించకుండా కష్టాలకు వదిలేసిందని మండిపడ్డారు. ఏదైనా ఒక వ్యవస్థను ఏర్పాటుచేయాలన్నా, ఒక పరిశ్రమను నెలకొల్పాలన్నా.. ముందు మౌలిక వసతులు సమకూర్చాలనే కనీస కర్తవ్యాన్ని, ప్రాథమిక సూత్రాన్ని చంద్రబాబునాయుడు పాటించలేదని విమర్శించారు. ఎయిమ్స్‌కు కరెంటు ఇద్దామనే ఆలోచనే చేయేలదని మండిపడ్డారు. కనీసం రోడ్లు కూడా నిర్మించి ఇవ్వలేదని తెలిపారు. మంచినీటి సమస్య ఉందని మొత్తుకున్నా.. కనీసం పట్టించుకోలేదని పేర్కొన్నారు. చంద్రబాబునాయుడు పరిపాలన అంటేనే ఇలానే దారుణంగా ఉందని చెప్పారు.
ప్రభుత్వ సహకారం పరిపూర్ణంగా ఉంది: ఎయిమ్స్ డైరెక్టర్ త్రిపాఠి
ఎయిమ్స్ కు సంబంధించిన సమస్యలను పరిష్కరించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తమకు పూర్తిగా సహాయసహకారాలు అందజేస్తున్నారని పేర్కన్నారు. ప్రభుత్వం దృష్టికి ఏ సమస్యను తీసుకెళ్లినా.. వెంటనే స్పందించి పరిష్కరిస్తున్నారని తెలిపారు. మంచినీటి సమస్య పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం తాజాగా జీవో విడుదల చేసిందని, పనులు కూడా ప్రారంభమయ్యాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు, ఎయిమ్స్ సంస్థ ప్రతినిధులు ఉన్నారు.