Suryaa.co.in

Andhra Pradesh

వరుసగా ఐదో ఏడాది మొదట విడతగా… కౌలు రైతులకు వైఎస్సార్‌ రైతు భరోసా.

రాష్ట్ర వ్యాప్తంగా పంట సాగుదారు హక్కు పత్రాలు(సీసీఆర్సీలు) పొందిన వారిలో అర్హులైన 1,46,324 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన కౌలు రైతులు, దేవాదాయ భూముల సాగుదారులకు తొలివిడతగా వైఎస్సార్‌ రైతు భరోసా సాయంగా రూ.109.01 కోట్లు, పంట నష్టపోయిన 11,373 మంది రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీగా రూ.11.01 కోట్లతో కలిపి మొత్తం రూ.120.75 కోట్ల ఆర్ధిక సాయాన్ని క్యాంపు కార్యాలయంలో బటన్‌ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసిన ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌.

ఈ సందర్భంగా సీఎం వైయస్‌.జగన్‌ ఏమన్నారంటే…:

తొలివిడత పెట్టుబడి సాయం…

దేవుడి దయతో ఈరోజు రెండు మంచి కార్యక్రమాలకు ఇక్కడ నుంచి శ్రీకారం చుడుతున్నాం. అందులో మొదటిది కౌలురైతులకు సంబంధించినది, వారితో పాటు దేవాదాయభూములు సాగుచేసుకుంటున్న కౌలురైతులకు కూడా కలిపి.. వైఎస్‌ఆర్‌ రైతు భరోసా కింది 2023–24 కి సంబంధించి తొలివిడత పెట్టుబడి సాయం అందిస్తున్నాం.

సీజన్‌ ముగిసే లోగా రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ…

రెండోది ఈ ఏడాది ఖరీప్‌ సీజన్‌లో కురిసిన భారీవర్షాలు, వరదల కారణంగా పంటలు నష్టపోయిన రైతులందరికీ ఇన్‌పుట్‌ సబ్సిడీగా ఏ సీజన్‌లో జరిగిన నష్టాన్ని అదే సీజన్‌ ముగిసేలోగా రైతుల చేతుల్లో పెట్టే మరో మంచి కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు దేశంలో ఎక్కడా లేనివిధంగా కౌలు రైతులకు ఇంత తోడుగా.. మన ప్రభుత్వం నిలబడుతుంది.

రైతులతో పాటు ఏ వ్యవసాయ భూమీ లేని నిరుపేద రైతులైన…. నా ఎస్సీ, ఎస్టీ, బీసీలు, మైనార్టీలను.. ప్రతి పదం ముందు నా వారు అని సంబోధిస్తూ.. అన్ని రకాలుగా వారికి అండగా, తోడుగా నిలబడుతున్న ప్రభుత్వం మనది. అందులో భాగంగానే ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ కౌలు రైతులకు అండగా నిలబడుతున్నాం. దేశంలో ఎక్కడా లేనివిధంగా, ఎక్కడా జరగని విధంగా ఆర్వోఎఫ్‌ఆర్‌ అంటే అరణ్యభూములు సాగుచేసుకుంటున్న గిరిజనులకు సైతం తోడుగా ఉంటూ వారికి ఆర్‌ఏఎఫ్‌ఆర్‌ పట్టాలు ఇవ్వడమే కాకుండా… వారికి కూడా రైతుభరోసాతో తోడుగా ఉండే కార్యక్రమం చేస్తున్నాం. దేవాదాయ భూములు సాగుచేసుకుంటున్న వారికి కూడా… ఇలా క్రమం తప్పకుండా వైఎస్‌ఆర్‌ రైతు భరోసా కింద రూ.13,500 చొప్పున పెట్టుబడి సహాయంగా అందిస్తున్న ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేదు.

రైతులకు ఇబ్బంది లేకుండా కౌలురైతులకు అండగా..

అందులో భాగంగానే 2023–24 సీజన్‌కు సంబంధించి… కౌలురైతుల కోసం మంచి చట్టాన్ని తీసుకొచ్చి, రైతులెవరికీ కూడా నష్టం లేకుండా 11 నెలల పాటు సీసీఆర్‌సీ కార్డులను గ్రామసచివాలయంలోనే అందుబాటులోకి తీసుకొచ్చాం. సీసీఆర్సీ కార్డు కౌలురైతులకిచ్చిన పక్షంలో రైతులకు జరగాల్సిన మేలు జరగకుండా పోదు.

వాళ్లకు కూడా రైతు భరోసాతో సహా అన్నీ వస్తాయి. సీసీఆర్సీ కార్డు పొందిన కౌలు రైతులకూ రైతుభరోసాతో పాటు మిగిలినవీ వస్తాయిని ఒక చట్టం తీసుకువచ్చాం. అందులో భాగంగా గ్రామసచివాలయాల్లోనే సీసీఆర్సీ కార్డులను అందుబాటులోకి తీసుకువచ్చాం. తద్వారా కౌలురైతులకు, రైతులకు మధ్య అవగాహనా ఒప్పందాలు కుదిర్చి, రైతులు ఏమాత్రం నష్టపోకుండా కౌలురైతులకు మేలు చేసే కార్యక్రమం చేస్తున్నాం.

1,46,324 మంది కౌలు రైతులకు రూ.109 కోట్ల పెట్టుబడి సాయం.
అందులో భాగంగా రైతు సమ్మతితో సీసీఆర్సీ కార్డులు పొంది, కౌలు చేస్తున్న ఈ రైతులందరికీ తొలివిడత ఇస్తున్న రూ.7,500 సొమ్మనును పెట్టుబడి సాయంగా అందిస్తున్నాం.

ఈ మేరకు ఈ రోజు 1,46,324 మంది సీసీఆర్సీ కార్డులు ఇచ్చిన కౌలు రైతులకు తోడుగా అండగా నిలబడుతూ ఇవాళ మొదట విడత పెట్టుబడి సాయం రూ.7,500 చొప్పున రూ.109 కోట్లను తొలివిడత సాయంగా వారి ఖాతాల్లో జమ చేస్తున్నాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్జీ కౌలురైతులందరికీ ఈ డబ్బు పెట్టుబడి సాయంగా ఉపయోగపడుతుంది.

ఈ 50 నెలల్లోనే దాదాపు 5.28 లక్షల మంది కౌలు రైతులకు, 3.99 లక్షల ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ అంటే అటవీ భూములు సాగుచేసే గిరిజనులు మొత్తం 9.22 లక్షల మందికి మంచి చేస్తూ… రూ.1122 కోట్లు వారికి పెట్టుబడి సహాయంగా ఇచ్చి మంచి చేయగలిగాం.

4 ఏళ్లలో 52.50 లక్షల మంది రైతులకు రూ.31 వేల కోట్ల రైతుభరోసా జమ.
2019లో మన ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఈ 50 నెలల కాలంలో వైఎస్‌ఆర్‌ రైతు భరోసా– పీఎం కిసాన్‌ అన్న ఈ ఒక్క కార్యక్రమం ద్వారా 52.50 లక్షల మందికి అందిస్తూ.. రూ.31 వేల కోట్లను వారి ఖాతాల్లో జమ చేయగలిగాం.

ఎందుకు ఇదిఅవసరమో చెప్పాలంటే… రాష్ట్రంలో ఉన్న పరిస్థితిని గమనించాలి.
రాష్ట్రంలో ఇవాళ అర హెక్టార్‌ అంటే 1.25 ఎకరాల లోపు భూమి ఉన్న రైతులు 60 శాతం మంది ఉన్నారు. 1 హెక్టార్‌ వరకు చూసుకుంటే 70 శాతం పై చిలుకు పోతుంది. రూ.13,500 పెట్టుబడి సాయంగా ఇచ్చే ఈ సొమ్ము.. అరహెక్టారు లోపు ఉన్న 60 శాతం రైతులకు వాళ్లు వేసే 80 శాతం పంటలకు 80 శాతం పెట్టుబడి సహాయంగా అందుతుంది. దీనివల్ల వాళ్లు బయట అప్పులు చేసే అవసరం రాదు.

కరెక్టుగా సమయానికి అంటే మేలో రూ.7,500, పంట కోసే సమయానికి అక్టోబరులో రూ.4000, మరలా సంక్రాంతికి రూ.2000 ఇస్తున్నాం. దీంతో పంట వేసేటప్పుడు, కోసేటప్పుడు ఇలా ఎప్పుడెప్పుడు ఎంత డబ్బులు కావాలో.. అప్పుడు వాళ్ల చేతుల్లో డబ్బులు పడేకొద్దీ వాళ్ల కాళ్లు మీద వాళ్లు నిలబడగలుగుతున్నారు. ఇలా గత నాలుగు సంవత్సరాలుగా వైఎస్‌ఆర్‌ రైతుభరోసా కార్యక్రమం ద్వారా నష్టపోకుండా వ్యవసాయం చేసే పరిస్థితి రాష్ట్రంలో అమలవుతోంది.

వైఎస్‌ఆర్‌ రైతు భరోసా పీఎం కిసాన్‌ ద్వారా అందిస్తున్న ఈ రూ.13,500 అన్నది ఒక హెక్టార్‌ వరకు ఉన్న 70 శాతం మంది రైతులకు మేలు జరుగుతుంది.

11,373 మందికి రూ.11 కోట్ల ఇన్‌పుట్‌ సబ్సిడీ.
అదే విధంగా ఇన్‌పుట్‌ సబ్సిడీలకు సంబంధించి కూడా ఇదేరకమైన మంచి జరుగుతుంది. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా గోదావరికి భారీ వరదలు కూడా చూశాం. ఈ పరిస్థితుల్లో ఈ సీజన్‌ ముగిసేలోగానే… దాదాపుగా 4,879 హెక్టార్లలో రకరకాల పంటలకు సంబంధించి జూన్‌ నుంచి ఆగష్టులోపు నష్టపోయిన 11,373 మంది రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీగా ఆ సీజన్‌ ముగియకమునుపే రూ.11 కోట్లు సరైన సమయానికే వారి చేతుల్లో పెడుతున్నాం.

నష్టంలో కూడా రైతులకు తోడుగా ఉంటూ..

ఈ రకంగా రైతు నష్టపోకుండా ఏ సీజన్‌లో నష్టం జరిగితే అదే సీజన్‌ ముగిసేలోగా రైతుకు తోడుగా ఉండే ఒక గొప్ప కార్యక్రమం వల్ల గత 4 సంవత్సరాల కాలంలోనే… రూ.1977 కోట్లు ఇన్‌పుట్‌ సబ్సిడీగా సరైన సమయంలో రైతు నష్టపోకుండా చేయిపట్టుకుని నడిపిస్తూ.. నష్టంలో కూడా రైతులకు తోడుగా ప్రభుత్వం ఉందన్న భావన కలిగిస్తూ మంచి చేశాం.

ఇటీవల గోదావరి వరదలకు సంబంధించి రూ.11 కోట్లు ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇవ్వడమే కాకుండా రూ.38 కోట్లు వరదసహాయం కింద సాయం చేశాం. అంతే కాకుండా వరదల వల్ల నష్టపోయిన రైతులకు, నారుమడులు, నాట్లు వేసిన పొలాల రైతులందరినీ వెంటనే ఆదుకుంటూ.. మరలా వాళ్లు పంట వేసుకునేందుకు 80 శాతం రాయితీతో వరి విత్తనాలు ఆర్బీకేల ద్వారా సరఫరా చేసి వారందరికీ తోడుగా నిలబడ్డాం.

ఇలా రైతు పక్షపాత ప్రభుత్వంగా రాష్ట్రంలో ఎలాంటి విప్లవాత్మక మార్పులు చూడగలిగామో.. కొన్ని విషయాలు మీకు చెప్తాను.

గతంలో ఎన్నడూ లేని విధంగా…

మొట్టమొదటిసారిగా గతంలో ఎప్పుడూ జరగని విధంగా ప్రతి గ్రామంలో ఆర్బీకే వ్యవస్ధ మన కళ్లెదుటనే కనిపిస్తోంది. 10,778 ఆర్బీకేలు ప్రతి గ్రామంలోనూ సచివాలయం పక్కనే కనిపిస్తున్నాయి. ఆర్బీకేలో ఒక అగ్రికల్చర్‌ గ్రాడ్యుయేట్‌ అక్కడే ఉండి సహాయసహకారాలు అందిస్తూ.. రైతులను చేయిపట్టుకుని నడిపిస్తున్నాడు. ఆర్బీకేలలో బ్యాంకింగ్‌ కరస్పాండెంట్లతో బ్యాంకింగ్‌ సేవలు కూడా అక్కడకే తీసుకొచ్చే కార్యక్రమం జరుగుతుంది. కియోస్క్‌ అక్కడే ఏర్పాటు చేశాం. కల్తీలేని విత్తనాలు, కల్తీలేని ఎరువులు ఆర్బీకేల ద్వారా సరఫరా చేసే గొప్ప వ్యవస్ధ గ్రామస్ధాయిలో కనిపిస్తోంది.

ఇదే ఆర్బీకేల ద్వారా ఇ–క్రాప్‌ పంట నమోదు కార్యక్రమం జరుగుతుంది. పారదర్శకంగా ఏ ఎకరాలో ఏ పంట వేశారు ? ఎవరు వేశారు ? అన్న వివరాలతో డిజిటల్‌ ఎక్నాలెడ్జ్‌మెంట్‌తో పాటు ఫిజికల్‌ ఎక్నాలెడ్జ్‌మెంట్‌ కూడా ఇస్తూ ఆర్బీకేలో డేటా నమోదు అవుతుంది. సోషల్‌ ఆడిట్‌లో జాబితా డిస్‌ప్లే అవుతుంది. ఏ ఒక్కరికైనా పారదర్శకంగా మంచి జరగకపోతే వెంటనే వాళ్లు ఎలా ఫిర్యాదు చేయాలి అన్నది కూడా అక్కడే రాసి ఉంది. వెంటనే రీ వెరిఫై చేసి మళ్లీ అవకాశం ఇస్తూ.. ఎవరివల్లా నష్టం జరగకుండా ఉండే కార్యక్రమాలు జరుగుతున్నాయి.

ఆర్బీకేలు– మద్ధతు ధరలు…

మొట్టమొదటిసారిగా రైతులకు నష్టం జరగకుండా పంట కొనుగోలు చేసే కార్యక్రమం కూడా ఆర్బీకేలో జరుగుతుంది. కనీస గిట్టుబాటు ధర ఎంతన్నది ఆర్బీకేలో లిస్టు డిస్‌ప్లే చేసి.. ఆ గిట్టుబాటు ధర కన్నా తక్కువకు పడిపోతే వెంటనే ఆర్బీకేలు జోక్యం చేసుకుని… రైతుకు సహాయంగా పంట కొనుగోలు చేసే కార్యక్రమం జరుగుతుంది.

ధాన్యం కొనుగోలు అయితే ఎంఎస్‌పీ రాని పరిస్థితుల నుంచి ఇవాళ ఎంఎస్‌పీ ఇవ్వడమే కాకుండా… బోనస్‌గా రైతులకు గతంలో రాని విధంగా గన్నీబ్యాగ్‌లు, లేబర్, రవాణా ఖర్చులు దాదాపుగా ఎకరాకు రూ.10వేలు చొప్పున అదనంగా రైతుల చేతుల్లోకి అందుబాటులోకి వస్తుంది.

మొట్టమొదటిటిసారిగా పంట నష్టపోతే.. పంటనష్టపోయిన అదే సీజన్‌లో ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇచ్చే అడుగులు ఈనాలుగేళ్లలో పడ్డాయి. ఏ పంట వేసినా ఇ–క్రాప్‌ నమోదవుతుంది, ఇన్సూరెన్స్‌ నమోదవుతుంది.. ప్రతి ఎకరాకు ఇన్సూరెన్స్‌ వచ్చే గొప్ప కార్యక్రమం జరుగుతుంది. రైతుల తరపున కట్టాల్సిన ఇన్సూరెన్స్‌ ప్రీమయం కూడా రాష్ట్ర ప్రభుత్వమే కట్టి… రైతులకు తోడుగా నిలబడే కార్యక్రమం కూడా జరుగుతుంది.

రైతులకు ఉచిత పంట బీమా, 9 గంటల పాటు ఉచిత కరెంటు పగటపూటే ఇచ్చే కార్యక్రమం కూడా ఈ నాలుగేళ్లలోనే జరుగుతుంది.

మనం అధికారంలోకి వచ్చిన తర్వాత పగటిపూటే ఉచితంగా కరెంటు ఇవ్వాలంటే… రూ.1700 కోట్లు ఖర్చు పెట్టి ఫీడర్లను అప్‌గ్రేడ్‌ చేస్తే తప్ప ఇవ్వలేం అని డిపార్ట్‌మెంట్‌ అధికారులు చెబితే… ఆ ఖర్చు కూడా పెట్టి ఫీడర్లను అప్‌గ్రేడ్‌ చేసి రైతులకు ఉచితంగా పగటిపూటే కరెంటు ఇస్తున్నాం. ఇవన్నీ మన కళ్లెదుటనే కనిపిస్తున్నాయి.

రైతుకు అదనపు ఆదాయం – అమూల్‌.

సాగు చేస్తున్న రైతుకు అనదపు ఆదాయం రావాలంటే.. రైతులకు వ్యవసాయంతో పాటు గేదెలు, ఆవులు కూడా ఉండాలని.. వాటి నుంచి వచ్చే ఆదాయం కూడా మెరుగ్గా ఉంటేనే రైతు బ్రతకగలుగుతాడనే ఉద్దేశ్యంతో సహకార రంగంలో గొప్ప మార్పుగా… అమూల్‌ను తీసుకొచ్చాం. అమూల్‌ వచ్చిన ఈ రెండున్నర సంవత్సరాల కాలంలో ఏకంగా ఎనిమిది సార్లు వాళ్లు పాలసేకరణ ధర పెంచారు.

లీటరు గేదె పాలు రూ.22, ఆవుపాలు లీటరు రూ.11 పెరిగింది. అమూల్‌ పాలధర పెంచింది కాబట్టి.. మిగిలిన డెయిరీలు కూడా వాళ్లకు నచ్చినా, నచ్చకపోయినా కాంపిటేషన్‌లో రేట్లు పెంచకతప్పని పరిస్థితి వచ్చి వాళ్లు కూడా రేట్లు పెంచారు. ఇది కూడా కేవలం నాలుగేళ్ల మన ప్రభుత్వంలోనే జరిగిన మార్పులకు తార్కాణం. ఇవన్నీ మన కళ్లెదుటే ప్రస్ఫుటంగా మనకు కనిపించే మార్పులు. ఈ రోజు చేస్తున్నవి కూడా అందులో భాగంగా వాటిని కొనసాగిస్తూ చేస్తున్న కార్యక్రమాలు.

వీటన్నింటి వల్లా రైతులకు మంచి జరగాలని మనసారా కోరుకుంటున్నాను. మంచి చేస్తున్న ప్రభుత్వానికి దేవుడి చల్లని దీవెనలు ప్రజల చల్లని ఆశీస్సులు ఎల్ల కాలం ఉండాలని మనసారా ఆకాంక్షిస్తున్నాను అని సీఎం ప్రసంగం ముగించారు.

సమావేశంలో గోదావరి నది రిటైనింగ్‌ వాల్‌ పనులపైనా డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లా కలెక్టర్‌తో హిమాన్షు శుక్లాతో మాట్లాడిన సీఎం.
రిటైనింగ్‌ వాల్‌ పనులు వెంటనే ప్రారంభించాలని జిల్లా కలెక్టర్‌కు సీఎం అదేశం.
పనుల పురోగతిపై మాట్లాడుతూ… ఇప్పటికే వర్క్‌ ఎస్టిమేషన్స్‌ పూర్తి అయ్యాయని.. వీలైనంత వేగంగా టెండర్లు ప్రక్రియను పూర్తి చేసి వెంటనే పనులు ప్రారంభించాలని సీఎం ఆదేశం.

మరోవైపు కోల్డ్‌ స్టోరేజ్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు ప్రతి ఆర్బీకేని ఒక యూనిట్‌గా తీసుకుని మ్యాపింగ్‌ చేసి, ప్రైమరీ ప్రాసెసింగ్‌ని తీసుకొస్తున్నామన్న సీఎం.
ప్రైమరీప్రాసెసింగ్‌లో భాగంగానే కోల్డ్‌ రూమ్‌లు ఏర్పాటు చేస్తున్నామని.. ఆయా క్లస్టర్‌ను బట్టి ప్రతి ఆర్బీకేకు మంచి జరిగేలా ఏర్పాటు చేస్తామన్న ముఖ్యమంత్రి.

సెకండరీ ప్రాసెసింగ్‌ అనేది పార్లమెంటరీ నియోజకవర్గస్ధాయిలో అంటే ప్రస్తుతం జిల్లా స్ధాయిలో ఒక యూనిట్‌గా తీసుకుని చేస్తున్నామని వెల్లడి.

మామిడి తప్ప ఇప్పటికే బొప్పాయి, అరటితో సహా దాదాపు అన్ని పంటలు ఇన్సూరెన్స్‌ పరిధిలోకి తీసుకొచ్చామన్న సీఎం.

ఇంకా మెరుగైన విధానాలను అధ్యయనం చేసి, అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామన్న ముఖ్యమంత్రి.

 

LEAVE A RESPONSE