– ఈసీ చర్యలు తీసుకోవాలి
– మీడియాతో టీడీపీ నేతలు
అమరావతి: ఒంటిమిట్ట, పులివెందుల జెడ్పీటీసీ ఉపఎన్నికల్లో వైసీపీ ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా నడుచుకుంది. సక్రమంగా విధులు నిర్వహిస్తున్న పోలీసు అధికారులపై వైసీపీ నేతలు వ్యక్తిగత దూషణలకు పాల్పడ్డారని టీడీపీ నేతలు విమర్శించారు. తక్షణమే పోలీసులను బెదిరించి, దూషణలకు పాల్పడ్డ వారిపై ఈసీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య, మాజీ మంత్రి దేవినేని ఉమా, మండలి చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ, ఎమ్మెల్యే బోడె ప్రసాద్, ఏపీఈడబ్ల్యూఐడీసీ చైర్మన్ కుప్పం రాజశేఖర్ ఈసీని కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడారు.
ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరిగితే జగన్ రెడ్డి సహించలేకపోతున్నాడు: వర్ల రామయ్య
“ఐదేళ్ల రాక్షస, అరాచక, రాజ్యాంగ వ్యతిరేక, ప్రజాస్వామ్య వైరుధ్య పరిపాలన, ఆశ్రిత పక్షపాతం, బందు ప్రీతి అవినీతితో కొట్టుమిట్టాడిన జగన్ రెడ్డి పాలన అంతలోనే విస్మరించింది. గత 15 నెలలుగా ప్రజాస్వామ్య పాలనను అందిస్తున్న చంద్రబాబుని విమర్శించడం దొంగే దొంగ దొంగ అన్నట్లు ఉంది. తన ఐదేళ్ల పాలన నిరంకుశత్వం, పోలీస్ పాలన చేసి ఈరోజు ఒంటిమిట్ట, పులివెందుల జెడ్పీటీసీ ఉపఎన్నికల్లో తమ విధులు సక్రమంగా నిర్వర్తిస్తున్న పోలీసులపై వైసీపీ నేతలు అభాండాలు వేస్తున్నారు.
తన పాలనలో స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్లు వేయడానికి కూడా ప్రత్యర్థులకు అవకాశం ఇవ్వని సంఘటనలు జగన్ ఒకసారి గుర్తు చేసుకోవాలి. నామినేషన్లు చించివేసిన సంఘటనను జగన్ రెడ్డి మర్చిపోవడం మంచిది కాదు. నామినేషన్ వేస్తారేమోనని అభ్యర్ధుల ఇళ్లలో సారా సీసాలు పెట్టి అక్రమ అరెస్టులు చేయించిన విషయం మరిచిపోతే ఎలా జగన్ రెడ్డి?
అసలైన రాక్షస పాలనకు నిర్వచనం జగన్ రెడ్డి పాలనే : పంచుమర్తి అనురాధ
“14 సంవత్సరాలకుపైగా ప్రజలకు సేవలందించిన చంద్రబాబుపై జగన్ రెడ్డి దుర్భాషలాడడాన్ని మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. 31 క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న మీరే అసలైన డెకాయిట్స్. వృద్ధులకు రూ.3 వేల హామీ ఇచ్చి అమలు చేయలేదు. చంద్రబాబు రూ.4 వేల పెన్షన్ అందిస్తున్నారు. అమ్మఒడి పేరుతో మోసం చేసిన మీరు, 67 లక్షల విద్యార్థులకు సాయం చేసిన ‘తల్లికి వందనం’ పథకాన్ని విమర్శించడం హాస్యాస్పదం. మూడు రాజధానుల పేరిట రాజధానిని నాశనం చేసి, అమరావతిని అభివృద్ధి చేస్తున్న నాయకుడిని తప్పుబట్టడం విచిత్రం.
అసెంబ్లీకి వెళ్ళాలంటే జగన్కు భయం: దేవినేని ఉమా
ఎమ్మెల్సీ, మండలి చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ జెడ్పీటీసీ ఎన్నికల ప్రాంతంలో ప్రచారం నిర్వహించి వచ్చారు. అక్కడి ప్రజలు మూడు దశాబ్దాల తర్వాత ఓటు వేయడానికి అవకాశం దొరికిందని ఆనందం వ్యక్తం చేశారని చెప్పారు. గత 30 ఏళ్లు తండ్రీకొడుకుల పరిపాలనలో పులివెందుల, కడప జిల్లాల్లో ప్రజాస్వామ్యం నశించిందని మేం ఎన్నో సార్లు చెప్పాం. అయినా జగన్ రెడ్డి ఇవాళ ప్రజాస్వామ్యం గురించి ఉపన్యాసాలు ఇస్తున్నారు. 2020 ఎంపీటీసీ ఎన్నికల్లో 9,696 స్థానాల్లో 2,362 ఏకగ్రీవం చేయగా, జెడ్పీటీసీ 652 స్థానాల్లో 126 స్థానాలకు నామినేషన్లు పడకుండా చేశారు. ఈసారి 11 నామినేషన్లు వచ్చి, రెండు స్థానాల్లో ప్రశాంతంగా ఎన్నికలు జరిగాయి.
జగన్ మానసిక స్థితి బాగోలేదు: ఎమ్మెల్యే బోడె ప్రసాద్
జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు, దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా అనిపించాయి. అధికారంలో ఉన్నప్పుడు ఆయన ప్రవర్తన పూర్తిగా ఉన్మాద స్థాయికి చేరింది. ప్రజాప్రతినిధులపై ఇష్టం వచ్చినట్లు దాడులు చేయడం, ఎవరినీ పట్టించుకోకపోవడం స్పష్టంగా కనిపించింది. ఇప్పుడు అధికారంలో లేని సమయంలో కూడా అదే అహంకారంతో అధికారులను దూషించడం, ముఖ్యమంత్రిని అవమానించడం ఆయన మానసిక స్థితి ఎంత దిగజారిందో చూపిస్తుంది. మళ్లీ అధికారంలోకి వస్తే, తన ఇష్టం వచ్చినట్లు హింసాత్మక చర్యలకు కూడా వెనుకాడరని, ఆయన మాటలే సూచిస్తున్నాయి.
ఈసీని కలిసిన వారిలో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పాతర్ల రమేష్, టీడీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి కోడూరు అఖిల్ తదితరులు పాల్గొన్నారు