- రాజకీయ లబ్ధి కోసమే వైసీపీ దళిత నేతల నీచ రాజకీయం
- ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య
విజయవాడలో అంబేద్కర్ స్మృతివనంలో విగ్రహానికి ఉన్న జగన్ పేరును అర్థరాత్రి ఎవరో ఆగంతకులు తొలగిస్తే వైసీపీ నేతలు సిగ్గులేకుండా నానా యాగీ చేస్తున్నారని నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ధ్వజమెత్తారు. అంబేద్కర్ విగ్రహంపై చిన్న గీత కూడా పడలేదని, కానీ అంబేద్కర్ విగ్రహం ధ్వంసం చేస్తున్నారంటూ తప్పుడు ప్రచారం చేయటం సిగ్గుచేటన్నారు. దీన్ని ప్రభుత్వానికి ఆపాదించటం సరికాదని, ఆ ఘటనకు ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.
ప్రభుత్వంపై బురద చల్లే పనులు మానుకోవాలని హితవు పలికారు. అన్ని వర్గాల ప్రజలకు సమాన అవకాశాలు కల్పిస్తూ ప్రతి ఒక్కరినీ ప్రోత్సహించాలని చెప్పిన డా॥ బిఆర్ అంబేద్కర్ మాటలను గత అయిదేళ్లలో వైసీపీ నేతలు ఒక్క రోజైనా అనుసరించలేదన్నారు. డా॥ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని చెత్తబుట్టలో పడేసి రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేసిన ఫ్యూడలిస్టు జగన్రెడ్డి అన్నారు.
రాజధాని నడిబొడ్డున 30 ఎకరాల విస్తీర్ణంలో అమరావతిలో చేపట్టిన స్మృతివనాన్ని అర్థాంతరంగా నిలిపివేసి రాజకీయ ప్రయోజనాల కోసం హడావుడిగా అంబేద్కర్ విగ్రహాన్ని విజయవాడలో ఏర్పాటు చేశారన్నారు. అమరావతి అంబేద్కర్ స్మృతివనంలో అంబేద్కర్ విగ్రహాల్ని ధ్వంసం చేశారు జగన్ పాలనలో అని గుర్తు చేశారు. రూ.170 కోట్లతో చేపట్టిన అంబేద్కర్ విగ్రహం రూ.404 కోట్లకు చేరింది. ఇందులో కూడా రూ.258 కోట్లు వైసీపీ నేతలు స్వాహా చేసిన ఆరోపణలున్నాయన్నారు.
అంబేద్కర్ పేరు కంటే పెద్ద అక్షరాలతో జగన్ పేరు పెట్టుకుని రాజ్యాంగ నిర్మాతనే అవమానించిన తీరుకు నిరసనగా కొందరు జగన్ పేరును తొలగించారన్నారు. అంబేద్కర్ విగ్రహం వద్ద ఉండాల్సిన అంబేద్కర్ పేరు స్థానంలో జగన్రెడ్డి పేరు పెట్టడం రాజ్యాంగ నిర్మాతను అవమానించడం కాదా? ఆ పేరును తొలగిస్తే అంబేద్కర్ పేరు తొలగించారంటూ చేస్తున్న దుష్ప్రచారంలో ఎటువంటి వాస్తవం లేదన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా అంబేద్కర్ విగ్రహాలకు కూడా వైసీపీ రంగులు వేశారు, అంబేద్కర్ పేరుతో నిర్మించిన భవనాలను కూడా మార్చి వైసీపీ రంగులు వేశారు అన్నారు.
అంబేద్కర్ విదేశీ విద్యతో సహా 27 సంక్షేమ పథకాలను రద్దుచేసి దళిత వర్గాలకు సంక్షేమ పథకాలు దూరం చేసిన దళిత ద్రోహి జగన్రెడ్డి అని, నిరుపేదల విదేశీ విద్యకు ప్రవేశపెట్టిన అంబేద్కర్ ఓవర్సీస్ పథకాన్ని నాలుగేళ్లపాటు రద్దుచేసి ఎన్నికల ముందు ‘జగనన్న విదేశీ విద్యా దీవెన’గా పెట్టి అంబేద్కరను అవమానించారన్నారు.
సబ్ ప్లాన్ నిధులు రూ.40 వేల కోట్లు దారిమళ్లించారు. 188 మంది దళితులు జగన్ పాలనలో హత్య చేయబడ్డారన్నారు. దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యంను హత్య చేసి డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీని జగన్ ప్రక్కన వేశారన్నారు. దళితుల లక్షలాది ఎకరాల అసైన్మెంట్ భూముల్ని కాజేసిన దళిత ద్రోహి జగన్ పార్టీ అని విమర్శించారు.