Suryaa.co.in

Editorial

టీడీపీ ఎంపీలతో వైసీపీ ఎంపీ లావు భేటీ

– అటు బాబుతో మోహన్‌బాబు భేటీ
– ఢిల్లీలో కేశినేని ఇంటికెళ్లిన లావు కృష్ణదేవరాయలు
– సోషల్‌మీడియాలో ఫొటోలు హల్‌చల్
– వైసీపీ శ్రే ణుల ఆగ్రహం
– రాజకీయ విచిత్రాలు
( మార్తి సుబ్రహ్మణ్యం)

ఓ వైపు మండే ఎండలయినా, భారీ వరదలయినా, గజగజ వణికే చలికాలంలోనయినా అధికార వైసీపీ-ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం ఆగడం లేదు. అయితే.. వాటితో తనకేమీ సంబంధం లేనట్లు, తమ పార్టీ నేతలు ఏ పార్టీనయితే రోజూ చాకిరేవు పెడుతున్నారో.. అదే టీడీపీకి చెందిన ఎంపీ ఇంటికి వెళ్లిన నర్సరావుపేట వైసీపీ ఎంపీ లావు కృష్ణదేవరాయలు వ్యవహారశైలి అటు సోషల్‌మీడియా, ఇటు వైసీపీలో హాట్‌టాపిక్‌గా మారింది.

పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో పలువురు ఎంపీలు, విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని నివాసానికి వచ్చారు. టీడీపీ ఎంపీలయిన రామ్మోహన్‌నాయుడు, గల్లా జయదేవ్‌తోపాటు డిఎంకె-శివసేన-ఎన్సీపీ ఎంపీలు కలసి నాని నివాసానికి వెళ్లారు. వారిలో డిఎంకె సీనియర్ నేత కళిమొళి లాంటి నేతలూ ఉన్నారు. సహజంగా పార్లమెంటు సమావేశాల్లో ఇలాంటి దృశ్యాలు కనిపిస్తూనే ఉంటాయి. ప్రధానంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంపీలు, ఇతర రాష్ట్రాలకు చెందిన తమ సహచర ఎంపీలను ఇళ్లకు పిలిచి, తమ రాష్ట్రాల్లో ప్రాచుర్యం పొందిన వంటకాలను సదరు ఎంపీలకు దగ్గరుండి మరీ వడ్డిస్తుంటారు.

అయితే.. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న సమయంలో మాత్రం, రాజకీయ ప్రత్యర్ధులు పార్లమెంటు సెంట్రల్ హాల్‌లో ఎదురుపడినా మాట్లాడుకోరు. కనీసం నవ్వుకోరు. ఆ విషయం తమ పార్టీ అధినేతలకు తెలిస్తే, ఎక్కడ కొంప కొల్లేరవుతుందేమోనన్న భయమే దానికి కారణం. ఇక ప్రాంతీయ పార్టీల సంగతి చెప్పనక్కర్లేదు.

అలాంటిది ఆంధ్రాలో ఉప్పు-నిప్పుగా ఉన్న వైసీపీ-టీడీపీ ఎంపీలు ఒకేచోట చేరి, విందు భోజనం చేయటం ఆశ్చర్యమే. సహజంగా వైసీపీపీనేత విజయసాయిరెడ్డి ఆధ్వర్యంలో ఎంపీలపై నిఘా ఉంటుంది. ఆయన అనుమతి లేకుండా వైసీపీ ఎంపీలెవరూ, కేంద్రమంత్రుల వద్దకు వెళ్లే అవకాశం ఉండదు. అలా ఎవరినీ బేఖాతరు చేయకుండా వెళ్లి కేంద్రమంత్రులను కలిసినందుకే, నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజును పార్టీ దూరం పెట్టింది. ఇక ప్రస్తుతం వైసీపీ ఎంపీలంతా టీడీపీపై ఏదో ఒక రూపంలో మాటల యుద్ధం చేస్తున్నారు. కానీ నరసరావుపేట వైసీపీ ఎంపీ లావు కృష్ణదేవరాయలు మాత్రం, ఇప్పటిదాకా టీడీపీని విమర్శించిన దాఖలాలు ఎక్కడా లేదు. అయితే ఆయన హుందాతనంగానే ఉంటారన్న ప్రచారం ఉంది.

తాజాగా తమ పార్టీ ఎంపీ.. టీడీపీ ఎంపీ కేశినేని నాని ఇంటికి వెళ్లిన ఫొటోలు బయటకు రావడంతో వైసీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు తామంతా టీడీపీపై యుద్ధం చేస్తుంటే, మరోవైపు ఎంపీ లావు కృష్ణదేవరాయలు అదేమీ పట్టకుండా, టీడీపీ ఎంపీ ఇంటికి ఎలా వెళతారంటూ మండిపడుతున్నారు. దీనివల్ల పార్టీ కార్యకర్తల ఆత్మస్థైర్యం దెబ్బతినదా అని ప్రశ్నిస్తున్నారు. అయితే వారు ఈ కలయికను సామాజిక కోణంలో చర్చించటం విశేషం.

ఇటీవల సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో విధ్వంసం సృష్టించిన సైనిక పరీక్ష అభ్యర్ధులకు నాయకత్వం వహించిన సుబ్బారావుతో, ఎంపీ లావు కలసి ఉన్న ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్ అయినప్పటికీ, టీడీపీ నేతలు లావుపై ఎలాంటి విమర్శలు చేయని విషయాన్ని వైసీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. కాగా నర్సరావుపేట వైసీపీ పార్లమెంటు ఇన్చార్జిగా, మాజీ ఎంపీ వేణుగోపాలరెడ్డిని అనధికారికంగా నియమించారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధిగా కూడా ఆయనే ఉంటారని, పార్టీలో బహిరంగంగానే చర్చ జరుగుతుండటం విశేషం.

బాబుతో మోహన్‌బాబు మంతనాలపై టీడీపీ నేతల అసంతృప్తి
ఇంకో విచిత్రమేమిటంటే.. చంద్రబాబు సీఎంగా ఉండగా, ఆయన సర్కారు విధానాలకు వ్యతిరేకంగా ధర్నా చేసిన మోహన్‌బాబు.. హటాత్తుగా అదే చంద్రబాబుతో మంతనాలు సాగించడం ఇరు పార్టీల్లోనూ చర్చనీయాంశమయింది. ఇటీవల మోహన్‌బాబు ఇచ్చిన అనేక ఇంటర్వ్యూలలో కూడా చంద్రబాబునుMohan-Babu-Chandrababu పరోక్షంగా విమర్శించిన వైనాన్ని, టీడీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. వైసీపీతో ప్రాణాలొడ్డి యుద్ధం చేస్తున్న సమయంలో, ఆ పార్టీకి చెందిన మోహన్‌బాబుతో భేటీ అవటమంటే తమ ఆత్మస్థైర్యాన్ని నాయకత్వమే దెబ్బతీసినట్టన్న ఆగ్రహం టీడీపీ నేతల్లో వ్యక్తమవుతోంది.

LEAVE A RESPONSE