– ప్లాట్లు కూల్చివేసిన ప్రాంతానికి మాజీ సీఎం వైయస్ జగన్
– వచ్చే వారం వస్తానని హామీ ఇచ్చిన పార్టీ అధినేత
– ఆ హామీతో బాధిత కుటుంబాల్లో ఆనందం
– తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైయస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ని కలిసిన అనంతరం మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ తో కలిసి మీడియాతో మాట్లాడిన జోజి నగర్ 42 ఫ్లాట్ కూల్చివేత బాధితులు
తాడేపల్లి: జోజినగర్ 42 ప్లాట్ల కూల్చివేత బాధితులకు వైయస్సార్సీపీ అండగా ఉంటుందని, వచ్చేవారం తానే స్వయంగా వచ్చి కూల్చివేసిన ప్రాంతాన్ని పరిశీలిస్తానని మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ బాధితులకు భరోసా ఇచ్చారు. మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ నేతృత్వంలో 42 ప్లాట్లకు సంబంధించి కూల్చివేత బాధితులు గురువారం తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో వైయస్సార్సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ని కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు.
రెక్కల కష్టంతో కూలి చేసుకుని సంపాదించుకున్న డబ్బుతో 25 ఏళ్ల క్రితమే ఇక్కడ ఇళ్లను నిర్మించుకున్నామని, తమకు ప్లాట్ రిజిస్ట్రేషన్, ఇంటి పన్ను, కరెంట్ బిల్లుల రశీదులున్నాయని చూపించారు. డిసెంబర్ 31 వరకు తమ ఇళ్ల జోలికి వెళ్లొద్దని సుప్రీంకోర్టు ఆర్డర్ ఉన్నా అధికారులు పట్టించుకోకుండా డిసెంబర్ 3న వేకువజామున వందల సంఖ్యలో పోలీసులొచ్చి తమ ఇళ్లను నేలమట్టం చేసి వెళ్లిపోయారని బాధితులు వైయస్ జగన్ ఎదుట వాపోయారు.
అధికార టీడీపీ, జనసేన నాయకులను కలిసినా తమ గోడు వినిపించుకోలేదని, ఇళ్లు కూల్చివేస్తే ఎంపీ కానీ, ఎమ్మెల్యే కానీ కనీసం పరామర్శకు కూడా రాలేదని కన్నీరుమున్నీరయ్యారు. మీరే న్యాయం చేయాలని వైయస్ జగన్ ని వేడుకోగా అండగా ఉంటానని ఆయన భరోసా ఇచ్చారు. అనంతరం వారంతా తమకు జరిగిన అన్యాయాన్ని మీడియాకి వివరించారు..
● పేదోళ్లంటే ఈ ప్రభుత్వానికి కడుపు మంట
– మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్
కూటమి ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి పేదల పట్ల చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. కూలి చేసుకుని పైసా పైసా కూడబెట్టుకుని ఇళ్లు నిర్మించుకున్నారన్న కనీస మానవత్వం లేకుండా ఈ ప్రభుత్వం భవానిపురం జోజినగర్లో 42 ఇళ్లను కూల్చివేసింది. డిసెంబర్ 31 వరకు ఇళ్ల జోలికి వెళ్లవద్దని సుప్రీంకోర్టు ఆదేశాలున్నా లెక్కచేయకుండా వందల సంఖ్యలో పోలీసులు వేకువజామున జోజినగర్ ప్రాంతానికి చేరుకుని సామాన్లు బయటకు తీసుకొచ్చే సమయం కూడా ఇవ్వకుండా నేలమట్టం చేశారు. దేశసర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలను సైతం బేఖాతర్ చేస్తూ ప్రభుత్వమే దుర్మార్గంగా పేదలను ఇళ్లను నేలమట్టం చేసింది.
ఈ ఇళ్ల విషయమై సాయం చేయాలని బాధితులు చాలాకాలం నుంచి స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ కేశినేని చిన్నిలకు, మంత్రి నారా లోకేష్ లను కలిసి విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదు. జనసేన పార్టీ కార్యాలయంలో ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదు. ఇప్పుడు వారంతా ఉండటానికి నిలువ నీడ లేక చలికి ఎండకీ చెట్ల కింద, టెంట్ కింద కుటుంబాలతో తలదాచుకుంటున్నారు. కొంతమంది ఈ ఇళ్లను కట్నం కింద అల్లుళ్లకి ఇచ్చిన పరిస్థితి. వారికి ఏం సమాధానం చెప్పుకోవాలో తెలియని దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. అధికారులు కూల్చేసిన 42 ఇళ్లకు 25 ఏళ్లుగా ఆస్తి పన్ను కడుతున్నారు. కరెంట్ బిల్లు చెల్లిస్తున్నారు.
విజయవాడ ఉత్సవాలను పర్యవేక్షించడానికి తపనపడిన ఎంపీ కేశినేని చిన్ని కనీసం జోజినగర్ బాధితులను పరామర్శించిన పాపాన పోలేదు. పేదల పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తోంది. జోజినగర్ వాసులకు జరిగిన అన్యాయంపై మా పార్టీ అధినేత వైయస్ జగన్ గారి ఆదేశాలతో ఇప్పటికే ఆ ప్రాంతాన్ని సందర్శించడం జరిగింది. మా పార్టీ కార్పొరేటర్లు కార్పొరేషన్లో ఈ విషయంపై గళమెత్తితే వారి మీద అధికార పార్టీ కార్పొరేటర్లు దాడికి దిగారు. బాధితుల వినతి మేరకు వారిని మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ ని కలిపించడం జరిగింది.
వారి కష్టాలను చూసిన జగన్ .. ఎంతో చలించి పోయారు. ఇళ్లు కట్టించడం చేతకాని ప్రభుత్వం.. పేదలు కష్టంతో కట్టుకున్న ఇళ్లను కూల్చడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జోజినగర్ బాధితులు కోరిన విధంగా వారికి అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు.