(చాకిరేవు)
– బెజవాడ డ్రగ్స్ కేసుపై పోలీసుల ఫోకస్
– నిందితుడు లోహిత్ యాదవ్ ను నెల్లూరు జైల్లో విచారించిన పోలీసులు
– లోహిత్ యాదవ్ ఫోన్ ను ఎఫ్ఎస్ఎల్ కి పంపిన అధికారులు
– వైసీపీ నేత కొండారెడ్డి అరెస్టు కోసం పోలీసుల పీటీ వారెంట్ దాఖలు
పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా, తమ సేవా గుణం మాత్రం మారలేదని వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం డ్రగ్స్ కేసు ద్వారా నిరూపించింది. యువతకు మార్గదర్శనం చేయాల్సిన స్థానంలో ఉన్న నేతలే, యువత జీవితాలను ‘ ఉద్ధరించేందుకు’ సరికొత్త పంథాను ఎంచుకున్నారు. ఒకవైపు రాష్ట్రవ్యాప్తంగా డ్రగ్స్, గంజాయి నిషేధంపై ‘డ్రగ్స్ వద్దు బ్రో’ వంటి ప్రభుత్వ ప్రచారం.
మరోవైపు, వైకాపాకు చెందిన విద్యార్థి విభాగం నేత కొండారెడ్డి తన సొంత డిపార్ట్మెంట్లోని విద్యార్థులనే లక్ష్యంగా చేసుకొని ఎల్ఎస్డీ, ఎండీఎంఏ వంటి ‘అత్యంత ఖరీదైన సంక్షేమ పథకాలను’ ప్రతిపక్ష హోదా కూడా లేకుండా అమలు చేస్తున్నారనేది ఈ కేసులోని ప్రధాన ఆరోపణ. “మీరు బయట డ్రగ్స్ కొనకండి, అదంతా మోసం.
మేమే తక్కువ ధరకు, మంచి క్వాలిటీతో బెంగళూరు నుంచి తెచ్చి అందిస్తాం” అని పార్టీలోని కొందరు నేతలు తమ అంతర్గత ‘సేవా’ కార్యక్రమంగా భావించారేమో!విద్యార్థి నేతలకు డ్రగ్స్ సరఫరా ద్వారా ‘అదనపు పోషకాలు’ అందించాలనేది వీరి కొత్త లక్ష్యంగా కనిపిస్తోంది.
1500 కాల్స్: రాజకీయ స్నేహం Vs మాఫియా మైత్రి డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడు లోహిత్ యాదవ్‌ను జైల్లో విచారించగా, అసలు ‘బాస్’ల పేర్లు, వారి ‘సంక్షేమ పథకాలు’ బయటపడటం దేనికి సంకేతం? లోహిత్, కొండారెడ్డిల మధ్య ఏకంగా 1,500 కంటే ఎక్కువ కాల్స్ జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఇది మామూలు రాజకీయ చర్చ కాదు! “మీటింగ్ ఎక్కడ పెట్టాలి?” అని అడిగేందుకు ఇన్నిసార్లు ఫోన్ చేయాల్సిన అవసరం లేదు.
బహుశా… “ఈ వారం ఎల్ఎస్డీ డోస్ ఎంత పెంచాలి?”, “ఈ రోజు డ్రగ్స్ డెలివరీ ఎక్కడ?” అనే అత్యంత ముఖ్యమైన జాతీయ సేవా కార్యక్రమాలపైనే వీరు ఈ 1,500 కాల్స్‌లో చర్చించుకొని ఉంటారు.
విద్యార్థి విభాగం: కొత్త లక్ష్యం… కొత్త మార్గం సాధారణంగా విద్యార్థి నాయకులంటే… క్యాంపస్ సమస్యలు, ఫీజుల గురించి పోరాడుతారు. కానీ, కొండారెడ్డి మాత్రం ఆ పాత పద్ధతులకు తిలోదకాలిచ్చి, విద్యార్థులకు మరింత ‘ఉత్తేజాన్ని’ ఇచ్చేందుకు ఏకంగా డ్రగ్స్ దందాలోకి దిగడం ఒక సాహసమే! పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ కార్యకలాపాలు సాగి, ఇప్పుడు అధికార మార్పిడి తర్వాత బండారం బయటపడటంతో… “రాజకీయ కక్ష సాధింపు” అనే పాత పాటను కొండారెడ్డి బంధువులు అందుకున్నారు.
అయితే, చేతిలో డ్రగ్స్, ఫోన్లో 1,500 కాల్స్ రికార్డులు ఉంటే… ఆ కక్ష సాధింపు కూడా ‘మాదక ద్రవ్యాల సేవ’ ద్వారా జరిగిందని అనుకోవాలేమో! జగన్ సారూ… మీరు కనీసం అధికారంలో లేని ఈ సమయంలో అయినా, మీ పార్టీ విద్యార్థి నేతల చేత డ్రగ్స్ అమ్మడం ఆపించండి. వారిని పార్టీ నుండి సస్పెండ్ చెయ్యండి. ఆ విద్యార్థి విభాగాన్ని మాదక ద్రవ్యాల మత్తులో ఉంచకండి.