– మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఆందోళనలు
– ఈనెల 28న అసెంబ్లీల పరిధిలో, నవంబర్ 12న అన్ని జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు
– నవంబర్ 24న పార్టీ కార్యాలయానికి చేరుకోనున్న కోటి సంతకాలు
– గవర్నర్‌ను కలిసి కోటిసంతకాల ప్రతులను సమర్పించనున్న మాజీ సీఎం వైయస్ జగన్
– తాడేపల్లిలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో “వైయస్సార్సీపీ ప్రజా ఉద్యమం” పోస్టర్ ను ఆవిష్కరించిన సజ్జల రామకృష్ణారెడ్డి
– ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రులు వెలంపల్లి శ్రీనివాస్, సాకె శైలజానాథ్, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, కారుమూరి నాగేశ్వరరావు, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, మొండితోక అరుణ్ కుమార్, పార్టీ లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్‌రెడ్డి, గ్రీవెన్స్ సెల్ చైర్మన్ అంకంరెడ్డి నారాయణమూర్తి తదితరులు
తాడేపల్లి: మాజీ సీఎం వైయస్ జగన్ నిర్మించిన మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరిస్తూ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై వెనక్కి తగ్గేదాకా వైయస్సార్సీపీ పోరాడుతుందని, కలిసి వచ్చే రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, మేధావులతో కలిసి ఉద్యమిస్తామని వైయస్సార్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు.
తాడేపల్లిలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో “వైయస్సార్సీపీ ప్రజా ఉద్యమం” పై రూపొందించిన పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రస్తుతం పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న కోటి సంతకాల సేకరణతోపాటు ఈనెల 28న రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 175 నియోజకవర్గాల పరిధిలో అవగాహన ర్యాలీలు నిర్వహించనున్ననట్టు వివరించారు.
నవంబర్ 24 నాటికి సంతకాల సేకరణ పూర్తవుతుందని, ఆ సంతకాల ప్రతులను మాజీ సీఎం వైయస్ జగన్ పార్టీ నాయకులతో కలిసి వెళ్లి రాష్ట్ర గవర్నర్‌కి అందజేస్తారని తెలిపారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయంపై ప్రజల్లో పెల్లుబుకుతున్న ఆందోళనను ప్రజల అభిప్రాయంగా కోటి సంతకాల రూపంలో రాష్ట్ర గవర్నర్‌కి సమర్పించడం జరుగుతుంది. ఈ కోటి సంతకాల సేకరణలో భాగంగా విద్యార్థులు, ఉద్యోగులు, మేథావులు, ప్రజల మద్దతుతో రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీలు నిర్వహించనున్నాం.
ఈనెల 28న అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో, నవంబర్ 12న అన్ని జిల్లా కేంద్రాల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీలు నిర్వహించనున్నాం. వైయస్సార్సీపీ ప్రజా ఉద్యమం పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం అక్టోబర్ 23న అన్ని జిల్లా కేంద్రాల్లో, 24న నియోజకవర్గ కేంద్రాల్లో, 25న మండల కేంద్రాల్లో జరుగుతుంది.
కోటి సంతకాల సేకరణ పూర్తయిన ప్రతులు నవంబర్ 23న నియోజకవర్గ కేంద్రాల నుంచి అన్ని జిల్లా కేంద్ర కార్యాలయాలకు, నవంబర్ 24న అక్కడ్నుంచి కేంద్ర కార్యాలయానికి చేరతాయి. ఆ వెంటనే రాష్ట్ర గవర్నర్ అపాయింట్మెంట్ తీసుకుని ప్రజాభిప్రాయంగా ఈ ప్రతులను ఆయనకు అందజేయడం జరుగుతుంది.
వైయస్సార్సీపీ దిగిపోయే నాటికి 7 మెడికల్ కాలేజీలను పూర్తి చేయడం జరిగింది. మరో మూడు కాలేజీలు ఆదోని, మదనపల్లె, మార్కాపురం 80 నుంచి 90 శాతం పనులు పూర్తి చేసుకుని అడ్వాన్స్ దశలో ఉండగా, మిగిలిన కాలేజీలు వివిధ దశల్లో ఉన్నాయి. ముందుగా అనుకున్న ప్రణాళిక ప్రకారం పనులు సాగుతున్నాయి. మెడికల్ కాలేజీలు నిర్మించడం అనేది ఒక్క రోజులో జరిగే పనికాదు. అన్ని అనుమతులతోపాటు భూసేకరణ, బిల్డింగుల నిర్మాణం లాంటి చాలా రకాల పనులుంటాయి.
కేంద్ర ప్రభుత్వం నిర్మించిన ఎయిమ్స్ ఆస్పత్రి పూర్తికావడానికి దాదాపు 9 ఏళ్లు పట్టిందనే విషయాన్ని చంద్రబాబు మర్చిపోతే ఎలా? మెడికల్ కాలేజీలే మెషీన్స్‌తో నడిచే ఫ్యాక్టరీలు కాదు కదా ఓవర్ నైట్‌లో తెచ్చి బిగించి ప్రారంభించడానికి? అంతా ఒకటే అయినప్పుడు కొత్తగా పీపీపీ మోడల్‌కి తీసుకురావాల్సిన అవసరం ఏమొచ్చింది? ఉన్నది ఉన్నట్టుగానే కొనసాగించవచ్చు కదా? ప్రైవేటు సంస్థలు లాభాపేక్ష లేకుండా మెడికల్ కాలేజీలు ఎలా నడుపుతారు?
ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పూర్వం ఎలా నడుస్తుందో అలాగే ఉంటుందని వారితో సంతకాలు తీసుకునే ధ్యైర్యం చంద్రబాబుకి ఉందా? చంద్రబాబు తీసుకునే పీపీపీ మోడల్ వల్ల ల్యాండ్ బిల్డింగ్లు వాడుకుని ప్రైవేట్ వ్యక్తులు జేబులు నింపుకుంటుంటే, పేదలు మాత్రం నిరుపేదలుగా మారిపోతారు.