– కరోనా కాలంలో మాస్కు అడిగినందుకు డాక్టర్ సుధాకర్‌ను హింసించిన నాటి వైసీపీ సర్కారు
– చేతులు విరిచి నేలపై పడుకోబెట్టిన కిరాతకం
– దానితో గుండె ఆగి మృతి చెందిన డాక్టర్ సుధాకర్
– ఇప్పుడు ఆయన తల్లి కావేరి లక్ష్మీబాయి భూమినీ చెరబట్టిన వైకాపేయులు
– ఆమె స్థలం ఆక్రమించి గోడ కట్టేసిన వైకాపా నేతలు
– సీఎం బాబు, మంత్రి లోకేష్‌కు ఫిర్యాదు చేసినా చర్యలు కనిపించని వైనం
– కొడుకునే కాదు, స్థలాన్నీ విడిచిపెట్టరా అంటూ డాక్టర్ సుధాకర్ తల్లి కన్నీరు
– కబ్జాదారులకు వైసీపీ ప్రజాప్రతినిధి దన్ను
– విశాఖలో కొనసాగుతున్న వైసీపీ అరాచకాలు
( మార్తి సుబ్రహ్మణ్యం)
అది విశాఖపట్నం. గోపాలపట్నం రెవిన్యూ పరిథిలోని బుచ్చిరాజుపాలెం ఎన్ఏడీ జంక్షన్ బస్టాండ్ వెనుక ఉన్న స్థలం. వైసీపీ డిప్యూటీ మేయర్ శ్రీధర్, ఆయన సోదరుడు, స్థానికంగా కొందరు బీజేపీ సానుభూతిపరులైన వ్యాపారులు కలసి తన స్థలం కబ్జా చేసి.. అధికారుల దన్నుతో తన స్థలం కబ్జా చేశారన్నది ఆ 79 ఏళ్ల వృద్ధురాలి ఆవేదన.
ఇంతకూ ఆ వృద్ధురాలు ఎవరో కాదు. జగన్ జమానాలో.. కరోనా కాలంలో తనకు మాస్కు ఇవ్వమన్నందుకు వేధించి, పిచ్చివాడన్న ముద్ర వేసి, పెడరెక్కలు విరిచి మండుటెండల్లో రోడ్డుపై పడుకోబెట్టి, ఆ అవమానభారంతో గుండె ఆగిన విశాఖ దళిత డాక్టర్ డాక్టర్ సుధాకర్ కన్నతల్లి ఆమె!
ఆ వృద్ధురాలు తన కష్టాన్ని స్వయంగా సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి లోకేష్, హోంమంత్రి అనితకు వెళ్లబోసుకున్నా ఇప్పటివరకూ చర్యలు లేని వైనమిది. తన స్థలానికి సంబంధించి వైసీపీ నేతలు దొంగ డాక్యుమెంట్లు సృష్టించి కేసు వేశారని, ఇప్పుడు వాళ్లే దౌర్జన్యంలో తన స్థలంలోకి వెళ్లి గోడ కట్టారంటూ డాక్టర్ సుధాకర్ తల్లి కావేరి లక్ష్మీబాయి వాపోతోంది.
కాగా ఆ ప్రాంతంలో బీజేపీ సానుభూతిపరులైన వ్యాపారులు కొందరు ఇదే తరహాలో భూములు ఆక్రమిస్తుంటారన్న ప్రచారం చాలాకాలం నుంచి లేకపోలేదు. స్థానికంగా ఉండని స్థలాల యజమానులు, కుటుంబ కలహాలున్న కేసులను గుర్తించి.. వారి స్థలాలను కబ్జా చేయడం వీరి హాబీ అన్న ప్రచారం లేకపోలేదు. దానికి బీజేపీకి చెందిన ఓ కీలకనేత దన్ను ఉందన్న ఆరోపణలున్నాయంటున్నారు.
డాక్టర్ సుధాకర్ తల్లి లక్ష్మీబాయి కథనం ప్రకారం.. ఆమె పేరిట విశాఖపట్నం గోపాలపట్నం రెవిన్యూ పరిథిలోని బుచ్చిరాజుపాలెం ఎన్ఏడీ జంక్షన్ బస్టాండ్ వెనుక 6 వేల గజాల స్థలం ఉంది. మంగతాయారమ్మ ముని మనుమరాలయిన లక్ష్మీబాయికి ఆ స్థలం వారసత్వంగా వస్తోంది. దానిని 1993లో ఒక ఫేక్ డీడ్ తయారుచేసి, దానిపై మూడు లావాదేవీలు చేసిన తర్వాత అంతిమంగా ఆక్రమించేశారు. చివరి లావాదేవీ 2014లో జరిగిందట.
కాగా డాక్టర్ సుధాకర్ తల్లికి చెందిన స్థలానికి సంబంధించి 1981 లో మృత్యుంజయదాస్ అనే వ్యక్తి, పాండురంగరాజుకు 2 వేల గజాల అమ్మారు. అయితే మృత్యుంజయ దాస్ అసలు తమ వారసుడు కాదన్నది లక్ష్మీబాయి ఆరోపణ. తర్వాత పాండురంగరాజు 2014లో ఆయన చెల్లెలు చెరుకూరి లక్ష్మీకాంతానికి వెయ్యి గజాలు ఇచ్చారట. మిగిలిన స్థలం తన కుమారుడికి ఇచ్చారట.
‘రెవిన్యూ’ ధృవీకరించినా ఎలా రిజిస్టర్ చేశారు?
కాగా 16-6-2003లో అసిస్టెంట్ డైరక్టర్ జిల్లా సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్సు.. ఈ స్ధలం పూర్తిగా మంగతాయారమ్మ వైఫాప్ వెంకటనారాయణరావు కుటుంబానికి చెందినదిగా సర్టిఫై చేశారు. మళ్లీ విశాఖ అర్బన్ మండల ఎమ్మార్వో 22-5-2001న.. ఈ సర్వే నెంబరులోని భూమి మంగతాయరమ్మ వైఫాఫ్ వెంకటనారాయణరావుకు చెందినదిగా ధృవీకరించారు. మరి రెవిన్యూ అధికారులే ఈ భూమి డాక్టర్ సుధాకర్ తల్లిదేనని స్పష్టం చేస్తే.. 1999లో అదే భూమి మరొకరిపై ఎలా రిజిస్టర్ చేశారన్నది ప్రశ్న. అంటే ఈ వ్యవహారం వెనక ఏం జరిగిందో సుస్పష్టం.
మా స్థలాన్ని మరొకరికి ఎలా ఇస్తారు?: లక్ష్మీబాయి
‘‘అసలు ఎలాంటి సంబంధం, వారసత్వంలో లేని మృత్యుంజయ అనే వ్యక్తి తమ స్థలం ఎలా అమ్ముతారు? వెనక ఉన్న మా స్థలానికి దారిలేకుండా గోడకట్టి, తర్వాత మొత్తం స్వాధీనం చేసుకుందామన్నదే వారి కుట్ర’’ అని లక్ష్మీబాయి బంధువులు చెబుతున్నారు.
తర్వాత వైసీపీ నేతలు 2025 సెప్టెంబర్‌లో గోడ కట్టడానికి ప్రయత్నించిన నేపథ్యంలో… కలెక్టర్, పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు లేవు. ఇవన్నీ గత సెప్టెంబర్ 25న డాక్టర్ సుధాకర్ తల్లి, తన స్ధలం చదును చేయించేందుకు వెళ్లినప్పుడు.. వైసీపీ నాయకులు 25 మంది పోలీసులను తీసుకువచ్చి, ఆ స్థలం తమదేనని బెదిరించారట. అయితే తాను డాక్టర్ సుధాకర్ తల్లినని చెప్పినా పోలీసులు కూడా పట్టించుకోలేదట.
గోడు వినకుండా గోడ కట్టేశారు
మళ్లీ తాజాగా మూడురోజుల క్రితం అదే వైసీపీకి చెందిన నాయకులు డాక్టర్ సుధాకర్ తల్లికి చెందిన స్థలం ముందున్న రెండువేల గజాల్లో గోడ కట్టేశారు. అయితే లక్ష్మీబాయి స్థానికంగా ఉండదు. శ్రీకాకుళంలో నివాసం ఉంటుంది. ఈ విషయం స్థానికుల ద్వారా ఆలస్యంగా తెలిసిన ఆమె రోదన వేదనకు అంతులేదు. వారసత్వంగా వచ్చిన తన భూమి కబ్జా చేసిన వైనంపై ఆమె కుంగిపోయింది. సుధాకర్ తల్లికి జరిగిన అన్యాయం గురించి ఎంతమందికి ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోకపోవడం దారుణం. ‘‘ సుధాకర్ మృతిని రాద్ధాంతం చేసిన రాజకీయ పార్టీలు కూడా ఆమె స్థలం కబ్జాచేసిన వారిపై చర్యలు తీసుకోకపోవడం అన్యాయ’’మని స్థానికులు సానుభూతి వ్యక్తం చేస్తున్నారు.