-
కూటమి ప్రభుత్వానికి దళితుల అండను వైసీపీ ఓర్చుకోలేకపోతుంది
-
విజయవాడలో అంబేద్కర్ విగ్రహానికి ఎలాంటి నష్టం జరగలేదు
-
దళితుల్ని రెచ్చగొట్టే ప్రయత్నంలో వైసీపీ నీచరాజకీయాల్ని ఖండించాలి
-
జగన్ పేరు తొలగింపు ఘటనకు ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు
-
దర్శి కూటమి పక్షనేత డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి
దర్శి:డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగ ఆశయాల ప్రకారం నడుస్తోన్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వ పాలనను రాష్ట్రంలోని దళితులంతా స్వాగతిస్తున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ నేతృత్వంలో ప్రజా ప్రభుత్వ విధానాలకు ఎస్సీ, ఎస్టీలతోపాటు బీసీ వర్గాల మద్దతు పుష్కలంగా ఉంది.
ఇలాంటి వాతావరణం నచ్చక వైఎస్ఆర్ సీపీ నీచ రాజకీయంతో ఉన్మాదానికి పాల్పడుతుందని దర్శి కూటమి పక్షనేత డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక వైసీపీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి చేపట్టిన నిరసన ధర్నాపై ఆమె శనివారం సీరియస్ గా స్పందించారు.
విజయవాడ మహానగరంలో ఏర్పాటు చేసిన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహానికి ఎలాంటి నష్టం, కష్టం జరగబోదని, అంబేద్కర్ విగ్రహాన్ని సాకుగా చూపి ఉన్మాద రాజకీయాలు చేయొద్దని ఆమె బూచేపల్లికి మీడియా ద్వారా హితవు పలికారు. అంబేద్కర్ విగ్రహానికి ఉన్న జగన్ పేరును ఎవరో ఆగంతుకులు తొలగిస్తే.. ఆ ఘటనను ప్రభుత్వానికి ఆపాదించి విమర్శించడం సబబు కాదన్నారు.
అసలు ఎస్సీ, ఎస్టీల సంక్షేమం పట్టించుకోని బూచేపల్లి వంటి నేతలకు దళితుల గురించి, అంబేద్కర్ మహాశయుని గురించి మాట్లాడే అర్హతలేదన్నారు. దళితులను రెచ్చగొట్టే ఇలాంటి ఉన్మాద రాజకీయాలను ప్రతీ ఒక్కరూ ఖండించాలని డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి కోరారు. అంబేద్కర్ విగ్రహం దగ్గర జగన్ గారి పేరు తాటికాయంత అక్షరాలతో ఉండటమనేది అంబేద్కర్ విగ్రహాన్ని కించపరిచేలా ఉందన్న సంగతిపై గతంలో దళిత నేతలే అక్కడ విమర్శ లేవనెత్తారని ఆమె గుర్తు చేశారు.
దళితుల మనోభావాలు దెబ్బతినేలా ఎవరూ వ్యవహరించ రాదన్నారు. ఐదేళ్ళ వైసీపీ పాలనలో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో పేర్లు మార్చారని, అంబేద్కర్ విదేశీ విద్య పథకానికి జగన్ విదేశీ విద్య గా మార్చుకున్నారని, ఎస్సీ ఎస్టీ ల కుల ధృవీకరణ పత్రాలపై ఆయన బొమ్మను ముద్రించుకున్నారని గుర్తు చేశారు.
వైసీపీ పాలనలో దళితులపై జరిగిన హత్యలు, అత్యాచారాలపై కడుపు మండిన కొందరు వ్యక్తులు చేసిన చిన్న పనికి, ఏదో రాజ్యాంగ ద్రోహం జరిగినట్లుగా చేస్తున్న ప్రచారం మానుకోవాలన్నారు. అమరావతిలోని అంబేద్కర్ స్మతి వనంలోని మూడు అంబేద్కర్ విగ్రహాలను మాయం చేసిన వైసీపీ నాయకులకు అంబేద్కర్ గారి గురించి మాట్లాడే అర్హత లేదన్నారు.
కూటమి ప్రభుత్వం అంబేద్కర్ విగ్రహానికి ఎలాంటి ఇబ్బందీ కలుగ చేయదని, వైసీపీ ట్రాప్ లో పడి దళితులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి స్పష్టం చేశారు.