Suryaa.co.in

Andhra Pradesh

మందు షాపుల్లో తమ్ముళ్లకు ‘చుక్కెదురు’

– వైన్‌షాపుల్లో పెట్టుబడి పెట్టి మునిగిపోయిన టీడీపీ నేతలు
-ఒక్కో ‘ధర’ఖాస్తు విలువ రెండు లక్షలు
– దరఖాస్తుదారుల్లో మెజారిటీ తమ్ముళ్లవే
– దరఖాస్తుల డిపాజిటు ఆదాయమే 1800 కోట్లు
-అందులో తమ్ముళ్ల భాగస్వామ్యమే 1500 కోట్లు
– అటకెక్కిన సర్కారు మార్జిన్‌మనీ హామీ
– చెప్పింది 20 శాతం.. ఇస్తున్న కమిషన్ 9 నుంచి 11 శాతమే
– లాటరీలతో మునిగిపోయిన తమ్ముళ్లు
– పెట్టిన పెట్టుబడి రాక నష్టపోతున్న టీడీపీ నేతలు
– గతంలో ఒకసారి నీరుచెట్టు పనులతో ఆర్ధిక నష్టం
– ఇప్పుడు వైన్‌షాపుల్లో పెట్టుబడులతో రెండో నష్టం
– అధికారంలో ఉన్నా ఆదాయం సున్నా
– మద్యం వ్యాపారంలో తమ్ముళ్ల తంటాలు

వాళ్లు జగన్ జమానాలో ఐదేళ్లు ఆర్ధికంగా చితికిపోయిన నియోజకవర్గ, మండలస్థాయి టీడీపీ నాయకులు. తమ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన నీరు-చెట్టు పనులకు బిల్లులు రాక, అప్పుల పాలై సగం మునిగిపోయిన బాధితులు. ఇప్పుడు తమ పార్టీనే అధికారంలోకి రావడంతో ఇక కష్టాలు తీరతాయని సంబరపడ్డారు. తమ పార్టీ హయాంలో చేసిన పనులకు బిల్లులు, వాటంతట అవే నడిచి వస్తాయని అమాయకంగా ఆశపడ్డారు. కొత్తగా నాలుగురాళ్లు వెనకేసుకోకపోయినా, పాత అప్పులు తీరితే అదే పదివేలనుకున్నారు. అనుకున్నట్లుగానే కూటమి సర్కారు.. వైన్‌షాపు టెండర్లు పిలిచింది. అంతవరకూ బాగానే ఉంది.

అయితే దానిని లాటరీ పద్ధతికి తెరలేపింది. మార్జిన్ మనీ 20 శాతం ఇస్తామని ప్రకటించింది. మార్జిన్‌మనీ ఆశ బాగున్నప్పటికీ, లాటరీ పద్థతే తమ్ముళ్లకు రుచించలేదు. అయినా ఆశచావని తమ్ముళ్లు ఎగబడి, అప్పులు చేసి మరీ ఒక్కో అప్లికేషన్‌కు 2 లక్షలు వెచ్చించి దరఖాస్తు చేశారు. కొంతమంది ఒక్కరే మూడు, నాలుగు దరఖాస్తులు చేశారు. కానీ తీరా ఇస్తానన్న 20 శాతం కమిషన్‌కు బదులు, 9 నుంచి 11 శాతమే ఇస్తుండటంతో మళ్లీ తమ్ముళ్లు రెండోసారి మునిగిపోయారు.

ఫలితంగా 90 శాతం షాపులు నష్టాల్లో కూరుకుపోయాయి. పైగా దీనికితోడు ఏడాది లైసెన్సు ఫీజులు తడిచిమోపెడయి.. తమ్ముళ్లకు వైన్‌షాపుల్లో చుక్కెదురవుతున్న దయనీయం. అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు కాంట్రాక్టులు చేసి మునిగిపోతే.. ఇప్పుడు వైన్‌షాపుల్లో పెట్టుబడులుపెట్టి రెండోసారి నష్టపోతున్న విషాదం. దీనిపై కోర్టుకు వెళ్లాలా? సర్కారుతో రాయబారం నిర్వహించాలా అన్న అంశంపై తర్జనభర్జన జరుగుతోంది. ఇదీ తమ్ముళ్ల రోదన, వేదన.

(వాసిరెడ్డి రవిచంద్ర)

ప్రభుత్వం వచ్చిందని ప్రైవేట్ వైన్ షాపులు ద్వారా ఆదాయం సమకూరుతుందని పరుగులు తీసిన తెలుగు తమ్ముళ్లకు నిరాశ మొదలైంది. ఆనాడు 2014 తెలుగుదేశం ప్రభుత్వంలో నీరు చెట్టు వంటి కాంట్రాక్ట్ పనుల చేసి బిల్లులు రాక అప్పుల ఊబిలో కూరుకుపోయి, వైసిపి ప్రభుత్వం పెట్టిన ఇబ్బందులు తట్టుకొని మన కూటమి ప్రభుత్వం అత్యధిక మెజారిటీతో గెలిచిందని తిరిగి కోలుకోవచ్చని ఆశతో ఆదాయం కోసం పరుగులు తీశారు.

ప్రభుత్వం మద్యం షాపులు ఎత్తివేసి ప్రైవేటు మద్యం షాపులకు అవకాశం ఇవ్వడంతో తెలుగుదేశం వారే ఆ షాపులను దక్కించుకునేందుకు కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చి పెట్టారు. పారదర్శకత పేరుతో నూతన మద్యం పాలసీలో ఒక్కొక్క అప్లికేషన్ కు రెండు లక్షలు నిర్ణయించి, లాటరీ పద్ధతి ద్వారా దరఖాస్తులు స్వీకరించింది. రాష్ట్రంలో మొత్తం 90 వేల అప్లికేషన్లు రాగా 1800 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి అప్లికేషన్ ల ఫీజు ద్వారా ఆదాయం సమకూరింది.

అయితే ఈ మొత్తం డబ్బు తెలుగుదేశం వారిదే కావడం ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం. అటు అప్లికేషన్ ల ఫీజులు, లైసెన్స్ ఫీజు కలిపి ఒక్కొక్క షాపుకు దాదాపు కోటి రూపాయలు వరకు పెట్టుబడి పెట్టి వ్యాపారాన్ని ప్రారంభించిన తెలుగు తమ్ముళ్లకు రోజూ నష్టాలు చూస్తూ బోరుమంటున్నారు. ఒక్కో షాపుకు 25 అప్లికేషన్ లు వరకు వేసే మద్యం షాప్ లను దక్కించుకున్నారు.

మొత్తం రాష్ట్రంలో 3396 షాపులను లాటరీ పద్ధతిలో షాపులు కేటాయించారు. ఇప్పటికి 45 రోజులైంది, అందరూ నష్టాలు లో ఉన్నామని లబోదిబోమంటూ అల్లాడిపోతున్నారు. ఇందుకు గల కారణాలను అన్వేషిస్తే ప్రభుత్వం లిక్కర్ పై ఇచ్చే కమిషన్ పై స్పష్టత లేకపోవడమే. మద్యం పాలసీ ప్రకటించి దరఖాస్తులు స్వీకరించే సమయంలో గతంలో ఉన్న పది శాతం కమిషన్ ను 20 శాతం చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించి వ్యాపారులకు లాభం జరిగేలా ఉంటుందని నమ్మించి, వైన్ షాపులను ప్రభుత్వం కేటాయించింది.

తీరా షాపులు ప్రారంభించాక టాక్స్ లన్ని పోను కేవలం 9 నుండి 11 శాతం మాత్రమే కమిషన్ వస్తుండడంతో రాష్ట్రంలో ఉన్న షాపుల్లో 90 శాతం షాపులు ప్రస్తుతం నష్టాల్లో నడుస్తున్నాయని వ్యాపారులైన తెలుగు తమ్ముళ్లు వాపోతున్నారు. మన ప్రభుత్వం వచ్చిందని మనకి ఏదో ఒకటి ఆదాయం సమకూరుతుందని వైన్ షాపుల కోసం పరుగెడితే ఆనాడు కాంట్రాక్ట్ పనులు చేసి ఎలా అయితే ఆర్థికంగా కృంగిపోయామో, అవే పరిస్థితులు పునరావృతం అవుతున్నాయి అన్న ఆందోళన కూడా ఉంది.

మరొక విషయం ఏమిటంటే నోటిఫికేషన్ లో కూడా కొంత గందరగోళానికి సృష్టించి ప్రభుత్వానికి ఆదాయం వచ్చే విధంగా నిర్ణయించిన విధానానికి భిన్నంగా లైసెన్స్ ఫీజులు నిర్ణయించినట్లు కూడా వ్యాపారులు విమర్శలు గుప్పిస్తున్నారు. క్యాబినెట్ నిర్ణయించిన ప్రకారం మొత్తం షాపుల్లో 1300 షాపులు 50 లక్షలు ఏడాది లైసెన్స్ ఫీజు గా ఉండాల్సి ఉంది. మిగిలిన షాపులకు 55, 65, 85 లక్షలు గా జనాభా ను బట్టి నిర్ణయించడం జరిగింది.

అయితే మండలాన్ని యూనిట్ గా తీసుకొని జనాభా లెక్కల్లో కూడా గందరగోళం సృష్టించడం వలన ఎక్కువ శాతం 65 లక్షల గ్రేడ్ లోకి వెళ్ళేటట్లు గా 80% షాపులను నిర్ణయించడం వల్ల కూడా షాపులు దక్కించుకున్న వారికి నష్టాలు వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. రాష్ట్రం లో 50 లక్షల గ్రేడ్ లోకి కేవలం 200 షాపులు వరకు మాత్రమే రావడం నోటిఫికేషన్ లో గందర గోళం అని చెప్పవచ్చు. అంతేకాక మందు ధరలు తగ్గిస్తామని ప్రకటించి ఒక చీప్ లిక్కర్ తప్ప ఏది తగ్గించకపోవడం కూడా అమ్మకాలపై ఆ ప్రభావం ఉంది.

అధికారులు పాలసీలో ప్రకటించిన విధానాలు అమలు చేయకపోవడంతో వ్యాపారులు లబోదిబోమంటున్నారు. ఇది ఇలా ఉంటే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మద్యం విధానంలో పారదర్శకత పాటించాలని, మద్యం అధిక ధరలకు అమ్మితే కేసులు రాయాలని బెల్ట్ షాపులు పెట్టకూడదని కఠిన నిబంధనలు ప్రకటించడంతో కూడా వైన్ షాపులకు ఆదాయం లేక లబోదిబోమంటున్నారు. ఈ పరిస్థుతులలో తమ్ముళ్లకు జేబులు చిల్లులు పడే పరిస్థితులు కనిపిస్తున్నాయని వాపోతున్నారు.

ప్రభుత్వం వచ్చిందని కాలర్ ఎగరేసుకుని ప్రభుత్వ వైన్ షాపులను తమ కోసమే ప్రైవేట్ షాపులుగా ఇచ్చారని తెలుగు తమ్ముళ్లు పడ్డ ఆశ అడియశగా మారింది. అయితే దీనిపై రాష్ట్రవ్యాప్తంగా ఉన్న తెలుగు తమ్ముళ్లు ఆగ్రహంతో ఊగిపోతూ ప్రభుత్వానికి వినతి పత్రం ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ముందుగా ప్రకటించిన విధంగా మద్యం పై వచ్చే కమిషన్ 20 శాతం వ్యాపారికి దక్కే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

అదేవిధంగా లిక్కర్ ధరలు కూడా తగ్గించాలని, ఎక్సైజ్ అధికారుల వేధింపులు లేకుండా చూడాలని ప్రభుత్వ నిబంధనల పేరుతో వైన్ షాపుల వ్యాపారులను ఇబ్బంది పెడితే తెలుగుదేశం క్యాడర్ మొత్తం ఆర్థికంగా మరోసారి దివాలా తీసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు ఆలోచించి తెలుగు తమ్ముళ్లకు వ్యాపార గణిగా ఉన్న మద్యం షాపుల నష్టాల నుండి కనీసం పెట్టిన డబ్బులు పెట్టుబడి వచ్చే విధంగా నైనా ముందుగా ప్రకటించిన 20 శాతం కమిషన్ ను అందజేయాలని కోరుతున్నారు.

LEAVE A RESPONSE