– ఆ తర్వాతనే సర్పంచ్ ఎన్నికలు?
– సర్పంచులపై పట్టు కోసం రేవంత్ సర్కారు కొత్త ఎత్తు?
– అసెంబ్లీ సమావేశాల్లో నిర్ణయం?
– 15 తర్వాత నోటిఫికేషన్?
( మార్తి సుబ్రహ్మణ్యం)
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమయిన నేపథ్యంలో.. గ్రామాల్లో కీలకమెనై సర్పంచులపై పట్టు సాధించేందుకు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం సరికొత్త ముందస్తు వ్యూహానికి తెరలేపనుంది. అందులో భాగంగా సర్పంచ్ ఎన్నికలను చివరి దశలో నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియకు రాష్ట్ర ఎన్నికల సంఘం తెరలేపింది. ఓటర్ల జాబితా విడుదల, గ్రామ పంచాయితీల్లో వాటి ప్రదర్శనకు సంబంధించిన తేదీలను ఇప్పటికే ప్రకటించింది. అసెంబ్లీ సమావేశాల ప్రారంభం రోజున జరిగే క్యాబినెట్ భేటీలో, ఎన్నికల తేదీపై స్పష్టత వస్తుందంటున్నారు. ఆ తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికల ప్రకటన విడుదలవుతుంది. కాంగ్రెస్ పార్టీ వర్గాల సమాచారం ప్రకారం.. వచ్చే నెల 15 తర్వాత నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉండవచ్చంటున్నారు.
అయితే ఈసారి స్థానిక సంస్థల ఎన్నికలు భిన్నంగా జరిగే అవకాశం కనిపిస్తోంది. అంటే రెండు దశల్లో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందంటున్నారు. తొలుత జడ్పీటీసీ, ఎంపీటీసీ తర్వాత మలి దశలో సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలని సీఎం రేవంత్‌రెడ్డి భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ విషయంలో ఆయన వ్యూహాత్మకంగా అడుగులేస్తున్నట్లు కనిపిస్తోంది.
జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికలు ఒకే సమయంలో నిర్వహించడం ద్వారా, సహజంగా పార్టీ కార్యకర్తలు వాటిపై నిమగ్నం చేస్తారు. అదీగాక సర్పంచ్‌గా గెలిచిన వారిపై అధికార పార్టీకి పెద్దగా పట్టుండదు. పార్టీలపై సర్పంచుల అధిపత్యం ఉంటుంది. ప్రతిదీ వారే నిర్దేశిస్తారు.
అదే సర్పంచ్ ఎన్నికలను చివరి దశలో నిర్వహిస్తే.. సర్పంచ్ అభ్యర్థిత్వాలను ఆశించేవారు, తమ గ్రామాల్లో అధికార పార్టీ విజయం కోసం కష్టపడి పనిచేయక తప్పని పరిస్థితి. ఆ విధంగా వారి సేవలను పార్టీకి వినియోగించుకునే అవకాశం ఉంటుంది.
తర్వాత సర్పంచ్ ఎన్నికల సమయంలో అభ్యర్ధిత్వాన్ని ఆశించే నాయకులకు అధికార పార్టీ మద్దతు, ప్రభుత్వ యంత్రాంగ సాయం ఎలాగూ ఉంటుంది.
మిగిలిన పార్టీల కంటే ఎక్కువగా ఖర్చు చేసే అవకాశం కూడా సహజంగా అధికార పార్టీకే ఉంటుంది కాబట్టి, ఎక్కువ సంఖ్యలో సర్పంచులను గెలిపించుకోవచ్చన్న వ్యూహంతోనే.. సీఎం రేవంత్‌రెడ్డి ఈ వ్యూహానికి తెరలేపినట్లు పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
సహజంగా నియోజకవర్గాల్లో సర్పంచులే కీలకం కాబట్టి, వారిని భారీ సంఖ్యలో గెలిపించుకోవడం ద్వారా.. గ్రామాల్లో కాంగ్రెస్‌ను బలోపేతం చేయాలన్నదే రేవంత్‌రెడ్డి అసలు లక్ష్యమంటున్నారు.