వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత తొలగించిన అన్నక్యాంటీన్లను పునరుద్ధరించాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఏపీ సీఎం జగన్కు లేఖ రాశారు. పేదల కడుపు నింపేందుకు టీడీపీ ప్రభుత్వం ప్రారంభించిన అన్నక్యాంటీన్లు లక్షల మంది ఆకలితీర్చాయని గుర్తు చేశారు. లోకేష్ లేఖ సారాంశం ఇదీ..
శ్రీ వైఎస్ జగన్మోహన్రెడ్డి గారు
ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్
విషయం: రాష్ట్రవ్యాప్తంగా అన్నాక్యాంటీన్లు అర్జంటుగా తెరవాల్సిన అవసరం గురించి..
సీఎం గారూ,
మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే పేదలపై కోపమో..అన్నగారి పేరుమీద ద్వేషమో ..ఆకలిజీవులంటే అసహ్యమో తెలియదు కానీ అన్న క్యాంటీన్లని మూసేశారు. రాష్ట్రంలో4.31 కోట్ల మంది పేదల ఆకలి తీర్చిన అన్న క్యాంటీన్లకి రంగులు మార్చి మరీ తాళాలు వేయడంతో పేదలు, కూలీలు, అభాగ్యుల ఆకలి తీర్చే క్యాంటీన్లు మూతపడ్డాయి. పట్టణాలకు వచ్చే వివిధ పనుల మీద వచ్చేవారందరికీ రూ.5కే చక్కని భోజనం, అల్పాహారం అందించాలని ఉద్దేశంతో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా 201 అన్న క్యాంటీన్లు ప్రారంభించి, రుచిగా..శుచిగా ఆహారం అందించే బాధ్యతలను హరేకృష్ణా అనే సేవా సంస్దకు అప్పగించిన విషయం మీకు తెలిసిందే.
అన్న క్యాంటీన్ల కోసం బడ్జెట్ లో రూ.200 కోట్లు కేటాయించాం. మీరు అధికారంలోకి రాగానే అన్న క్యాంటీన్ల బిల్లులు ఆపేశారు. అన్న క్యాంటీన్లను మూసేసే కుట్ర జరుగుతోందని మేము అడిగితే, లేదని సమాధానం ఇచ్చిన మీ ప్రభుత్వం ఆ తరువాతి రోజే అన్నక్యాంటీన్లని మూసేసింది. రోజుకి 3 లక్షల మందికి ఆకలి మిగిల్చింది. నిరుపయోగంగా ఉన్న అన్న క్యాంటీన్లు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయి. మరికొన్నింటిని వార్డు సచివాలయాల కింద వాడుతున్నారు. కొన్నింటిని జేసీబీలతో కూలగొట్టారు. అన్నక్యాంటీన్లను మూసివేశామని మీరు జబ్బలు చరుచుకోవచ్చు.
ఆకలి సమయం అయ్యేసరికి ఆశగా క్యాంటీన్ల వైపు చూసే లక్షలాది మంది పేదల ఉసురు మీకు తగులుతుంది. నిత్యావసరాల ధరలు, గ్యాస్, కరెంటు చార్జీలు, పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో రోడ్డు పక్క బండి మీద టిఫిన్ అమ్మేవాళ్లు కూడా ప్లేట్ ఇడ్లీ 30 రూపాయలు అమ్మాల్సి వస్తుంది. ఒకరు మామూలు హోటల్లో భోజనం చేయాలంటే వంద వెచ్చించాల్సిందే. కూలీలకు పనుల్లేవు. కార్మికులకి ఉపాధి దొరకడంలేదు. నిరాశ్రయులు, పేదలు, యాచకులు ఆకలితో నకనకలాడుతున్నారు. ఆకలిగొన్నవారికి కొన్నిచోట్లయినా కొంతమందికైనా ఆకలి తీర్చాలని టిడిపి ఆధ్వర్యంలో స్వచ్ఛందంగా రాష్ట్రవ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో అన్న క్యాంటీన్లను నడుపుతున్నాం.
గుంటూరు, మంగళగిరి, రాజమహేంద్రవరం, బొబ్బిలి, పాలకొల్లు వంటి పట్టణ ప్రాంతాల్లో టిడిపి నేతలు, దాతలతో కలిసి అన్న క్యాంటీన్లను నిర్వహిస్తుంటే, ఆకలితో వస్తున్న జనం చూస్తుంటే.. రాష్ట్రవ్యాప్తంగా అన్న క్యాంటీన్ల అవసరం ఏ స్థాయిలో వుందో స్పష్టం అవుతోంది. మీరు పెట్టరు, పెట్టేవాళ్లని అడ్డుకుంటారు. పేదవాళ్ల నోటి కాడ ముద్ద లాక్కునే ధోరణి మంచిది కాదు. మేము పెడుతున్న అన్న క్యాంటిన్లు కూల్చడం, అడ్డుకోవడం లాంటి పనులు ఇకనైనా ఆపాలని కోరుతున్నాను.
నిధులులేవు, అప్పులు దొరకడంలేదని మాత్రం సాకులు వెతకకుండా, ఆకలి తీర్చే అన్న క్యాంటీన్ల బడ్జెట్ మీరు మీ మానసపుత్రిక సాక్షికి ఇచ్చే ప్రకటనలు బడ్జెట్ కంటే తక్కువే. కొన్నాళ్లు మీ సొంత మీడియాకి యాడ్స్ ఇవ్వడం ఆపేస్తే రాష్ట్రంలోని అన్ని పట్టణాలలో అన్న క్యాంటీన్లను తెరిచి నిర్వహించవచ్చు. మీ రివర్స్ పరిపాలన కారణంగా గతంలో ఉన్న అన్న క్యాంటీన్ల సంఖ్య రెండింతలు పెంచాల్సిన అవసరం ఇప్పుడు ఏర్పడింది. ఇది అత్యవసరంగా తీసుకుని, అన్న క్యాంటీన్లని పునః ప్రారంభించాలని కోరుతున్నాను.
నారా లోకేష్
టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి