– పీపీపీ మోడల్‌పై రాజకీయ విమర్శలు
– ఎవరిది నిజమైన చిత్తశుద్ధి?
– వైకాపా గురువింద గింజ కబుర్లు
ఆరోగ్యశ్రీ నిధులు అత్యధికంగా ప్రైవేట్ ఆసుపత్రులకే వెళ్లిన చరిత్రను గమనిస్తే, ప్రస్తుత ప్రభుత్వ ‘పీపీపీ’ మోడల్ ఆసుపత్రులపై వైకాపా విమర్శలు డబుల్ స్టాండర్డ్స్‌గా కనిపిస్తున్నాయనే భావన ప్రజల్లో ఉంది. ఇది కేవలం ఒక రాజకీయ విమర్శ మాత్రమే కాదు, ప్రజల మనోభావాలను తాకే ఒక సున్నితమైన అంశం.
వై.ఎస్.ఆర్.సి.పి. ప్రభుత్వ హయాంలో ఆరోగ్యశ్రీ కింద ప్రైవేట్ ఆసుపత్రులకు జరిగిన చెల్లింపులు గణనీయంగా పెరిగాయి. 2019-20లో ₹1,260 కోట్ల మొత్తం చెల్లింపుల్లో ప్రైవేట్ ఆసుపత్రుల వాటా 83% (₹1,040 కోట్లు) కాగా, 2023-24లో ₹3,000 కోట్ల చెల్లింపుల్లో అది ఏకంగా 85%కి (₹2,550 కోట్లు) పెరిగింది. ఆ ఐదేళ్ల కాలంలో ప్రైవేట్ ఆసుపత్రులకే దాదాపు ₹8,800 కోట్లకు పైగా చెల్లింపులు జరిగాయి. ఇది ఏటా సగటున 15% కూడా ప్రభుత్వ ఆసుపత్రులకు చెల్లించకుండా వేధించారు.
దీనికితోడు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులోని ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స చేయించుకుంటే, దాని చెల్లింపుల బాధ్యతను కూడా వై.ఎస్.ఆర్.సి.పి. ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కింద భరించింది. ఈ నిధులు కూడా పూర్తిగా ఆ రాష్ట్రాల్లో వున్న ప్రైవేట్ ఆసుపత్రులకే చేరాయి. దీనికి విరుద్ధంగా, పొరుగు రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్ ఆసుపత్రులకు చెల్లింపులు లేవు.
తెలంగాణ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ తమ రాష్ట్రంలోని ఆసుపత్రులకు మాత్రమే చెల్లిస్తుంది. అరుదైన సందర్భాల్లో తప్ప, ఇతర రాష్ట్రాల ఆసుపత్రులకు నిధులు విడుదల చేయదు. అందులో మన రాష్ట్రంలో ఒక్క ఆసుపత్రికి ఎంపానల్మెంట్ లేదు. ఇక కర్ణాటక ప్రభుత్వం తమ పథకం పరిధిలోకి ఆంధ్రప్రదేశ్ ఆసుపత్రులను చేర్చలేదు. తమిళనాడు ముఖ్యమంత్రి సమగ్ర ఆరోగ్య బీమా పథకం పరిధిలో కూడా ఆంధ్రప్రదేశ్ ఆసుపత్రులు లేవు.
దీని వల్ల, నిధులు ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ నుంచి పొరుగు రాష్ట్రాలకు ప్రవహిస్తున్నాయి, కానీ తిరిగి ఆంధ్రప్రదేశ్‌కు రావడం లేదు. ఒకవైపు ప్రైవేట్ ఆసుపత్రులకు చెల్లిస్తూ, అప్పటికే ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులకు కూడా ఆరోగ్యశ్రీ చెల్లింపుల బకాయిలను పేరుకుపోయేలా చేయడం మనకు తెలిసిందే.
వైకాపా నేతల బంధువులు, సానుభూతిపరులకు నాటి ప్రభుత్వం ఆరోగ్యశ్రీ ట్రస్టులో కీలక బాధ్యతలు కట్టబెట్టింది. గతంలో అక్రమాలకు పాల్పడటంతో వైకాపా శ్రేణుల ఆసుపత్రులకు వేసిన జరిమానాలు తగ్గించేసింది. కొన్ని వైద్యశాలల్లో తగిన మౌలిక వసతులు లేకున్నా అనుబంధ గుర్తింపును మంజూరు చేసింది.
వైకాపా పాలనలో ఆరుగురు సీఈఓలను మార్చారు. ఎవరు విధుల్లోకి వచ్చినా బకాయిలు చెల్లించాలంటూ ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు ఒత్తిడి తెచ్చాయి. తరచూ సేవలు నిలిపివేస్తామని హెచ్చరించాయి. దీంతో బకాయిల చెల్లింపుల వ్యవహారాలను చూసేందుకు వీరు ఎక్కువ సమయాన్ని కేటాయించారు. ఇతర కార్యకలాపాలు గాడితప్పాయి.
గ్రీన్ ఛానల్ కింద చెల్లింపులు చేస్తామని నాటి ప్రభుత్వం ప్రకటించినప్పటికీ ఎన్నడూ అమలు చేసిన దాఖలాలు లేవు. కోడికత్తి గాయానికి జగన్‌కు చికిత్స అందించిన డాక్టర్ సాంబశివారెడ్డిని తీసుకొచ్చి ఆరోగ్యశ్రీ ట్రస్టుకు ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్మెన్‌గా నియమించారు.
నాటి సీఎంఓ ఆదేశాల మేరకు ట్రస్టు స్పెషల్ ఆఫీసర్ పేరుతో నియామకం పొందిన డాక్టర్ అశోక్ (దంత వైద్యుడు) తనిఖీల పేరుతో అనుబంధ వైద్యశాలల నుంచి రూ. లక్షల్లో వసూళ్లకు పాల్పడ్డారని -ఆరోపణలు వచ్చాయి. నాడు ట్రస్టులోని విజిలెన్స్ విభాగం బలహీనంగా ఉండటం కొందరు ఉద్యోగులకు కలిసొచ్చింది.
ఇప్పుడు, ప్రస్తుత ప్రభుత్వం పది కొత్త మెడికల్ కాలేజీలను పబ్లిక్-ప్రైవేట్ పార్ట్నర్షిప్ (ఫ్ఫ్ఫ్) మోడల్లో నిర్మించాలని నిర్ణయించినప్పుడు, వై.ఎస్.ఆర్.సి.పి. నాయకులు దీనిని “ప్రైవేటీకరణ” అంటూ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ వైఖరి, గతంలో ఆరోగ్యశ్రీ కింద ప్రైవేట్ రంగానికి భారీగా నిధులు సమకూర్చిన విధానానికి పూర్తి విరుద్ధంగా ఉంది. ఇది ప్రజలను ఆలోచింపజేసే అంశం.
ప్రైవేట్ ఆసుపత్రులను ఆరోగ్యశ్రీ కింద ప్రోత్సహించడం ప్రైవేటీకరణ కానప్పుడు, కొత్త మెడికల్ కాలేజీలను ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యంతో నిర్మించడం ఎలా ప్రైవేటీకరణ అవుతుంది? ఈ ప్రశ్న నేడు ప్రజల్లో తలెత్తుతోంది. ఈ వైఖరిని ప్రజలు “డబుల్ స్టాండర్డ్స్”గా భావిస్తున్నారు.
ఎందుకంటే, ప్రజారోగ్యాన్ని బలోపేతం చేయాలనుకునే ఏ ప్రభుత్వమైనా, ఆరోగ్యశ్రీ నిధులను ప్రభుత్వ ఆసుపత్రులకు మళ్లించడంపై ప్రధానంగా దృష్టి పెట్టాలి. అది చేయకుండా, ప్రైవేట్ రంగానికి నిధులు ధారాళంగా ఇస్తూ, ఇప్పుడు పీపీపీ మోడల్‌ను వ్యతిరేకించడం భావోద్వేగాలను రెచ్చగొట్టే రాజకీయ ఎత్తుగడగా ప్రజలు చూస్తున్నారు.
వై.ఎస్.ఆర్.సి.పి. విమర్శలు రాజకీయంగా సరైనవి కావొచ్చు, కానీ వారి గత చర్యలు, ముఖ్యంగా ఆరోగ్యశ్రీ చెల్లింపుల విషయంలో ప్రైవేట్ ఆసుపత్రులపై ఆధారపడటం, ఈ విమర్శల వెనుక ఉన్న నిజాయితీని ప్రశ్నిస్తున్నాయి. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజారోగ్య వ్యవస్థపై నిజంగా శ్రద్ధ ఉన్నవారు చేసే విమర్శ కాదని, ఇది కేవలం రాజకీయ స్వార్థంతో చేస్తున్న విమర్శ అని ప్రజలు భావిస్తున్నారు.
నేషనల్ మెడికల్ కౌన్సిల్ షరతులు, యూనివర్శిటీ గ్రాంట్ కమీషన్ నిబంధనలు, ప్రభుత్వ పర్యవేక్షణతో.. ట్రస్టుల ద్వారా మెడికల్ కాలేజీలకు టెండర్లు పిలిచారు. ప్రజలందరికీ 2.5 లక్షల వరకు మెడికల్ భీమా ఇచ్చి, పేదలకు 25 లక్షల వరకు మెడికల్ భీమా ద్వారా చికిత చేయించుకొనేలా ప్రభుత్వం ప్రకటించింది.
ఈ పిపిపి మెడికల్ కాలేజీలలో 50% సీట్లు ప్రభుత్వ కోటాలో మెరిట్ విద్యార్థులకు లభిస్తుంది. మొట్టమొదటి సారిగా ప్రభుత్వ మెడికల్ కాలేజీలలో కూడా మేనేజ్మెంట్, సెల్ఫ్ ఫైనాన్సింగ్ సీట్లు పెట్టి లక్షల రూపాయల ఫీజులు పెట్టి, మెరిట్ విద్యార్థుల పొట్టగొట్టిన వైకాపా విధానాలు కేవలం కేవలం పార్టీ మనుగడ కోసమే.