పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన కెరీర్‌లో తొలిసారి నటిస్తున్న పీరియాడికల్ చిత్రం ‘హరిహర వీరమల్లు’. జాగర్లమూడి క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఎ.ఎమ్.రత్నం సమర్పణలో ఎ.దయాకర్ రావు నిర్మిస్తున్న ఈ సినిమాలో పవన్ బందిపోటుగా కనిపించబోతున్నారు. ఇప్పటికే విడుదలైన ఆయన లుక్ అందరినీ ఆకట్టుకుంది. పవన్‌కి జంటగా నిధి అగర్వాల్ నటిస్తోంది.
అంతాబాగానే ఉన్నా ఈ చిత్రం షూటింగ్ ఆలస్యమవుతూ వస్తోంది. తొలుత కరోనా కారణంగా చిత్రీకరణ ఆగిపోగా.. ఆపై పవన్ షెడ్యూల్ లో మార్పుల వల్ల కొంత గ్యాప్ వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై కళ్యాణ్ ఇప్పుడు సీరియస్ గా దృష్టి పెట్టడంతో ఈ చిత్రం ఆపేశారనే ప్రచారం కూడా జరుగుతోంది. అయితే, ఈ ప్రచారానికి చిత్ర బృందం చెక్ పెట్టింది.
ఆగస్టు 11 నుంచి చిత్రీకరణ తిరిగి ప్రారంభించాలని నిర్ణయించింది. పవన్పొలిటికల్ కమిట్ మెంట్స్ను దృష్టిలో ఉంచుకొని ఈ షెడ్యూల్ ను దర్శకుడు క్రిష్ పక్కాగా ప్లాన్ చేశారట. ఒక పాటతో పాటు పవన్ కళ్యాణ్ క్యారెక్టర్‌కి సంబంధించిన సీన్స్ మొత్తం ఈ షెడ్యూల్లోనే పూర్తి చేయాలని భావిస్తున్నాడని సమాచారం. ఆ తర్వాత మిగతా వారి సీన్స్‌ని తెరకెక్కించాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
ఈ సినిమాతో పాటు ‘వినోదాయ సిత్తం’ రీమేక్ కూడా పూర్తిచేసి రాజకీయాలపై ఫోకస్ పెట్టాలని పవన్ భావిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. హరీష్ శంకర్‌తో ‘భవదీయుడు భగత్‌సింగ్’తో పాటు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఒక సినిమాకు పవన్ పచ్చజెండా ఊపారు.