-సమస్యలు పక్కదారి పట్టించేందుకే ప్రభుత్వం ప్రయత్నాలు..
-చంద్రబాబు, పవన్ ను తిడుతూ దృష్టిమరల్చే యత్నం..
-ఇరిగేషన్ మంత్రిని తీసుకువచ్చి ఏరోజైనా సమస్యలు చూపించారా..?
-నన్ను విమర్శిస్తే వచ్చే నష్టమేం లేదు
-గొప్పగా మాటలు చెప్పటం కాదు.. పరిహారం ఇచ్చి రైతులను ఆదుకోవాలి
-మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ ధ్వజం
చల్లపల్లి : విపత్తుల సమయాల్లో ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు తాడేపల్లి ప్యాలెస్ ను వీడి ముఖ్యమంత్రి బయటకు రావాలని మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ సూచించారు. సమస్యలు పక్కదారి పట్టించే ప్రయత్నాలు మానుకోవాలని హితవు పలికారు.
చల్లపల్లి మండలం పాతమాజేరు, మోపిదేవి మండలం వెంకటాపురం గ్రామాల్లో ముంపుబారిన పంటపొలాలను శుక్రవారం ఉదయం రైతులతో కలిసి బుద్ధప్రసాద్ పరిశీలించారు. జలాశయాలను తలపించేలా ఉన్న పొలాలను, దెబ్బతిన్న వరినారును, వెదవేసిన పరిపైరును పరిశీలించి. రైతులతో మాట్లాడారు.
ఈ సందర్భంగా బుద్ధప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ, ఓగ్ని తుఫాన్ తో పోల్చిచూస్తే కొద్దిపాటి వర్షానికే ఏర్పడిన ముంపు సమస్యకు ప్రభుత్వ అసమర్ధతే కారణమని మండిపడ్డారు. ఏ రైతు నోట విన్నా నాలుగేళ్లుగా మురుగుకాల్వల పూడికతీత చేపట్టకపోవటం, గుర్రపుడెక్క..తూటుకాడ తొలగించకపోవటం ముంపుకు ప్రధాన కారణమని చెబుతున్నారని తెలిపారు. వర్షాలకు ముందు చేయాల్సిన పనులు గ్రామాల్లో తాము పర్యటనలు చేసి వచ్చిన తర్వాత చేస్తున్నారన్నారు.
ప్రభుత్వం గురించి గొప్పగా మాటలు చెప్పటం కాదనీ, రైతులకు పరిహారం ఇచ్చి ఆదుకుంటారా అని బుద్ధప్రసాద్ ప్రశ్నించారు. విపత్తులు వచ్చినప్పుడు సమస్యను పక్కదారి పట్టించే ప్రయత్నం మానుకోవాలని ప్రభుత్వానికి హితవు పలికారు. మంత్రులతో చంద్రబాబుని, పవన్ కళ్యాణ్ ని తిట్టించి ప్రజల, పార్టీల దృష్టిమరల్చేందుకు ప్రభుత్వం యత్నిస్తోందనీ, వారి ఆలోచనను పట్టించుకోకుండా ప్రజల పక్షాన నిలిచి సమస్యలు గొంతెత్తి చాటాలని పార్టీశ్రేణులకు విజ్ఞప్తి చేశారు.
రైతులు తీవ్ర ఆవేదనలో ఉంటే మంత్రులు వచ్చి సమస్యలను గుర్తించారా అని ప్రశ్నించారు. తాము అధికారంలో ఉండగా ఇరిగేషన్ మంత్రులను ఎన్నోసార్లు తీసుకువచ్చాననీ, అవనిగడ్డకు చెందిన ఇరిగేషన్ మంత్రి అంబటి రాంబాబును తీసుకువచ్చి ఏనాడైనా సమస్యలు చూపించి నిధులు మంజూరు చేయించారా అని బుద్ధప్రసాద్ నిలదీశారు. నన్ను విమర్శిస్తే వచ్చే నష్టం ఏమీ లేదన్నారు.
విపత్తులు సమయాల్లో ప్యాలెస్ దాటి రాని ముఖ్యమంత్రి జగన్ ఒక్కరేనని విమర్శించారు. ఈరోజు చెట్లు నాటాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసిందనీ, చెట్లు నాటటం నరికేందుకేనా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి ఎక్కడ పర్యటిస్తే అక్కడ చెట్లు నరకటం రివాజుగా మారిందన్నారు. అశోకుడు చెట్లు నాటించెను…జగన్ నరికించెను అని చదువుకోవాల్సి వస్తుందని ఎద్దేవాచేశారు.
ఇలాంటి విపత్తుల సమయాల్లో తాము అధికారులను పరుగులు తీయించేవారమనీ, సమీక్షలు నిర్వహించి తగు చర్యలు చేపట్టేవారమని బుద్ధప్రసాద్ తెలిపారు. పార్టీశ్రేణులను సైతం రంగంలోకి దించి ప్రజలకు అండగా ఉంచేవారమనీ.. ఆ పనితీరు తమకు తెలుసన్నారు. గతంలో మంత్రులు సమస్యలు పరిష్కారానికి కృషిచేసేవారనీ, కానీ నేడు మంత్రులు వస్తే ప్రతిపక్షాలను దూషించటం మినహా మరేమీ చేయట్లేదన్నారు.నాలుగేళ్ల వైసీపీ ప్రభుత్వంలో ఇరిగేషన్, డ్రైనేజీ రంగాన్ని నిర్వీర్యం చేశారని మండిపడ్డారు.
దయనీయమైన, దారుణస్థితిలో రైతులు ఉన్నారనీ, ఇప్పటికైనా డ్రైనేజీ వ్యవస్థను బాగుచేసి రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉందని బుద్ధప్రసాద్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.