– రైతుల పక్షాన కొలికపూడి వినూత్న నిరసన
– సీఆర్డీఏ అధికారుల కాళ్లు పట్టుకుని అభ్యర్ధన
– బూట్లు పాలిష్ చేసి మరీ వేడికోలు
– అందరినీ ఆకర్షించిన కొలికపూడి వినూత్న అభ్యర్ధన
(మార్తి సుబ్రహ్మణ్యం)
అది అమరావతి సీఆర్డీఏ కార్యాలయం. ఆయన ఉన్నత విద్య అభ్యసించిన ఓ దళిత మేధావి. కులాలపై డాక్టరేట్ చేసిన మంచి వక్త. ఏ అంశంపైనయినా అనర్గళంగా గణాంకాలతో చిట్టా విప్పే మేధావి. అంతేకాదు. చట్టాలు రూపొందించే ఐఏఎస్‌లను తయారుచేసే ఓ కర్మాగారం. ఆయన అకాడెమీలో లెక్కలేనంతమంది ఎదిగి, ఇప్పుడు జిల్లా కలెక్టర్లుగా పనిచేస్తున్నారు. ఓ వైపు ఐఏఎస్‌లను తయారుచేస్తూనే, మరో వైపు అమరావతి కోసం.. అలుపెరుగని పోరాటం చేస్తున్న ఆయన పేరు కొలికపూడి శ్రీనివాసరావు. అమరావతి పరిరక్షణ సమితి కన్వీనర్.
అమరావతికి జగన్ సర్కారు చేస్తున్న అన్యాయంపై టీవీ చర్చావేదికలు, ప్రెస్‌మీట్లతోపాటు.. పాదయాత్రలతోనూ తన నిరసన కొనసాగిస్తున్న కొలికపూడి.. గతంలో ఏబీఎన్ చానెల్‌లో నిర్వహించిన ఓ చర్చా వేదికలో, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్దన్‌రెడ్డిని చెప్పుతో కొట్టిన వైనం సంచలనం సృష్టించింది. ఆయనే.. ఈయన!
తాజాగా కొలికపూడి నిర్వహించిన ఓ వినూత్న నిరసన లాంటి అభ్యర్ధన, అందరినీ కదిలించింది. అమరావతిని అభివృద్ధి చేయాలంటూ సీఆర్డీఏ అధికారులు, చివరకు అక్కడ పనిచేసే సెక్యూరిటీ గార్డుల బూట్లు తుడిచారు. భూములిచ్చిన అమరావతి రైతులకు ప్లాట్లు కేటాయించాలని వేడుకున్నారు. ముందు భూములిచ్చిన రైతులకు, అక్కడ నివసించే పేద వారికి ఇళ్లు ఇవ్వాలని అభ్యర్ధించారు. ఐఏఎస్‌లను తయారుచేసే ఓ మేధావి, తన హోదా మరిచిపోయి అమరావతి రైతుల కోసం.. చివరకు అధికారుల బూట్లు కూడా తుడిచిన వైనం, అక్కడివారిని కదిలించింది. అమరావతి రైతుల డిమాండ్లు తీర్చే వరకూ తన పోరాటం ఆగదని కొలికపూడి స్పష్టం చేశారు.
కొలికపూడి ఇంకా ఏమన్నారంటే…
అమరావతి కోసం వేల ఎకరాలు రైతులు ప్రభుత్వానికి ఇచ్చారు. పేదల ఇళ్ల నిర్మాణం పేరుతో, ప్రజల మధ్య ప్రభుత్వం విద్వేషాలు రెచ్చగొడుతుంది.రాజధాని నిర్మాణం చేస్తూ.. పేదలకు ఇళ్లు ఇవ్వాలని కోరుతున్నాం.
అమరావతి రాజధాని లో ఉన్న వాళ్లంతా పేదలే… అక్కడ పెద్దలు ఎవరూ లేరు. ఈ ప్రభుత్వం దగ్గర ప్రతి కుటుంబం సామాజిక ఆర్ధిక వివరాలు ఉన్నాయి. ఆ వివరాలు తెచ్చుకుని వాలంటీర్లు తో విచారించు కోవచ్చు.
భూములు ఇచ్చిన వారిలో 21వేల కుటుంబాలు ఎకరం లోపు ఉన్న వాళ్లే. రాజధానిలొ భూస్వాములు అనే ప్రచారం మానుకోవాలి. పేదల ను ఉద్దరిస్తున్న పెద్దమనిషిగా రాజకీయం చేస్తున్నారు.. పేదలకు ఇళ్లు ఇవ్వడానికి మేము వ్యతిరేకం కాదు.
రాజధానిలో నిర్మాణం చేసి, ఇక్కడ ఉన్న పేదలకు ముందు ఇళ్లు ఇవ్వా లి.బయట ఉన్న వైసిపి కార్యకర్తలు కు ఇక్కడ పేదల పేరుతో ఇళ్లు ఇస్తున్నారు. ముందు భూములు ఇచ్చిన వారికి , అక్కడ పేదలకు ఇళ్లు ఇవ్వాలి. వారి భూముల్లో వారిని రానీయకుండా, వారిని స్థానికేతరులుగా చూస్తున్నారు. అందుకే ఈరోజు వినూత్న రీతిలో నిరసన తెలిపాం. మా ఆవేదనను అధికారులు, పాలకులు అర్థం చేసుకోవాలని కోరుతున్నాం.