– అటు కౌన్సిల్.. ఇటు కార్పొరేషన్ కలవరం
– సిటీలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలదే హవా
– జీహెచ్‌ఎంసీలోనూ బీఆర్‌ఎస్‌దే పైచేయి
– 53 మంది కార్పొరేటర్లతో మెజారిటీ సీట్లు
– అదనంగా 44 మంది కార్పొరేటర్లతో మజ్లిస్ దన్ను
– సర్కారుతో బీఆర్‌ఎస్ ఢీకొంటే అడుగులు కష్టమే
– కాంగ్రెస్‌కు నలుగురే కార్పొరేటర్లు
– ‘గ్రేటర్’ సహకారం లేకపోతే అనుకున్నవి ఆగే అవకాశం
– మజ్లిస్ కలిస్తేనే కా్రంగ్రెస్‌కు స్వేచ్ఛ
– అక్బరుద్దీన్‌కు ప్రొటెం స్పీకర్‌తో కొత్త సంకేతాలు
– అధికారులతో బీఆర్‌ఎస్‌కు బ్రేకులు వేయించాల్సిందే
– రేవంత్‌రెడ్డి.. కిం కర్తవ్యం?
( మార్తి సుబ్రహ్మణ్యం)
పదేళ్ల దొరల పాలనను చావుదెబ్బతీసి.. తెలంగాణ సీఎంగా గద్దెనెక్కిన రేవంత్‌రెడ్డికి, వెనువెంటనే రెండు స్పీడు బ్రేకులు ఆయన వేగాన్ని తగ్గించే ప్రమాదం కనిపిస్తోంది. అందులో ఒకటి విధానమండలి. మరొకటి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్. ఇందులో మండలిలో సర్కారీ బిల్లులు ఆమోదం తప్పనిసరి.
మండలిలో అధికార పార్టీకి బలం లేకపోతే బిల్లులు వీగి పోయే ప్రమాదం ఉంది. అయితే ప్రస్తుతం మండలిలో కాంగ్రెస్ బలం కేవలం ఒకటి మాత్రమే. కాబట్టి ఇకపై శాసనసభలో ప్రవేశపెట్టే బిల్లులకు శాసనమండలి అనుమతి అవసరం. లేకపోతే రేవంత్ సర్కారు పరువుపోయే ప్రమాదం ఉంది. ఇది కూడా చదవండి: రేవంత్‌కు ‘మండలి’లో గుచ్చుకోనున్న గులాబీ ‘ముళ్లు’
ఇక తెలంగాణ రాజధాని నగరమైన హైదరాబాద్ నగరంలో కూడా బీఆర్‌ఎస్‌దే హవా. ఒక్క ఎమ్మెల్యేల సంఖ్య మాత్రమే కాదు. జీహీచ్‌ఎంసీలో కూడా బీఆర్‌ఎస్ కార్పొరేటర్ల సంఖ్యాబలమే ఎక్కువ. మేయర్ -డిప్యూటీ మేయర్లు కూడా కాంగ్రెస్, ఆ పార్టీకి మద్దతునిస్తున్న మజ్లిస్‌కు చెందిన వారే ఉన్నారు.
నిజానికి 2020లో జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో టీఆర్ ఎస్ బలం 55 కాగా, బీజేపీ 48, మజ్లిస్44, కాంగ్రెస్‌కు 2 సీట్లు మాత్రమే దక్కాయి. తాజా ఎన్నికల ముందు బీజేపీ కార్పొరేటర్ ఒకరు బీఆర్‌ఎస్‌లో చేరగా, ముగ్గురు బీఆర్‌ఎస్ కార్పొరేటర్లు కాంగ్రెస్‌లో కాంగ్రెస్‌లో చేరారు. అందులో ఒక బీజేపీ కార్పొరేటర్ బీఆర్‌ఎస్‌లో చేరిన వారిలో ఉన్నారు. ఆ ప్రకారం గ్రేటర్ కార్పొరేషన్‌లో పార్టీల బలాబలాలు పరిశీలిస్తే.. కాంగ్రెస్ రెండంకెల సంఖ్యలో కూడా కనిపించడం లేదు.
హైదరాబాద్ నగర అభివృద్ధితోపాటు, కీలక నిర్ణయాలు ఏం తీసుకోవాలన్నా కార్పొరేషన్ కౌన్సిల్ ఆమోదం అవసరం. ఈ క్రమంలో రేవంత్ సర్కారు తీసుకోబోయే నిర్ణయాలకు, నగరానికి సంబంధించి కార్పొరేషన్ సహకారం ఎంతవరకూ ఉంటుందన్నది ఆసక్తికలిగించే అంశం. ఎందుకంటే కార్పొరేషన్‌తోపాటు, స్టాండింగ్ కమిటీలు కూడా బీఆర్‌ఎస్ చేతిలోనే ఉన్నాయి. రోడ్ల వెడల్పు, ఆధునీకరణ వంటి కీలక అంశాలన్నీ కార్పొరేషన్ అనుమతితో జరగాల్సిందే. దీన్నిబట్టి రేవంత్ సర్కారుతో.. చెన్నైలో జయలలితతో డిఎంకె మాదిరిగా, గ్రేటర్ బీఆర్‌ఎస్ యుద్ధం చేస్తుందా? లేక గతంలో వైఎస్ ఉన్నప్పుడు తీగల కృష్ణారెడ్డి జమానా మాదిరిగా సహకరిస్తుందా అన్నది చూడాలి.
తమిళనాడులో జయలిలత సీఎంగా ఉన్నప్పుడు, చెన్నై మున్సిపల్ కార్పొరేషన్ డిఎంకె ఆధీనంలో ఉండేది. ఆ సమయంలో ప్రభుత్వ నిర్ణయాలను, డిఎంకె సారథ్యంలోని కార్పొరేషన్ అడ్డుకుంది. ప్రధానంగా మంచినీటి ట్యాంకర్లు, ట్రాఫిక్ డైవర్షన్ వంటి అంశాలలో జయలలితో డిఎంకె విబేధించింది.
చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ విజయం సాథించి, తీగల కృష్ణారెడ్డి ప్రత్యక్ష పద్ధతిలో మేయర్‌గా ఎన్నికయ్యారు. ఇప్పటిదాకా చరిత్రలో నేరుగా ఎన్నుకోబడిన తొలి మేయర్ తీగల కృష్ణారెడ్డి ఒక్కరే కావడం విశేషం. ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయి వైఎస్ సారథ్యంలో కాంగ్రెస్ పాలన వచ్చింది.
కానీ అప్పుడు టీడీపీకి చెందిన తీగల మేయర్‌గా ఉన్నారు. అయితే అప్పటి పాలకవర్గం కాంగ్రెస్ సర్కారుతో యుద్ధం చేయలేదు. ప్రభుత్వ ప్రతిపాదనలు అంగీకరించింది. అప్పటి కమిషనర్ చిత్రా రామచంద్రన్, సంజయ్‌జాజు ప్రభుత్వ ప్రతిపాదనలను ఆమోదింపచేయటంలో సక్సెస్ అయ్యారు. అప్పుడు కూడా మేయర్ తీగల ఉన్నా, పెత్తనమంతా కమిషనర్లే చేసేవారు.
మొన్నటివరకూ ప్రభుత్వం-జీహెచ్‌ఎంసీలో, బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నందున ఆ సమస్య రాలేదు. ఇప్పుడు ప్రభుత్వం-కార్పొరేషన్‌లో ఉన్న పార్టీలు వేర్వేరు కాబట్టి ఇకపై యుద్ధం తప్పకపోవచ్చు. అది డిఎంకెలా ఉంటుందా? లేదా అన్నదే ఆసక్తి కలిగించే అంశం. అయితే కమిషనర్ల ద్వారా సర్కారు తాను అనుకున్నవి సాధించుకోవచ్చు.
ఆ క్రమంలో బీఆర్‌ఎస్ నుంచి ప్రతిఘటన ఎదురవడం ఖాయం. అయితే ఆ ప్రతిఘటన ఏ స్థాయిలో ఉంటుంది? ఈలోగా బీఆర్‌ఎస్ కార్పొరేటర్లు ఎంతమంది కాంగ్రెస్‌లో చేరతారు అన్న ప్రశ్నలు ఆసక్తికరంగా మారాయి. ఇక మజ్లిస్ భవిష్యత్తులో బీఆర్‌ఎస్‌తో ఎంతవరకూ కలసి ఉంటుందన్నది మరో సందేహం. సహజంగా అధికారంలో ఉన్న పార్టీలతో సత్సంబంధాలు నిర్వహించే మజ్లిస్‌కు, పాతబస్తీలో ప్రాధాన్యం రాజకీయంగా అవసరం. లేకపోతే ఆ పార్టీ ఉనికి ఉండదన్నది బహిరంగ రహస్యం.
ఆ ప్రకారం చూస్తే మజ్లిస్‌కు కాంగ్రెస్‌తో కలసి ఉండటం అనివార్యం. అదే నిజమైతే కార్పొరేషన్‌లో కాంగ్రెస్ బలం పెరగడంతోపాటు, బీఆర్‌ఎస్‌తో బంధానికి తెరపడుతుంది. అదీగాక.. కొత్త అసెంబ్లీ ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్ ఒవైసీ నియమితులైన నేపథ్యంలో.. కాంగ్రెస్-మజ్లిస్ బంధానికి తొలి అడుగులు పడినట్లే.