Suryaa.co.in

Editorial

రోజా యాక్షన్.. జనసేన రియాక్షన్!

– వాలంటీర్లకు పవన్ క్షమాపణ చెప్పాలన్న రోజా
– వారి కాళ్లు కడగాలన్న రోజా అత్యుత్సాహం
– రేపిస్టులు, దొంగలకు క్షమాపణ చెప్పాలా అంటూ జనసైనికుల ఎదురుదాడి
– బాధితుల ఇళ్లకు వెళ్లి ఆ మాట చెప్పాలని రోజాపై ఫైర్
– మహిళలను రేప్ చేసిన ఘటనల మీడియా క్లిప్పింగ్స్ విడుదల చేసిన జనసేన
– వీరికి పవన్ క్షమాపణ చెప్పాలా అని రోజాపై జనసైనికుల వ్యంగ్యాస్త్రాలు
– రేపిస్టులకు మీ పార్టీ మద్దతునిస్తుందా అంటూ ప్రశ్నల వర్షం
– ఆరేళ్ల చిన్నారిపై అత్యాచార యత్నం చేసిన వాలంటీర్లు వైసీపీ ముద్దుబిడ్డలా?
– వితంతులపై లైంగిక వేధింపులకు పాల్పడే వారే మీ పార్టీ వారసులా?
– ఇదే మీ పార్టీ అభిప్రాయమా అంటూ రివర్స్‌లో రోజాపై ట్రోలింగ్స్
– విమర్శలతో మంత్రి రోజా ఉక్కిరిబిక్కిరి
( మార్తి సుబ్రహ్మణ్యం)

పైవారిని మెప్పించేందుకు ఎవరో ఇచ్చిన స్క్రిప్టును చదివితే ఫలితాలు ఒక్కోసారి రివర్సవుతుంటాయి. ఎంచుకునే అంశం తీవ్రత తెలియకుండా మార్కుల కోసం వెంపర్లాడితే, అది ఒక్కోసారి బూమెరాంగవుతుంది. ఆ తర్వాత వెల్లువెత్తే విమర్శలకు తడిసిముద్దవడం తప్ప మరేమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఇరుక్కుపోతారు. ఏపీ పర్యాటక మంత్రి, ఫైర్‌బ్రాండ్ రోజా.. జనసేనాధిపతి పవన్ కల్యాణ్‌పై ప్రదర్శించిన అత్యుత్సాహం, సరిగ్గా ఇలాంటి అనుభవమే మిగిల్చింది. ప్రత్యర్థిని ఇరికించబోయి, తనతోపాటు తన పార్టీని అడ్డంగా ఇరికించిన వైనమిది.

ఏపీలో మహిళలు మాయం కావడానికి, కిడ్నాపులకు గురికావడానికి కొందరు వాలంటీర్లు, వైసీపీ నేతలే కారణమన్న పవన్ ఆరోపణ, అధికార వైసీపీలో కల్లోలం సృష్టించింది. దానితో రంగంలోకి దిగిన మంత్రులు, మాజీ మంత్రులు ‘ఆందోళన రాగం’లో.. పవన్ కల్యాణ్‌పై ‘ఆరోపణల స్వరార్చన’ చేశారు. అందులో మంత్రి రోజా ఒకరు.

ఐదువేల రూపాయల కోసం రాష్ట్ర ప్రజల కోసం రెక్కలు ముక్కలు చేసుకుని, జీవితాలు త్యాగం చేసిన వాలంటీర్లపై ఆరోపణలు చేసిన పవన్.. తక్షణం వారికి క్షమాపణ చెప్పి, వాలంటీర్ల కాళ్లు కడిగి నీళ్లు నెత్తిన చల్లుకోవాలన్నది, రోజక్క జనసేనాధిపతి పవన్ ముందు పెట్టిన ప్రధాన డిమాండ్. దానితోపాటు పనిలోపనిగా, పవన్‌పై తన శైలిలో విమర్శల వర్షం కురిపించారు. రోజక్క విమర్శలను వైసీపీ సోషల్‌మీడియా దళం యధావిధిగా వైరల్ చేసింది.

వెంటనే రంగంలోకి దిగిన జనసైనికులు రోజాకు దిమ్మతిరిగే ప్రశ్నలతో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘‘జగన్‌రెడ్డి ముద్దుబిడ్డలయిన వాలంటీర్లు రాష్ట్రంలో చాలామంది చిన్నారులపై అత్యాచార యత్నం చే శారు. వితంతులకు వేధించారు. ఒంటరి మహిళలను ఎంపిక చేసుకుని మరీ కడుపు చేశారు. ఆడపిల్లలను ఎత్తుకెళ్లారు. పెన్షన్లు కొట్టేశారు. పక్క రాష్ట్రం నుంచి మందుబాటిళ్లు తీసుకువచ్చి అమ్ముతూ పట్టుపడ్డారు. పేకాట క్లబ్‌లు పెట్టి పోలీసులకు చిక్కారు. దొంగవేలిముద్రలేసి మరీ లబ్థిదారుల పథకాల డబ్బు కొట్టేశారు. అంగన్‌వాడీ కార్యకర్తలను రక్తం వచ్చేలా కొట్టారు. కాలేజీకి వెళ్లే అమ్మాయిలపై మత్తుమందు చెల్లి కిడ్నాప్ చేశారు. అలాంటి రేపిస్టులకు మీ పార్టీ మద్దతునిస్తుందా? ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారయత్నం చేసిన వాలంటీర్లు వైసీపీ ముద్దుబిడ్డలా? వితంతులపై లైంగిక వేధింపులకు పాల్పడే వారే మీ పార్టీ వారసులా? మరి అలాంటి వారికి పవన్ క్షమాపణ చెప్పాలని మీరు, మీ అన్న జగన్‌రెడ్డి డిమాండ్ చేస్తున్నారా? ఇవన్నీ మరీ బాధితుల ఇళ్లకు వచ్చి చెప్పే ధైర్యం ఉందా? అసలు ఇది మీ పార్టీ అభిప్రాయమా? రోజక్క వ్యక్తిగత అభిప్రాయమా’’ అని జనసైనికులు, రోజాను సోషల్‌మీడియాలో రిన్ సర్ఫుతో కడిగిపారేస్తున్నారు.ఇది కూడా చదవండి: వామ్మో.. వాలంటీర్లు!

దానితోపాటు.. గత నాలుగేళ్లుగా జగన్ ఏలుబడిలో రాష్ట్రంలో వాలంటీర్ల వల్ల అత్యాచారానికి గురైన మైనర్ బాలికలు, వేధింపులకు గురైన ఒంటరి మహిళలు, కిడ్నాపునకు గురైన బాలికల తలిదండ్రుల ఫిర్యాదులకు సంబంధించిన మీడియా వార్తల క్లిప్పింగులను జత చేస్తున్నారు. దీనితో రోజా అత్యుత్సాహం, ఏకంగా వైసీపీని ఇరికించినట్లయింది. అయ్యవారిని చేయబోతే కోతి అయినట్లు.. జగనన్నను మెప్పించబోయి, పవన్‌పై ఒంటికాలితో లేచిన రోజక్క.. మళ్లీ మాట్లాడలేని పరిస్థితిలో, జనసైనికులు ట్రోలింగ్ యుద్ధాన్ని రక్తికట్టిస్తున్నారు.

మహిళలపై వాలంటీర్లు.. గత నాలుగేళ్లలో జరిపిన అత్యాచారాలను, ఆధారాలతో సహా బయటపెట్టడంతో, వైసీపీ శిబిరం ఉక్కిరిబిక్కిరవుతోంది. అలాంటి అకృత్యాలు, అరాచకాలు, అమానుషానికి పాల్పడిన వాలంటీర్లకు క్షమాపణ చెప్పాలన్న రోజా డిమాండ్.. పవన్‌పై డీజీపీకి ఫిర్యాదు చేసిన వైసీపీ మహిళా నేతలు ఇప్పుడు… ‘డామిట్ కథ అడ్డం తిరిగింది’ అని తలపట్టుకోవలసి వస్తోందట!

LEAVE A RESPONSE