– వీటిలో కర్నూలు, విశాఖకు అనుబంధంగా ప్రాంతీయ ప్రయోగ శాలలు
* రూ.11.12 కోట్లతో నిర్మించిన వీటిని వర్చువల్ గా ప్రారంభించిన మంత్రి సత్యకుమార్ యాదవ్
* మరో 3 నెలల్లో స్టేట్ ల్యాబ్ వినియోగంలోకి తెచ్చేలా చర్యలు
* తద్వారా 13,000 చేరుకోనున్న మందుల నాణ్యతా పరీక్షలు
– త్వరలో ఖాళీ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటామని స్పష్టీకరణ
మంగళగిరి: రాష్ట్రంలో రూ.11.12 కోట్ల వ్యయంతో కొత్తగా నిర్మించిన 11 ఔషధ పరిపాలనా భవనాలు, టెస్టింగ్ ల్యాబ్లను రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ మంగళవారం ప్రారంభించారు. మంగళగిరిలోని వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ కార్యాలయాలను మంత్రి వర్చువల్ విధానంలో ఓపెన్ చేశారు. ప్రారంభమైన వాటిలో విశాఖపట్నం, శ్రీకాకుళం, అమలాపురం, నరసరావుపేట, ఒంగోలు, కావలి, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, మదనపల్లె, కర్నూలులోని పరిపాలనా కార్యాలయాలు ఉన్నాయి. వీటిలో విశాఖ, కర్నూలు కార్యాలయాలకు అనుబంధంగా కొత్తనా నిర్మించిన ప్రాంతీయ ప్రయోగశాలలు కూడా ఉన్నాయి.
43,000 చదరపు అడుగుల్లో జరిగిన వీటి నిర్మాణాలకు రూ.11.12 కోట్ల వరకు వ్యయంచేశారు. ఇవి వినియోగంలోనికి రానున్నందున ఏడాదికి అద్దెల రూపంలో చెల్లించే రూ.15 లక్షల వరకు ప్రభుత్వానికి ఆదా కానుంది. మంత్రి సత్యకుమార్ వీటిని ప్రారంభించిన సమయంలోనే సదరు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు స్థానికంగా ఏర్పాటుచేసిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో కలిపి వీటి నిర్మాణాలు పూర్తిచేసినట్లు చెప్పారు. కొత్తగా ప్రారంభించిన ప్రయోగశాలల్లో రూ.6 కోట్ల వ్యయంతో అత్యాధునిక పరికరాలను సమకూర్చనున్నామన్నారు. తద్వారా మందుల నాణ్యతా పరీక్షల సామర్ధ్యం బాగా పెరుగుతుందన్నారు. ముఖ్యంగా ఉత్తరతీర ప్రాంతం, రాయలసీమలో ప్రాంతీయ ల్యాబులు అందుబాటులోనికి రావడంవల్ల సేకరించిన నమూనాల పరీక్షలకు రవాణ సమయం తగ్గడమే కాకుండా కల్తీ మందులు, కాలం చెల్లిన మందుల నిరోధానికి త్వరగా చెక్ పడుతుందని, అంతే కాకుండా నిఘా వ్యవస్థ మరింత పెరుగుతుందన్నారు.
విస్తృత స్థాయిలో మందుల నాణ్యతా పరీక్షలు
ప్రస్తుతం రాష్ట్రంలో విజయవాడలోని ఔషధ ప్రయోగశాలలో ఏడాదికి 4వేల మందుల నమూనాల నాణ్యతను పరీక్షిస్తున్నట్లు మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. కొత్తగా ప్రారంభమైన ల్యాబ్ ల ద్వారా మరో 3,000 మందుల నమూనాలను పెంచేందుకు అవకాశం ఏర్పడిందని చెప్పారు. విజయవాడలో నిర్మాణంలో ఉన్న రాష్ట్ర స్థాయి ల్యాబ్ మరో మూడునెలల్లో అందుబాటులోనికి వచ్చేందుకు అవకాశం ఉందన్నారు దీనివల్ల అదనంగా మరో 7,000 మందుల నమూనాల (మొత్తం 13వేలు) ను పరీక్షించేందుకు వీలుకలుగుతుందని తెలిపారు.
రోగుల జేబు ఖర్చు తగ్గించడమే లక్ష్యం..
బీసీ కార్పొరేషన్ ద్వారా ప్రతి మండలంలో ఒక జన ఔషధి దుకాణాన్ని ప్రారంభించేందుకు సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారని వెల్లడించారు. వీటికి అనుగుణంగా త్వరలో చర్యలు ప్రారంభం కానున్నాయన్నారు. ప్రభుత్వం తీసుకునే చర్యల ద్వారా వైద్య సేవలు పొందే వారి జేబు నుంచి పెట్టే ఖర్చు తగ్గాలన్నది తమ లక్ష్యమని పేర్కొన్నారు. దీనికి అనుగుణంగా అధికారులు, ఉద్యోగులు విధుల నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలన్నారు.
కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నడిచే అమృత్ ఫార్మసీల ద్వారా గతనెల రెండో వారం వరకు రూ. 17,000 విలువైన ఔషధాలు 50% నుంచి 90% వరకు తక్కువ ధరల మేర విక్రయాలు జరిగాయన్నారు. దీనివల్ల 6.85 కోట్ల మంది రోగులకు రూ.8.500 కోట్ల మేర ఆదా అయిందని తెలిపారు. ప్రస్తుతం ఉన్న అమృత్ ఫార్మసీలను కేంద్ర ప్రభుత్వం పెంచబోతుందని తెలిపారు. వీటి రాకతో రాష్ట్రానికి అధిక ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు.
అవినీతిని సహించేదిలేదు
ఔషధ నియంత్రణ పరిపాలనా శాఖలో ఖాళీగా ఉన్న ఎనలిస్టులు, ఇతర పోస్టులను మెడికల్ సర్వీస్ రిక్రూటుమెంటుబోర్డు ద్వారా చేపట్టనున్నట్లు రాష్ట్ర మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ తెలిపారు రాష్ట్రంలో ఆకస్మికంగా ఏకకాలంలో తనిఖీలుచేస్తే 152కు 148 మందుల దుకాణాల్లో ఏదోఒక లోపం కనిపించిందని వెల్లడించారు. కొందరు విధుల నిర్వహణలో ప్రలోభాలకు లోనవుతున్నారని తెలిసిందని, అవినీతికి పాల్పడే వారిని ఎటువంటి పరిస్థితుల్లో ఉపేక్షించేదిలేదని హెచ్చరించారు.
ఉద్యోగులు, అధికారుల నిర్లక్ష్యంవల్ల మరొకరి ప్రాణం పోకూడదని హితవు పలికారు. మందుల నాణ్యతలో రాజీపడితే జరిగే దుష్ఫలితాలు ఎలా ఉంటాయో గుర్తించి, విధుల నిర్వహణలో జాగ్రత్తగా ఉండాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో ఔషధ నియంత్రణ పరిపాలనా శాఖ డైరెక్టర్ జనరల్ గిరీశా మాట్లాడుతూ కొత్త భవనాలు వినియోగంలోనికి రావడంవల్ల శాఖాపరమైన కార్యకలాపాలు మరింత వేగాన్ని అందుకుంటాయని వెల్లడించారు. రాష్ట్ర ఔషధ నియంత్రణ పరిపాలనా శాఖ డైరెక్టర్ ఎంపీఆర్ ప్రసాద్, ఇతర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.