Suryaa.co.in

Andhra Pradesh

సైనిక్‌ స్కూల్స్‌తో అనుబంధానికి 17 దరఖాస్తులు

దేశంలో రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలో నిర్వహించే సైనిక్‌ స్కూళ్ళతో అనుబంధంగా పని చేయడానికి ఆసక్తి కలిగిన 100 స్కూళ్ళకు అఫిలియేషన్‌ ఇచ్చేందుకు మంత్రిత్వ శాఖ ప్రతిపాదించిన విషయం వాస్తవమేనని రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్‌ భట్‌ సోమవారం రాజ్యసభకు తెలిపారు. వైఎస్సార్సీపీ సభ్యులు వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ రక్షణ శాఖ ప్రతిపాదనలకు అనుగుణంగా సైనిక్‌ స్కూళ్ళతో అనుబంధం కోరుతూ ఆంధ్రప్రదేశ్‌ నుంచి 17 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. ఈ దరఖాస్తులలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంతోపాటు వివిధ ప్రైవేట్‌, ట్రస్టు, సొసైటీలకు చెందిన విద్యా సంస్థలు ఉన్నాయని చెప్పారు. సైనిక్‌ స్కూళ్ళతో అనుబంధం కావడానికి అవసరమైన అర్హతలు ఉన్న దరఖాస్తులను ఇంకా పరిశీలించాల్సి ఉందని అన్నారు. అఫిలియేషన్‌ కావడానికి అర్హత కలిగిన స్కూళ్ళ దరఖాస్తులను పరిశీలించి ఆమోదించిన తర్వాత ఆయా స్కూళ్ళతో సైనిక్‌ స్కూళ్ళ సొసైటీ ఎంవోయూ చేసుకుంటుందని తెలిపారు.

LEAVE A RESPONSE