వచ్చే ఎన్నికల్లో 175 సీట్లు సాధించాలని వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ మేరకు బుధవారం తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఆయన పార్టీ ఎమ్మెల్యేలు, రీజనల్ కో ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గ ఇంచార్జీలతో గడపగడపకు మన
ప్రభుత్వం కార్యక్రమంపై జరిగిన వర్క్ షాప్‌లో జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆయన పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
ఈ సమావేశంలో జగన్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో 175కు 175 సీట్లు సాధించాల్సిందేనని ఆయన తెలిపారు. ఇదే లక్ష్యంగా మనం సాగాలన్న జగన్…ఇదేమీ కష్టం కాబోదని కూడా చెప్పారు. కుప్పం మునిసిపాలిటీలో మనం
గెలుస్తామని అనుకున్నామా? అని ఆయన ప్రశ్నించారు. ఎంపీటీసీలు, జడ్పీటీసీలను క్లీన్ స్వీప్ చేస్తామని అనుకున్నామా? అని కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఈ మాదిరిగానే కష్టపడితే వచ్చే ఎన్నికల్లో 175 సీట్లు సాధించగలుగుతాం అని ఆయన పేర్కొన్నారు.
గడపగడపకు మన ప్రభుత్వం అనేది నిరంతర కార్యక్రమమని జగన్ చెప్పారు. దాదాపుగా 8 నెలల పాటు ఈ కార్యక్రమం కొనసాగుతుందని ఆయన తెలిపారు. ఒక్కో సచివాలయానికి రెండు రోజులు కేటాయించాలని చెప్పిన జగన్.. నెలలో 20 రోజుల చొప్పున 10 సచివాలయాలల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. ఇకపై నెలకోమారు ఈ తరహా సమీక్ష నిర్వహిస్తామని ఆయన తెలిపారు. గడపగడపకు మన ప్రభుత్వంలో వచ్చిన స్పందనపై సమీక్షలో చర్చిద్దామని జగన్ పేర్కొన్నారు. ప్రజల వినతులు, వాటి పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగుదామంటూ ఆయన పిలుపునిచ్చారు.
గడప గడపకు మన ప్రభుత్వం వర్క్ షాప్ విజువల్స్. #CMYSJagan #GadapaGadapakuManaPrabhutvam pic.twitter.com/Y2Z5EYAQy4
— YSR Congress Party (@YSRCParty) June 8, 2022