-సీఎం జగన్ ఆదేశాలతో గ్రామగ్రామానికి వైద్య వసతులు
-అన్ని రకాల మందులు, వైద్య పరికరాలు అందుబాటులోకి
-రోగం వస్తే భయపడే రోజులు పోయాయి
-ఆరోగ్యశ్రీ ద్వారా అన్ని రోగాలకు ఉచితంగా చికిత్స
-రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని
-గుంటూరులో రెండు యూపీహెచ్‌సీల ప్రారంభోత్సవం
రాష్ట్రంలో ప్రాథమిక వైద్య విభాగాన్ని బలోపేతం చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఏకంగా రూ.2500కోట్లు ఖర్చు చేస్తున్నారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని తెలిపారు. గుంటూరులోని సంజయ్‌గాంధి కాలనీ, బృందావన్ గార్డెన్స్ లలో మంగళవారం రెండు అర్బన్ హెల్త్ సెంటర్లను ప్రారంభించారు. రెండు చోట్ల మంత్రి విడదల రజిని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి విడదల రజిని మాట్లాడుతూ గుంటూరులో నూతనంగా ప్రారంభించుకున్న రెండు యూపీహెచ్‌సీలకు ఒక్కో ఆస్పత్రికి రూ.కోటి చొప్పున రూ.2 కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు. రాష్ట్రంలో వైద్య విభాగంలో తీసుకొస్తున్న గొప్ప మార్పుల్లో భాగంగా ఈ ఆస్పత్రులను కొత్తగా నిర్మించినట్లు చెప్పారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా 344 కొత్త యూహెచ్‌సీలను రూ.348.36 కోట్ల ఖర్చుతో నిర్మిస్తున్నామని తెలిపారు. మరో 184 పీహెచ్‌సీలను రూ.18.40 కోట్ల ఖర్చుతో ఆధునికీకరిస్తున్నామని చెప్పారు. మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా 560 యూహెచ్‌సీలను ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తున్నామని అందుకోసం రూ.366.67కోట్ల రూపాయలు ఖర్చుచేస్తున్నామని వివరించారు.
కొత్త పీహెచ్‌సీలు, వైఎస్సార్ హెల్త్ క్లినిక్‌లు
గ్రామగ్రామానికి, వార్డు వార్డుకు మెరుగైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో జగనన్న కృషి చేస్తున్నారని మంత్రి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా రూ.253.95 కోట్ల ఖర్చుతో 148 పీహెచ్‌సీలను కొత్తగా నిర్మిస్తున్నామని తెలిపారు. రూ.407.60 కోట్ల ఖర్చుతో 977 పీహెచ్‌సీలను ఆధునికీకరిస్తున్నామన్నారు. మొత్తం 1145 పీహెచ్‌సీల కోసం రూ.661.55 కోట్లు ఖర్చుచేస్తున్నట్లు తెలిపారు. 10032 వైఎస్సార్ హెల్త్ క్లినిక్‌లను రూ.1500 కోట్లకు పైగా ఖర్చుతో ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తున్నామని తెలిపారు. ఇకపై రాష్ట్ర వ్యాప్తంగా అన్ని యూపీహెచ్‌సీలు, పీహెచ్‌సీలల్లో 64 రకాల వైద్య పరీక్షలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. 175 రకాల ఔషధాలు రోగులకు ఉచితంగా అందజేస్తారని వెల్లడించారు.
ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కొత్తగా 16 మెడికల్ కళాశాలలు నిర్మిస్తున్న ఘనత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికే దక్కుతుందన్నారు. ఎమ్మెల్యే మద్దాళి గిరి మాట్లాడుతూ వైద్య ఆరోగ్యశాఖలో జగనన్న విప్లవాత్మకమార్పులు తీసుకొచ్చారని తెలిపారు. మేయర్ కావటి శివనాగమనోహర్‌నాయుడు మాట్లాడుతూ నగరంలో మొత్తం 16 యూపీహెచ్‌సీలు కొత్తగా నిర్మిస్తున్నామన్నారు. 10 యూపీహెచ్‌సీలు ఇప్పటికే సిద్ధమయ్యాయని తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ వేణుగోపాల్‌రెడ్డి, నగర కమిషనర్ చేకూరి కీర్తి, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.