Suryaa.co.in

Andhra Pradesh

3 జిల్లాల్లో పెట్రోల్ బంకుల్లో తూనికలు కొలతలు శాఖ దాడులు 29కేసులు నమోదు

• విజయవాడ,విశాఖపట్నం నగరాల్లోని వివిధ మాల్స్ లో దాడులు 156 కేసులు
• చౌకధరల దుకాణాలపై దాడులు 45 కేసులు నమోదు
• ధాన్యం కొనుగోలుకుగాను రైతులకు ఇంకా 300 కోట్ల రూ.లు చెల్లించాలి
• సియం యాప్ ద్వారా వివిధ నిత్యావసర సరుకుల ధరల మానిటరింగ్ చేస్తున్నాం
• అధిక ధరలకు విక్రయించే వారిపై రానున్న రోజుల్లో మరిన్ని దాడులు చేస్తాం
– రాష్ట్ర పౌరసరఫరాల శాఖామాత్యులు కారుమూరి వెంకట నాగేశ్వరరావు

అమరావతి,14 సెప్టెంబరు:రాష్ట్రంలోని పల్నాడు,తిరుపతి,బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లోని వివిధ పెట్రోల్ బంకుల్లో తూనికలు కొలతల శాఖ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించి అక్రమాలకు సంబంధించి 29 కేసులను నమోదు చేయడం జరిగిందని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖామాత్యులు కారుమూరి వెంకట నాగేశ్వరరావు వెల్లడించారు.

బుధవారం అమరావతి సచివాలయం నాల్గవ బ్లాకు ప్రచార విభాగంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పెట్రోల్ బంకుల్లో అక్రమాలను నియంత్రించేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్టు స్పష్టం చేశారు.ఇప్పటికే పల్నాడు,తిరుపతి,బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లోని వివిధ పెట్రోల్ బంకుల్లో పలు అక్రమాలకు సంబంధించి తూనికలు కొలతలు శాఖ అధికారులు దాడులు నిర్వహించి 29 కేసులను నమోదు చేసి 70వేల రూ.ల నుండి 3లక్షల వరకూ అఫరాధ రుసుం విధించడం జరిగిందని తెలిపారు.<

ఈ విధంగా కేసులు నమోదు చేసిన బంకులు మరలా అక్రమాలకు పాల్పడితే ఆబంకుల నిర్వాహకులపై కేసులు నమోదు చేసి కోర్టుకు అప్పగించడం జరుగుతుందని మంత్రి నాగేశ్వరరావు స్పష్టం చేశారు.మిగతా 23 జిల్లాలల్లో ఆరు మాసాల లోగా అన్ని పెట్రోల్ బంకుల్లో తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.

అదే విధంగా విజయవాడ,విశాఖపట్నం నగరాల్లోని పలు మాల్స్ పై తనిఖీలు చేపట్టి 156 కేసులు నమోదు చేయడం జరిగిందని మంత్రి నాగేశ్వరరావు మీడియాకు వివరించారు. మిగతా పట్టణాల్లో కూడా పెద్దఎత్తున తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. తూనికలు కొలతలు శాఖలో సిబ్బంది కొరతను అధికమించేందుకు 15 మంది సబ్ ఇన్స్పెక్టర్లను డిప్యుటేషన్ పై ఇవ్వాలని కోరామని ఆదస్త్రం ముఖ్యమంత్రి వర్యుల సర్కులేషన్లో ఉందని వారు వస్తే తూనికలు కొలతల శాఖ ఆధ్వర్యంలో మరిన్ని విస్త్రత తనిఖీలకు అవకాశం కలుగుతుందని చెప్పారు.

సియం యాప్ ద్వారా రాష్ట్రంలోని స్థానిక మార్కెట్లు,రైతు బజారులు తదితర మార్కెట్లలో వివిధ నిత్యావసర సరుకుల ధరలను నిరంతరం పర్యవేక్షించడం జరుగుతోందని మంత్రి నాగేశ్వరరావు వెల్లడించారు.వివిధ నిత్యావసర వస్తువులు,ఇతర వస్తువుల ధరల పెరుగుదల నియంత్రంణలో ఎపి మిగతా రాష్ట్రాల కంటే ముందంజలో ఉందని పేర్కొన్నారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి రైతులకు ఇంకా 300 కోట్ల రూ.లు చెల్లించాల్సి ఉందని ఆనిధులను త్వరితంగా చెల్లించేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోందని మంత్రి చెప్పారు.తెలంగాణా నుండి రాష్ట్రానికి పౌరసరఫరాల శాఖకు 600 కోట్ల రూ.లు రావాల్సి ఉందని ఆనిధులను ఇచ్చేందుకు తెలంగాణా రాష్ట్రం ఒప్పుకున్నట్టు మంత్రి పేర్కొన్నారు.

సమావేశంలో రాష్ట్ర తూనికలు కొలతలు శాఖ సంయుక్త కంట్రోలర్ రామ్ కుమార్ మాట్లాడుతూ మూడు జిల్లాల్లోని పెట్రోల్ బంకుల్లో కొన్ని సాంకేతిక పారామీటర్ల ప్రకారం తనిఖీలు నిర్వహించడం జరిగిందని తెలిపారు.మిగతా 23 జిల్లాల్లో ఆరు మాసాల్లోగా తనిఖీలు పూర్తి చేయడం జరుగుతుందని చెప్పారు.అలాగే వివిధ షాపింగ్ మాల్స్ పై దాడులు నిర్వహించి ధరల వ్యత్యాసం,క్వాలిటీ,క్వాంటిటీ వంటి అంశాల్లో వ్యత్యాసాలపై తేడాలుంటే తగిన కేసులు నమోదు చేసి ఫైన్ వేయడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.

ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మూడుప్రాంతాలు సమానాభివృద్ధి జరగాల్సిందే
గతంలో అభివృద్ధి అంతా హైదరాబాదుకే పరిమితం కావడంతో రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్ అన్ని విధాలా అభివృద్ధి పరంగా వెనుకబడిపోయిందని అలాంటి పరిస్థితి మరలా పునరావృతం కాకూడదనే ముందు చూపుతో రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి మూడు ప్రాంతాలు సమానంగా అభివృద్ధి కావాలనే మూడు రాజధానులకు శ్రీకారం చుట్టారని రాష్ట్ర పౌరసరఫరాల శాఖామాత్యులు కారుమూరి వెంకట నాగేశ్వరరావు స్పష్టం చేశారు.
అమరావతే ఏకైక రాజధానిగా ఉండాలని అమరావతి ప్రాంత రైతులు అమరావతి నుండి అరసవిల్లి వరకూ పాదయాత్ర చేయడం మూడు ప్రాంతాల సమగ్రాభివృద్ధిని అడ్డుకోవడమేనని అలా జరిగితే హైదరాబాదు మాదిరిగానే అభివృద్ధి అంతా ఒకేచోట కేంద్రీకృతమై మరలా ప్రాంతీయ విబేధాలు ఏర్పడతాయని అన్నారు.అందుకే అటువంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ఉండేందుకు ఈప్రభుత్వం మూడు రాజధానుల ఏర్పాటుకే కట్టుబడి ఉందని మూడు ప్రాంతాలకు సమాన అవకాశాలు,అభివృద్ధి కల్పించేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని మంత్రి నాగేశ్వరవు స్పష్టం చేశారు.

LEAVE A RESPONSE