Suryaa.co.in

Andhra Pradesh

వీధుల్లో ఎందుకు? పోలవరంపై అసెంబ్లీలోనే చర్చిద్దాం రా! బాబూ..!!

– సవాళ్ళు విసిరి పారిపోవడం బాబు నైజం
– శాసనసభకు హాజరుపై బాబుకో పాలసీ.. టీడీపీకో పాలసీనా..!?
– జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు

మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ.. ఏమన్నారంటే…డయాఫ్రం వాల్ దెబ్బతినడంపై చర్చిద్దాం అసెంబ్లీకి రా! బాబూ..!! రేపటి నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్న సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు శాసనసభకు రావాల్సిందిగా, చర్చలో పాల్గొవాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకలా కోరుతున్నాను అంటే.. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్ట్‌ విషయంలో డయాఫ్రం వాల్‌ దెబ్బతిని నిర్మాణం కుంటుపడింది. పోలవరంలో డయాఫ్రం వాల్‌ దెబ్బతినడానికి ప్రధానమైన కారణం చంద్రబాబు నాయుడు, ఆయన హయాంలో జరిగిన చారిత్రక తప్పిదాలు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అవివేకమైన నిర్ణయాలు తీసుకోవడం వల్లే డయాఫ్రం వాల్‌ దెబ్బతినడం, ప్రాజెక్ట్‌ నిర్మాణం కుంటుపడటంతో పాటు వేలకోట్ల రూపాయిల నష్టం జరిగిందని చెబుతున్నాం.

అసెంబ్లీకి రాకుండా, చంద్రబాబు నాయుడు మినీ మహానాడులోనో, ప్రెస్‌మీట్లలోనో, ఎక్కడైనా పార్టీ మీటింగులు జరుగుతున్నప్పుడో.. డయాఫ్రం వాల్‌ దెబ్బతినడానికి వైయస్సార్‌ సీపీ ప్రభుత్వం కారణం అని, దీనిపై చర్చకు సిద్ధమా? అని సవాల్‌ విసిరాడు. దీనిపై మేము చర్చకు సిద్ధమని, దమ్ముంటే శాసనసభకు రా.. చర్చిద్దామని చెబితే మళ్ళీ ఉలుకూపలుకూ లేదు. టీడీపీ హయాంలో ఇరిగేషన్‌ మంత్రిగా పనిచేసిన దేవినేని ఉమ చర్చకు సిద్ధమని, దానికోసం తాడేపల్లికి రమ్మంటారా? పోలవరం రమ్మంటారా? అంటూ ప్రగాల్భాలు పలికారు.

భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజా సమస్యలు చర్చించడానికి కేంద్రంలో పార్లమెంట్‌, రాష్ట్రాల్లో శాసన సభలు ఉన్నాయి. అక్కడ ప్రజా సమస్యలపై చర్చ జరుగుతుంది. చర్చకు సిద్ధమా అని ప్రగల్భాలు పలికిన చంద్రబాబు నాయుడు.. చర్చకు రండి అని ఆహ్వానిస్తున్నా. దీనిపై శాసనసభలో సుదీర్ఘంగా చర్చిద్దాం. తాను ముఖ్యమంత్రి అయితే తప్ప శాసనసభకు రానని చంద్రబాబు… అదేదో చంద్ర శపథం చేశారు కదా? అని అనవచ్చు, అసలు చంద్రబాబుకు ఏనాడైనా మాట మీద నిలబడే అలవాటు ఎక్కడ ఉందని అడుగుతున్నాం.

శాసనసభకు హాజరుపై బాబుకో పాలసీ.. టీడీపీకో పాలసీనా..!
శాసనసభకు రానన్న చంద్రబాబు… సభా ప్రాంగణంలోకి వచ్చారు. దేనికి వచ్చారు? అంటే, రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేసిన ద్రౌపది ముర్ముకు ఓటు వేయడానికి వచ్చారు. చంద్రబాబు సభలోకి ఏమీ రాలేదుకదా… కేవలం ప్రాంగణంలోకి వచ్చారని మీ పార్టీ వాళ్లే మాట్లాడుతున్నారు. వాటీజ్‌ యువర్‌ పాలసీ? శాసన సభకు రానని ప్రతిజ్ఞ చేసిన చంద్రబాబుకు ఒక పాలసీ, మీ పార్టీకి మరో పాలసీ ఉంటుందా? మీరు మాత్రం అసెంబ్లీకి రారు. మీ శాసన సభ్యులంతా వస్తారు? మీకో పాలసీ, మీ పార్టీ నాయకులకు మరో పాలసీనా..? ఇటువంటి దిక్కుమాలిన పాలసీ ఎక్కడన్నా ఉంటుందా.. అని సూటిగా ప్రశ్నిస్తున్నా.

సమావేశాలు బహిష్కరించమని మేము అనడం లేదు. రావద్దని చెప్పడం లేదు. చంద్రబాబు నాయుడేమో సభను బహిష్కరిస్తారు. అచ్చెన్నో, బుచ్చన్నో వచ్చి సభలో ఏదో ఒక గందరగోళం చేసి సమావేశాలకు అంతరాయం కల్పించడం అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిసారీ ఒక తంతుగా మారుతోంది. పోలవరం ప్రాజెక్ట్‌పై బయట మీరు చేస్తున్న సవాల్‌పై చర్చకు.. ఒకసారి అసెంబ్లీకి రండి. చర్చిద్దాం. ప్రజలకు వాస్తవాలు వివరిద్దాం. శాసన సభ వేదికగా చర్చిద్దాం తప్ప, ఆ చెట్టుకిందో… తాడేపల్లిలోనో… కరకట్ట పక్కన మీ ఇంట్లోనో… పోలవరం డ్యామ్‌ మీదో చర్చిద్దామనే చేతగాని కబుర్లు చెప్పే కార్యక్రమం మాని శాసనసభకు వస్తే చర్చిద్దామని మనవి చేస్తున్నాం.

అప్పటి ఇరిగేషన్‌ మంత్రి దేవినేని ఉమ శాసనసభకు వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే ఆయన సభకు వెళ్లే అర్హతను కోల్పోయేలా ప్రజలు తీర్పు ఇచ్చారు. మరి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు అసెంబ్లీకి రావచ్చు కదా. టీడీపీ ప్రభుత్వ హయాంలో పోలవరం ప్రాజెక్ట్‌ను 80శాతం పూర్తి చేశామని గొప్పలు చెప్పుకునే మీరు సభకు వచ్చి, మీరు విసిరిన సవాల్‌పై చర్చించవచ్చు కదా. ఎందుకు పారిపోతారు..?. జగన్‌ మోహన్‌ రెడ్డి వల్ల పోలవరం ప్రాజెక్ట్‌ నాశనం అయిపోతుందనే మాటలు మాట్లాడి ప్రజల్లో అభద్రతా భావాన్ని, గందరగోళాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు.

పోలవరంపై జగన్‌ మోహన్‌ రెడ్డి చేతులెత్తేశాడని, అంబటి రాంబాబు పోలవరం ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేకపోతున్నాడనే మాటలు మాట్లాడుతున్నారు కదా. పోలవరం ఆలస్యమవడానికి కారణం ఎవరో, ఎవరు చేతులు, కాళ్లు ఎత్తారో, 2018కి పోలవరం ప్రాజెక్ట్‌ పూర్తి చేస్తామని ప్రగల్భాలు పలికిన మీ ప్రభుత్వం 2018కి పూర్తి చేయకుండా ఎందుకు చేతులెత్తిందో, కాఫర్‌ డ్యామ్‌ లు పూర్తికాకుండా డయాఫ్రం వాల్‌ కట్టి చరిత్రాత్మకమైన తప్పిదం చేసి సుమారు రెండు నుంచి 3వేల కోట్లు నష్టం జరిగేలా వ్యవహరించింది మీరు కాదా?.. వీటన్నింటిపైనా చర్చిద్దాం రండి. సభకు రాకుండా వీధుల వెంట తిరుగుతూ నోటికొచ్చినట్లు మాట్లాడటం సరికాదు.

రాష్ట్రానికి ప్రధాన ప్రతిపక్ష నాయకుడి హోదాలో చంద్రబాబు నాయుడును ప్రజలు నిలబెట్టారు. మీరు అసెంబ్లీకి వచ్చి ఈ అంశంపై చర్చలో పాల్గొనండి. డయాఫ్రం వాల్‌ కొట్టుకుపోవడానికి, తద్వారా వేలకోట్లు నష్టం జరగడానికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, ఇరిగేషన్‌ మంత్రి తీసుకున్న అవివేకమైన నిర్ణయాల వల్లే అని ప్రజలకు తేటతెల్లంగా అర్థం అవుతుంది. అందువల్లే నిర్మాణపు పనులు కుంటుపడటంతో, ఎప్పుడు పూర్తవుతుందో తేదీని చెప్పలేకపోతున్నాము, సమయం వచ్చినప్పుడు స్పష్టంగా చెబుతాం. ఉన్నది ఉన్నట్లుగానే చెబుతాం తప్ప, మసిపూసి మారేడుకాయ చేయవలసిన అవసరం మా ప్రభుత్వానికి లేదు. మేమేమీ సవాల్‌ చేయడం లేదు. సభకు వచ్చి ఇలాంటి సమస్యల మీద చర్చించి మీ బాధ్యతను నిర్వహించండి… లేకుంటే చేతులెత్తేయండి.

రియల్ ఎస్టేట్ పీపుల్ పాదయాత్ర
రెండో అంశానికి వస్తే… అమరావతి భూముల పరిరక్షణ పాదయాత్ర. ఈ పాదయాత్ర ఎందుకో అర్థం కావడం లేదు. అమరావతి గురించి అనేక సందర్భాల్లో చర్చలు జరిగాయి. గతంలో న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకూ పాదయాత్ర చేశారు. అది అయిపోయింది. ఇది రెండోది.. అమరావతి నుంచి అసరవల్లి వరకూ పాదయాత్ర అట. ఇది ప్రజల కోసం చేస్తున్న పాదయాత్ర కాదే… ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించడానికి జరుగుతున్న పాదయాత్ర. రియల్‌ ఎస్టేట్‌ పీపుల్‌ చేస్తున్న పాదయాత్ర. రెండు చేతులతో సంపాదించుకోవాలనే భావనతో జరుగుతున్న పాదయాత్ర.

క్యాపిటల్ స్కాంకు పునాది వేసింది బాబే..
అమరావతి రాజధాని మీద గతంలో ఎంతోమంది విమర్శలు చేశారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత, అమరావతిలో రాజధాని పెట్టాలని, అక్కడ పెద్దఎత్తున భూములు కొనుగోళ్ళు చేసి, తద్వారా రాష్ట్రంలో ఒక పెద్ద ల్యాండ్ స్కామ్‌, క్యాపిటల్ స్కామ్ కు పునాది వేసింది చంద్రబాబు నాయుడు. అమరావతి అనేదే పెద్ద కుంభకోణం.

పూర్వం చీఫ్‌ సెక్రటరీగా పనిచేసిన ఐవైఆర్‌ కృష్ణారావు… ఇప్పుడు ఆయన బీజేపీలో ఉన్నారు. ఆయన ‘ఎవరి రాజధాని అమరావతి’అనే పుస్తకాన్ని రాశారు. దాన్ని ఎవరు ఆవిష్కరించారో గుర్తుందా? ఆ పుస్తకాన్ని జనసేన నాయకుడు పవన్‌ కల్యాణ్‌ ఆవిష్కరించారు. దానికి సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్‌ పార్టీ నాయకులంతా హాజరై… అక్కడ ఏమి ఉపన్యాసాలు చెప్పారో ఒక్కసారి యూట్యూబ్ వీడియోల్లోకి వెళ్ళి చూడండి. వికేంద్రీకరణే ప్రధాన లక్ష్యంగా రాష్ట్ర రాజధాని ఏర్పడాలని, నాడు ఆ వేదికపై నుంచి చెప్పిన మీరు… ఇవాళ పాదయాత్రలో పాల్గొని డప్పులు కొడుతున్నారే. ఇది న్యాయమేనా, ధర్మమేనా అని వామపక్షాలను, మిగతా పార్టీలను అడుగుతున్నాం. రేపో మాపో పవన్‌ కల్యాణ్‌ కూడా ఈ పాదయాత్రలో చొరబడతాడేమో. అయ్యా.. పవన్‌గారు పుస్తకావిష్కరణ సందర్భంగా మీరు మాట్లాడిన మాటలు గుర్తుకు తెచ్చుకుంటే మంచిది. అప్పుడు మీరుమాట్లాడిన మాటలకు సమాధానం చెప్పి, ఆ తర్వాతే పాదయాత్రకు మద్దతు పలకాలని డిమాండ్‌ చేస్తున్నాం. ఈ ద్వంద వైఖరితో ప్రజలు నమ్మరని చెప్పదలచుకున్నాం.

ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చెందిన అసైన్డ్ భూములను నారాయణ అండ్ కో దోచుకోలేదా..?
అమరావతి పాదయాత్రలో ఒక్క రైతు అయినా ఉన్నాడా? అంతా బలిసిన బాపతే. పాదయాత్రలో సామాన్య జనాలు ఎవరైనా ఉన్నారా? అసైన్డ్‌ భూముల విషయంలో పాదయాత్ర చేస్తున్నవారు. ఎవరెవరు, ఎంతెంత స్కామ్‌ లు చేశారో తెలిసిందే కదా. ఎస్టీ, ఎస్టీ, బీసీలకు ప్రభుత్వం అసైన్డ్‌ భూములు ఇస్తుంది.
రాజధాని ప్రాంతంలో వారు పండించుకుంటున్న అసైన్డ్‌ భూములకు డబ్బులు ఇవ్వరని, ప్రభుత్వం ఉచితంగా లాక్కుంటుందని ప్రచారం చేసి, చివరికి మాజీ మంత్రి నారాయణ, ఆయన బంధువులు, తాబేదారులు అంతా కలసి అసైన్డ్‌ భూములన్నింటిని తక్కువ ధరకు పేదల దగ్గర నుంచి లాగేసుకుని, ఆ తర్వాత చట్టాలు మార్చుకుని, వాటిని ప్రభుత్వానికి ఇచ్చి ప్రతిగా విలువైన ప్లాట్లు పొందారే? ఇది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను మోసం చేసినట్లు కాదా అని అడుగుతున్నాం. ఇది ధనికుల రాజధానిగా, డబ్బున్న రాజధానిగా క్రియేట్‌ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు.

అమరావతి రాజధాని ఎక్కడికీ పోలేదు
అమరావతి రాజధాని ఎక్కడకు పోయింది… ఇక్కడే ఉంది కదా? నేనేమీ అమరావతి రాజధానికి వ్యతిరేకం కాదు. అమరావతితోపాటు మిగతా ప్రాంతాలైన రాయలసీమ, ఉత్తరాంధ్ర కూడా సమంగా అభివృద్ధి చెందాలన్నదే మా విధానం. రాయలసీమకు సంబంధించిన శ్రీబాగ్‌ ఒప్పందం ఏంటి? చరిత్రలో ఇవన్నీ మర్చిపోతున్నారా? చంద్రబాబు నాయుడు ఒక వర్గానికి మాత్రమే లబ్ధి చేకూరేలా రాజధానిని అమరావతిలో పెట్టి రియల్‌ ఎస్టేట్‌ పీపుల్‌ బాగా సంపాదించుకోవడానికి అవకాశం ఇచ్చేలా జరుగుతుంది.

మీరు ఎన్ని పాదయాత్రలు చేసినా వికేంద్రీకరణే మా లక్ష్యం. మూడు ప్రాంతాల ప్రజలు మెచ్చుకునేలా ఉండాలి. భవిష్యత్‌లో మూడు ప్రాంతాల మధ్య విభేదాలు రాకుండా ఉండాలి. పూర్వపు రాజధాని హైదరాబాద్‌లో జరిగిన విధంగా, సంపద అంతా అమరావతిలో పెట్టేస్తే, మిగతా ప్రాంతాల అభివృద్ధి సంగతేంటి? అన్ని ప్రాంతాలు సమానంగా ఉంచాలని మేము నిర్ణయం తీసుకుంటే తప్పా? శాసనసభ ఇక్కడే ఉంటుంది కదా? గజం యాభై వేలు, లక్ష అయింది కదా? అదే అమరావతి శాసన రాజధాని అయితే గజం ముప్పైవేలు అవుతుంది సంతృప్తి పడండి. అలా కాకుండా ఉత్తరాంధ్ర, రాయలసీమ అభివృద్ధి చెందకూడదని, అంతా మాకే కావాలనే దురాలోచనతో చేస్తున్న పాదయాత్ర ఇది.

ఏడుకొండలస్వామి మిమ్మల్ని క్షమించడు
పాదయాత్రతో పాటు రథం మీద వెంకటేశ్వరస్వామిని ఊరేగిస్తూ తీసుకువెళుతున్నారు. డబ్బులు సంపాదించుకోవాలనే దొంగలు, ప్రజల మీద ప్రేమ లేనివాళ్లు… ఆఖరికి ఏడుకొండల వెంకన్నను కూడా అడ్డం పెట్టుకుని కుట్రలు చేసే మిమ్మల్ని చివరికి ఆ స్వామి కూడా క్షమించడు. దీనికి తగుదునమ్మా అని చంద్రబాబు నాయుడు అండ. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 దానికి స్పాన్సర్డ్‌ చేస్తూ పాదయాత్ర అద్భుతంగా జరుగుతుందంటూ రోజూ ఫ్రంట్‌ పేజీలో కథనాలు వేస్తున్నారు. కథలు చెప్పి హైప్‌ తీసుకువచ్చి ఏదో చేయాలనుకోవడం సరికాదు. ప్రాంతీయ విభేదాలు సృష్టించి, అమరావతి మోతుబరులు చేస్తున్న ఈ ప్రయత్నాన్ని రాష్ట్ర ప్రజలు తిప్పికొడతారు. అది ప్రజల ఉద్యమం కాదు.. అదొక ఫేక్ మూమెంట్..రియల్ ఎస్టేట్ వాళ్ళు ఎప్పుడు డబ్బులు ఖర్చు పెట్టకపోతే అప్పుడు ఆగిపోతుంది. దానికి, రైతుల వేషం ఎందుకు.. పచ్చ చొక్కాలేసుకొని చేయవచ్చుగా..!

అదొక ఫేక్ మూమెంట్..
మీడియా ప్రశ్నలకు సమాధానం ఇస్తూ..
అయ్యన్నపాత్రుడికి వయసు పెరిగింది. బుర్ర పోయింది. ఏమి మాట్లాడుతున్నాడో అర్థం కాదు. బూతుల తప్ప రెండోది మాట్లాడడు. అయ్యన్నపాత్రుడు లాంటి చీప్‌ క్యారెక్టర్‌ గురించి మాట్లాడి నేను దిగజారదలచుకోలేదు. ఆయనది నోరా.. ఇంకోటా? అదేమంటే మామీద విరుచుకుపడతాడు. అయ్యన్నపాత్రుడు అయినా, మరో ఎవరి పాత్రుడు అయినా వాస్తవాలకు దగ్గరగా మాట్లాడితే మంచిది.
మూడు రాజధానులే మా ప్రభుత్వ పాలసీ. వికేంద్రీకరణే మా లక్ష్యం. ఇందులో ఎటువంటి సందేహం లేదు. పరిపాలన, అభివృద్ధి ఒకేచోటే కేంద్రీకృతమై ఉండకూడదని, వికేంద్రీకరణ చేయాలి అన్నదే మా విధానం. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని… రాయలసీమ, ఉత్తరాంధ్రా, కోస్తాలో సమానంగా అభివృద్ధి చేయాలని, భవిష్యత్‌లో ఏ ప్రాంతం అభివృద్ధి చెందలేదనే భావన ప్రజలకు కలగకూడదు. భవిష్యత్‌లో ప్రాంతీయ ఉద్యమాలు, ప్రాంతీయ విభేదాలు రాకూడదనేలా చేస్తున్న నిర్ణయాలే తప్ప, ఏదో ఒక వర్గాన్ని పోషించడానికో లేదా ధనికుల్ని, రియల్‌ ఎస్టేట్‌ వారిని పోషించడానికో రాజధాని పెట్టకూడదు.
జస్టిస్‌ శ్రీకృష్ణ కమిటీ ఏం నివేదిక ఇచ్చింది? నిపుణులు ఏం చెప్పారు, చంద్రబాబు ఏం చేశాడనేది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఇవాళ సానుభూతి కోసం పాదయాత్ర అంటూ.. డబ్బులు ఖర్చుపెట్టి జనాల్లోకి వెళ్లి ఈనాడు, ఆంధ్రజ్యోతిలో రాసేసుకుంటే అది మహా ఉద్యమం అయిపోతుందా? పేపర్‌లో రాస్తే అది ఉద్యమం అవుతుందా? అది పేపర్‌ ఉద్యమమే అవుతుంది తప్ప…. మహా ఉద్యమం కాదు, ప్రజల ఉద్యమం కాదు. రాజధాని ఉద్యమం అంతకంటే కాదు.. అది ఒక మోసపు ఉద్యమం. ఫేక్‌ మూవ్‌మెంట్‌. ఎప్పుడు రియల్‌ ఎస్టేట్‌ పీపుల్‌ డబ్బులు ఖర్చుపెట్టకపోతే అప్పుడు ఆ ఉద్యమం ఆగిపోతుంది.
ఇటువంటి యాత్రల వల్ల ప్రాంతాల మధ్య విభేదాలు రెచ్చగొట్టే పరిస్థితి వస్తుంది. ఇది ఆంధ్రప్రదేశ్‌ రాజకీయ ఆరోగ్యానికి మంచిది కాదు. దుష్ట చతుష్టయంతో పాటు అప్పట్లో అమరావతి రాజధానిని వ్యతిరేకించినవాళ్లు మరో వేషంలో కనిపిస్తున్నారు? ఇదేమీ దుర్మార్గం. దీనికి సమాధానం చెప్పకుండా పాదయాత్రలో పాల్గొంటే ప్రజలు హర్షించరు. ఇది కృత్రిమమైన ఉద్యమం. ఆకు పచ్చ కండువాలు కప్పుకుని రైతుల వేషంలో వస్తున్నారు.. నేరుగా పసుపు పచ్చ చొక్కాలు వేసుకోవచ్చుకదా..
స్వార్థపరులు చేస్తున్న యాత్రే ఈ పాదయాత్ర. నిజమైన రైతు పేరు ఒక్కరిది చెప్పండి చూద్దాం.
మూడు రాజధానుల బిల్లుపై ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటారు. మేము ఎప్పుడు కావాలంటే అప్పుడు పెడతాం. అందులో ఎలాంటి అభ్యంతరం లేదు. మా ప్రభుత్వం వికేంద్రీకరణకే కట్టుబడి ఉంది. ఈ విషయంలో ఎలాంటి మార్పులేదని మరోసారి స్పష్టం చేస్తున్నాం.

LEAVE A RESPONSE