-సౌత్ సెంట్రల్ రైల్వే ( ఎస్.సీ.ఆర్ ) పరిధిలో 17,134 ఉద్యోగాల ఖాళీలు
-రాజ్యసభలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ వెల్లడించారన్న వినోద్ కుమార్
-రైల్వే శాఖలోని ఉద్యోగాల భర్తీ కోసం రాష్ట్రం నుంచి ఎన్నికైన -నలుగురు బీజేపీ ఎంపీలు ఎందుకు పట్టించు కోవడం లేదు
-రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్
రైల్వే శాఖలో ఖాళీగా ఉన్న 3 లక్షల 15 వేల 823 ( 3,15,823 ) వివిధ కేటగిరీల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు.
రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులు మల్లికార్జున ఖర్గే అడిగిన ప్రశ్నకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ రాతపూర్వకంగా సమాధానమిస్తూ.. రైల్వే శాఖలో ఉన్న ఖాళీ ఉద్యోగాల జాబితాను విడుదల చేశారని వినోద్ కుమార్ తెలిపారు.
కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ రాజ్యసభలో విడుదల చేసిన ఖాళీల జాబితా ప్రకారం సికింద్రాబాద్ కేంద్రంగా ఉన్న సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో కూడా 17,134 వివిధ కేటగిరీల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని వినోద్ కుమార్ వివరించారు.
రాష్ట్రం నుంచి ఎన్నికైన నలుగురు బీజేపీ ఎంపీలు ఖాళీగా ఉన్న రైల్వే ఉద్యోగాల భర్తీ కోసం ఎందుకు పట్టించుకోవడం లేదని వినోద్ కుమార్ ప్రశ్నించారు.రాష్ట్రానికి చెందిన నిరుద్యోగ యువకులు రైల్వే ఉద్యోగాల కోసం దరఖాస్తులు చేసుకొని ఉద్యోగ అవకాశాలు పొందే విధంగా బిజెపి రాష్ట్ర ఎంపీలు కృషి చేయాలని వినోద్ కుమార్ సూచించారు.
రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ కోసం రాష్ట్ర ప్రభుత్వం పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నోటిఫికేషన్స్ జారీ చేస్తూ.. ఉద్యోగ నియామకాల ప్రక్రియను వేగవంతం చేసిన విషయాన్ని వినోద్ కుమార్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం కూడా రైల్వే శాఖ తో పాటు వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ కోసం చర్యలు తీసుకోవాలని, ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగాల భర్తీ కోసం కృషి చేయాలని వినోద్ కుమార్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి డిమాండ్ చేశారు.