– ముఖ్యమంత్రిగా చంద్రబాబు పాలన భేష్
– ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు
గురజాల: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు 30 ఏళ్ల క్రితం తొలిసారి సెప్టెంబర్ 1వ తేదీన 1995లో ఇదే రోజున సిఎంగా బాధ్యతలు చేపట్టారని గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అన్నారు. ఈ మూడు దశాబ్దాల కాలంలో నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా చంద్రబాబు తెచ్చిన 30 అతి కీలకమైన పథకాలు, కార్యక్రమాలు, సంస్కరణలతో రాష్ట్ర ప్రజలు, మహిళలు ఎన్నో సంక్షేమ పథకాలను అందుకుంటున్నారని చెప్పారు. ఈ మేరకు ఎమ్మెల్యే సోమవారం మీడియాతో మాట్లాడారు. దేశంలోనే సంచలనం.. ప్రజల వద్దకు పాలన తీసుకు వచ్చిన వారిలో మొదటి సీఎంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉంటారని కొనియాడారు.
ముందెన్నడూ చూడని ప్రజల భాగస్వామ్యంతో జన్మభూమి కార్యక్రమంతో ఎన్నో పల్లెలు, పట్టణాల్లో వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి జరిగిందని తెలిపారు. ప్రజా చైతన్యంతో క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమంతో పాటు, బాలికా విద్యకు ప్రాధాన్యం ఇచ్చారని అన్నారు. మహిళలకు దీపం పథకం ఏర్పాటు చేశారని, కుల వృత్తులకు గౌరవం కల్పించారని, బిసిలకు ఆదరణ పథకం, ఎస్సీల రక్షణ కోసం కమిషన్ సూచనల అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. బిసిలకు, మహిళలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు, మైనారిటీలకు సంక్షేమం, భద్రత, ప్రత్యేక పథకాలు అందిస్తూ, తొలి సారి డ్వాక్రా మహిళా సంఘాల ఏర్పాటు చేశారని చెప్పారు. విద్యుత్ రంగ సంస్కరణల అమలు, ఫలితాల సాధన, ప్రైవేటు రంగంలో తొలి విమానాశ్రయం, టెలికాం సంస్కరణలకు కీలక సూచనలు, పిపిపి విధానంలో నేషనల్ హైవేస్ కు అంకురార్పణ గ్రామగ్రామాన రోడ్ల నిర్మాణం, ఐటీకి ప్రాధాన్యం కల్పించారన్నారు.